రియల్టీ అంటే... ఇల్లొక్కటే కాదు | Sakshi
Sakshi News home page

రియల్టీ అంటే... ఇల్లొక్కటే కాదు

Published Mon, Oct 3 2016 12:58 AM

రియల్టీ అంటే... ఇల్లొక్కటే కాదు

- స్థలాలపై పెట్టుబడులూ పరిశీలించొచ్చు
సాధారణంగా రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడి అంటే నివాస గృహం కొనుక్కోవడమే... అనే భావన చాలా మందిలో ఉంటుంది. కానీ రెసిడెన్షియల్ ప్రాపర్టీలు మాత్రమే కాకుండా ఇందులోనూ వివిధ రకాలున్నాయి. అసలు రియల్టీలో పెట్టుబడి సరైనదేనా? స్థిరాస్తి కొనే ముందు పరిశీలించాల్సిన అంశాలేమిటి? రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడులకు వేరే ప్రత్యామ్నాయాలున్నాయా? ఒకసారి చూద్దాం..
 
రియల్ ఎస్టేట్ అంటే నివాస గృహాలే అని చాలా మంది భావించినప్పటికీ... నిజానికి ఈ పెట్టుబడి సాధనాన్ని రెసిడెన్షియల్ ప్రాపర్టీలు, కమర్షియల్ ప్రాపర్టీలు, వ్యవసాయ భూములు, పారిశ్రామిక స్థలం అని.. రకరకాలుగా వర్గీకరించొచ్చు.  గడిచిన కొన్నేళ్లుగా చూస్తే.. హౌసింగ్ ప్రాపర్టీలు వార్షికంగా సగటున 14-16 శాతం మేర రాబడినిస్తున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఇక వాణిజ్య భవంతులు, పారిశ్రామిక స్థలాలు మొదలైన రియల్ ఎస్టేట్ పెట్టుబడుల విలువ కూడా గణనీయంగానే పెరిగింది. బ్యాంకు ఫిక్సిడ్ డిపాజిట్లతో పోలిస్తే రియల్ ఎస్టేట్ మెరుగైన రాబడులు అందిస్తున్న నేపథ్యంలో రియల్టీలో ఇన్వెస్ట్ చేయడం వివేకవంతమైన ఆలోచనే. కాకపోతే రియల్టీలో ఇన్వెస్ట్ చేసే ముందు ఆలోచించాల్సిన అంశాలు కొన్ని ఉన్నాయి. అవి...
 
రియల్టీలో వివిధ రకాలు
మనలో చాలా మంది స్థిరాస్తి పెట్టుబడులకు సంబంధించి ముందుగా సొంతింటికే ప్రాధాన్యమిస్తారు. అయితే, ఒకవేళ  తల్లిదండ్రులకు చెందిన సొంత ఇంట్లో నివసించే అవకాశమున్నా.. లేదా జీవిత భాగస్వామి అప్పటికే ఒక ఇల్లు కొనేసి ఉంచినా... మళ్లీ ప్రత్యేకంగా నివాసానికి మరో ఇల్లు కొనడం ఎంతవరకు అవసరమన్నది బేరీజు వేసుకోవాలి. ఒకవేళ ఇల్లు కొని అద్దెకిచ్చే ఉద్దేశం ఉన్న పక్షంలో కమర్షియల్ ప్రాపర్టీని తీసుకుని అద్దెకిస్తే మరింత ఎక్కువ ఆదాయం వచ్చే అవకాశముంటుంది.

ఒకవేళ మీ దగ్గర ఏ తరహా రియల్టీ ఆస్తులూ లేనట్లయితే... నిరభ్యంతరంగా ముందు రెసిడెన్షియల్ ప్రాపర్టీతోనే మొదలుపెట్టవచ్చు.  ఇది కాకుండా.. భవిష్యత్‌లో స్థలాల రేట్లు బాగా పెరిగే అవకాశమున్న ప్రాంతాల్లో వ్యవసాయ భూమి, పారిశ్రామిక స్థలాలు మొదలైన వాటిలో కూడా ఇన్వెస్ట్ చేయడాన్ని పరిశీలించవచ్చు. వీటిలో పెట్టుబడులు తక్షణ రాబడులు అందించకపోయినప్పటికీ.. ఆఖర్లో విక్రయించినప్పుడు లాభం.
 
అనువైన ప్రాంతాలు
ఏ రకమైన రియల్ ఎస్టేట్‌లో ఇన్వెస్ట్ చేసినప్పటికీ.. సదరు స్థిరాస్తి ఉన్న ప్రాంతం చాలా కీలకమైనది. వేగంగా ఎదుగుతున్న పారిశ్రామిక వాడలు, టెక్నాలజీ పార్క్‌లకు దగ్గర్లో ఉన్న ప్రాపర్టీలపై పెట్టే పెట్టుబడులు... స్వల్పకాలంలో అత్యధిక రాబడులు ఇచ్చే వీలుంటుంది. అలాగే,  పోష్ ఏరియాల్లో ప్రాపర్టీ కొంటే అద్దెల రూపంలో అధిక ఆదాయం రావడంతో పాటు ధనవంతులుండే ప్రాంతాలు కాబట్టి స్థిరాస్తి విలువ కూడా గణనీయంగా పెరుగుతుంది.
 
మౌలిక సదుపాయాలు
నివాస గృహాలు కావచ్చు, వాణిజ్య సంబంధ ప్రాపర్టీలు కావొచ్చు.. మౌలిక సదుపాయాలున్నాయో లేదో చూసుకోవాలి. అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్‌ల విషయానికొస్తే.. సరైన సెక్యూరిటీ, నిరంతరాయ విద్యుత్ సరఫరా, సమృద్ధిగా నీటి లభ్యత,  రవాణా వ్యవస్థ,  అన్నింటికీ మించి భద్రత మొదలైన  అంశాలు పరిశీలించుకోవాలి. కాలుష్యం, ట్రాఫిక్ రద్దీ తక్కువగా ఉండే ప్రాంతం ఎంచుకోవాలి.

ఒకవేళ పిల్లలున్న పక్షంలో విద్యా సంస్థలు, ఆస్పత్రులు దగ్గర్లో ఉండే ఇంటిని ఎంచుకుని ఇన్వెస్ట్ చేయడం మంచిది. కాబట్టి, చెప్పొచ్చేదేమిటంటే.. రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడులంటే కేవలం రెసిడెన్షియల్ ప్రాపర్టీలు మాత్రమే కాదు.. ఇతరత్రా ప్రాపర్టీలు కూడా ఉన్నాయి. పన్నుపరమైన ప్రయోజనాలతో పాటు పెట్టుబడులపై మంచి రాబడులూ ఇవి అందిస్తాయి.
- అనిల్ రెగో

Advertisement
Advertisement