మాల్యా యూబీ గ్రూప్ కంపెనీలపై సెబీ దర్యాప్తు ముమ్మరం | Sakshi
Sakshi News home page

మాల్యా యూబీ గ్రూప్ కంపెనీలపై సెబీ దర్యాప్తు ముమ్మరం

Published Mon, May 9 2016 1:19 AM

మాల్యా యూబీ గ్రూప్ కంపెనీలపై సెబీ దర్యాప్తు ముమ్మరం

న్యూఢిల్లీ: మాల్యాకు దెబ్బ మీద దెబ్బ పడుతోంది. ఆయనకు చెందిన యూబీ గ్రూప్ సంబంధిత పలు లిస్టెడ్ కంపెనీల పై మార్కెట్ రెగ్యులేటర్ సెబీ పూర్తి నిఘా ఉంచింది. ఈ కంపెనీల ఆర్థిక కార్యకలాపాల్లో తీవ్రమైన అవకతవకలు జరిగి ఉంటాయని నియంత్రణా సంస్థ అనుమానిస్తోంది. ఇక్కడ ప్రమోటర్ల ద్వారా నిధుల మళ్లింపు జరిగి ఉండొచ్చనే కోణంలో సెబీ దర్యాప్తును ముమ్మరం చేసింది.

కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సహా సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ (ఎస్‌ఎఫ్‌ఐఓ) వంటి దర్యాప్తు సంస్థలు కూడా ఈ అంశంపై దృష్టి కేంద్రీకరించాయని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.

అలాగే ప్రమోటర్లు, ఇతర సంబంధిత పార్టీలు.. ఇన్‌సైడర్ డీలింగ్స్ సహా ఇతర సెక్యూరిటీస్ మార్కెట్ నిబంధనలను ఏమైనా అతిక్రమించారా? అన్న అంశంపై సెబీ విచారణ జరుపుతోందని పేర్కొన్నారు. ‘ఇటీవల జరిగిన ఒక ఫోరెన్సిక్ ఆడిట్‌లో మంగళూరు కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ (ఎంసీఎఫ్‌ఎల్) కంపెనీ ఇతర గ్రూప్ కంపెనీల్లో పెట్టిన ఇన్వెస్ట్‌మెంట్స్ సక్రమంగా లేవనే అంశం వెల్లడయ్యింది. ఈ నేపథ్యంలో యూబీ గ్రూప్‌కు చెందిన ఇతర కంపెనీలు కూడా వాటి ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి దర్యాప్తును ఎదుర్కోవలసి వస్తోందని’ వివరించారు.

Advertisement
Advertisement