ప్రైవేట్‌ ఉద్యోగులకు తీపికబురు | Sakshi
Sakshi News home page

ప్రైవేట్‌ ఉద్యోగులకు తీపికబురు

Published Wed, Apr 3 2019 12:56 PM

SC Paved The Way For Higher Pension To All Private Sector Employees - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : పదవీవిరమణ అనంతరం పెద్దగా ప్రయోజనాలు అందుకోని ప్రైవేట్ రంగ ఉద్యోగులకు ఊరట లభించింది. ప్రైవేట్‌ ఉద్యోగులు సైతం రిటైర్మెంట్ సమయంలో అధిక పెన్షన్ అందుకునేందుకు మార్గం సుగమమైంది. పూర్తిస్దాయి వేతనం ప్రాతిపదికన ఉద్యోగులకు పెన్షన్‌ చెల్లించాలంటూ గతంలో కేరళ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ఈపీఎఫ్‌వో దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు తోసిపుచ్చింది. సర్వోన్నత న్యాయస్ధానం ఉత్తర్వులతో ప్రైవేట్ ఉద్యోగులకూ భారీగా పెన్షన్‌ అందుకునేందుకు అవకాశం ఏర్పడింది.


ప్రస్తుతం ఈపీఎఫ్‌వో ఉద్యోగులకు వారి వాస్తవ వేతనంపై కాకుండా రూ.15,000 వేతనం ప్రాతిపదికన పెన్షన్‌ను లెక్కగడుతున్న సంగతి తెలిసిందే. సుప్రీం కోర్టు నిర్ణయంతో ఉద్యోగులకు వారి పూర్తి వేతనం ప్రాతిపదికన పెన్షన్‌ను లెక్కగట్టడంతో ఉద్యోగులు పదవీవిరమణ అనంతరం పెద్దమొత్తంలో పెన్షన్‌ అందుకునే వెసులుబాటు కలిగింది. ఇక సుప్రీం కోర్టులో ఈపీఎఫ్‌వో అప్పీల్ తిరస్కరణ నేపథ్యంలో ఉద్యోగుల పెన్షన్ భారీగా పెరగనుండగా ప్రావిడెంట్ ఫండ్ వాటా తగ్గనుంది. అదనపు కంట్రిబ్యూషన్ అనేది పీఎఫ్‌కు కాకుండా ఈపీఎస్‌కు వెళ్తుంది.


ఈపీఎస్ మదింపే కీలకం..
కేంద్ర ప్రభుత్వం 1995లో ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ (ఈపీఎస్)ను ప్రారంభించింది. ఇందులో కంపెనీ ఉద్యోగి వేతనంలో 8.33 శాతాన్ని పెన్షన్ స్కీమ్‌లో జమచేయాలి. అయితే ఈ కంట్రిబ్యూషన్‌ ఉద్యోగి వాస్తవ వేతనంతో నిమిత్తం లేకుండా రూ.6,500లో 8.33 శాతానికి మాత్రమే పరిమితం. అంటే ఈపీఎస్‌ ఖాతాకు నెలకు గరిష్టంగా కేవలం రూ.541 మాత్రమే జమవుతాయి.


ఇక 1996 మార్చిలో కేంద్ర ప్రభుత్వం మరికొన్ని మార్పులు చేసింది.  2014 సెప్టెంబర్ 1న మళ్లీ ఈపీఎఫ్‌వో ఈపీఎస్ నిబంధనలను సవరించింది. ఉద్యోగి వేతనం ఎంతైనా రూ.15,000 ప్రాతిపదికన 8.33 శాతాన్ని ఈపీఎస్‌కు జమ చేసుకోవచ్చని మార్పులు చేసింది. అంటే నెలకు గరిష్టంగా రూ.1,250 ఈపీఎస్ ఖాతాకు జమవుతుంది.  మరోవైపు పూర్తి వేతనంపై పెన్షన్ అవకాశాన్ని ఎంపిక చేసుకుంటే గత ఐదేళ్ల వేతనం సగటు ప్రాతిపదికన పెన్షన్ ఉంటుందని పేర్కొంది. గత ఏడాది వేతనం సగటును పరిగణనలోకి తీసుకోబోమని పేర్కొంది.

ఈ నిబంధనను వ్యతిరేకిస్తూ కొందరు ఉద్యోగులు కేరళ హైకోర్టును ఆశ్రయించారు. దీంతో ఆయా నిబంధనలను పక్కనపెట్టిన కోర్టు పా విధానాన్నే అనుసరించాలని ఆదేశించింది. దీన్ని సవాల్ చేస్తూ ఈపీఎఫ్‌వో సుప్రీం కోర్టుకు వెళ్లగా పూర్తిస్దాయి వేతనంపైనే పెన్షన్‌ లెక్కగట్టాలన్న హైకోర్టు వాదనను సమర్ధిసూ ఈపీఎఫ్‌ఓ అప్పీల్‌ను సర్వోన్నత న్యాయస్ధానం తిరస్కరించింది.

Advertisement
Advertisement