Sakshi News home page

రూ. 3 వేల కోట్లు కట్టండి...

Published Wed, Jul 16 2014 2:32 AM

రూ. 3 వేల కోట్లు కట్టండి...

ముంబై: దేశంలో అతిపెద్ద కార్పొరేట్ కుంభకోణంగా సంచలనం సృష్టించిన ఒకప్పటి సత్యం కంప్యూటర్స్ కేసులో స్టాక్ మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ ఎట్టకేలకు కొరడా ఝుళిపించింది. సుమారు ఐదున్నరేళ్ల సుదీర్ఘ దర్యాప్తు అనంతరం ఆ కంపెనీ వ్యవస్థాపకుడు బి. రామలింగరాజు, మరో నలుగురిని స్టాక్ మార్కెట్లలో ఎలాంటి లావాదేవీలు జరపకుండా 14 ఏళ్లపాటు నిషేధం విధిస్తూ మంగళవారం ఆదేశాలు జారీచేసింది.

 అంతేకాదు... ఈ స్కామ్‌లో చట్టవిరుద్ధంగా ఆర్జించిన రూ.1,849 కోట్ల మొత్తాన్ని వడ్డీతోసహా చెల్లించాలని స్పష్టం చేసింది. 2009, జనవరి 7 నుంచి(రామలింగరాజు లేఖతో ఈ మెగా స్కామ్ బయటపడిన రోజు) ఈ మొత్తంపై 12 శాతం వార్షిక వడ్డీని కట్టాలని, 45 రోజుల్లోగా సెబీకి నగదును డిపాజిట్ చేయాలని 65 పేజీల తుది ఆదేశాల్లో సెబీ పేర్కొంది. సెబీ పేర్కొన్న ప్రకారం వడ్డీ మరో రూ.1,220 కోట్లు అవుతుందని అంచనా. అంటే.. రాజు, మిగతా నలుగురు కలిపి సెబీకి కట్టాల్సిన మొత్తం సుమారు రూ. 3,069 కోట్లుగా లెక్కతేలుతోంది.

నిషేధానికి గురైనవారిలో రామలింగరాజు సోదరుడు(అప్పటి సత్యం ఎండీ) బి.రామరాజు, వడ్లమాని శ్రీనివాస్(మాజీ సీఎఫ్‌ఓ), జి.రామకృష్ణ(మాజీ వైస్ ప్రెసిడెంట్), వి.ఎస్. ప్రభాకర గుప్తా(కంపెనీ అంతర్గత ఆడిట్ మాజీ హెడ్) ఉన్నారు. 14 ఏళ్లపాటు స్టాక్ మార్కెట్లో షేర్ల కొనుగోలు, అమ్మకంగానీ... ప్రత్యక్షంగా లేక పరోక్షంగా షేర్ల లావాదేవీల్లో పాలుపంచుకోవడం లేదా మార్కెట్‌తో ఏవిధంగానూ సంబంధాలు ఉండకుండా నిషేధిస్తున్నట్లు సెబీ స్పష్టంచేసింది.
 
పక్కా స్కెచ్‌తోనే...
 ‘ఈ ఐదుగురు వ్యక్తులూ పక్కా వ్యూహంతో అత్యంత చాకచక్యమైన కార్పొరేట్ మోసానికి పాల్పడినట్లు స్పష్టమైంది. సొంత లాభాలకోసం కావాలనే చట్టవ్యతిరేక కార్యకలాపాలకు తెరతీశారు. కంపెనీతోపాటు షేర్లలో పెట్టుబడిపెట్టిన ఇన్వెస్టర్లను ముంచేశారు’ అని సెబీ తన ఆదేశాల్లో పేర్కొంది. చట్టవిరుద్ధంగా ఆర్జించిన సొమ్మును వెనక్కిరప్పించే ఆదేశాలు జారీచేసేందుకు ప్రభుత్వం ఆర్డినెన్స్‌ద్వారా కల్పించిన అధికారాలను సెబీ ఈ కేసులో ఉపయోగించింది. సత్యం కేసులో బయటపడిన ఆర్థిక నేరాలు ఇన్వెస్టర్ల ప్రయోజనాలను తీవ్రంగా దెబ్బతీసేవిధంగా, స్టాక్ మార్కెట్ సమగ్రతకు ముప్పుతెచ్చేలా ఉన్నాయని కూడా సెబీ అభిప్రాయపడింది. ఇలాంటి మోసాలకు పాల్పడ్డవారికి కఠిన శిక్షలు ఉంటాయన్న సందేశాన్ని  మార్కెట్‌కు పంపడం కోసమే ఈచర్యలని సెబీ తన ఆదేశాల్లో వ్యాఖ్యానించింది.

 అధిక ధరల్లో షేర్లను అమ్ముకున్నారు..
 రామలింగరాజు సోదరులు షేర్ల విక్రయం ద్వారా రూ.543.98 కోట్లు, కొన్ని షేర్ల తనఖా ద్వారా రూ.1,258.88 కోట్లమేర చట్టవిరుద్ధమైన లాభాలను గడించినట్లు సెబీ తన ఆదేశాల్లో పేర్కొంది. దీంతోపాటు నిషేధానికి గురైన శ్రీనివాస్ రూ.29.5 కోట్లు, రామకృష్ణ రూ11.5 కోట్లు, గుప్తా రూ.5.12 కోట్ల విలువైన అక్రమార్జనకు షేర్లవిక్రయం ద్వారా పాల్పడ్డారని తేల్చింది. వాస్తవ ఆర్థిక ఫలితాలను దాచిపెట్టి..  ఇన్వెస్టర్లను తప్పుదారిపట్టించేలా ఫలితాలను పెంచి ప్రకటించారని సెబీ తెలిపింది. దీనివల్ల షేర్ల కదలికలను ప్రభావితం చేయడంద్వారా సొంత ప్రయోజనాలను నెరవేర్చుకున్నట్లు తమ దర్యాప్తులో తేలినట్లు వెల్లడించింది.

రామలింగరాజు(అప్పటి సత్యం చైర్మన్), రామరాజు(అప్పటి ఎండీ)లు ఖాతాలను తారుమారుచేసిన త్రైమాసికాలకు సంబంధించి ఇన్‌సైడర్లుగా వ్యవహరించారని పేర్కొంది. ఇక శ్రీనివాస్, రామకృష్ణ, గుప్తాలు ఖాతా పుస్తకాల్లో సత్యం ఆర్థికాంశాల్లో అవకతవకలకు పాల్పడ్డారని సెబీ పేర్కొంది. షేర్ల ధరలను ప్రభావితం చేసే ప్రచురితంకాని సమాచారాన్ని(యూపీఎస్‌ఐ) దాచిపెట్టి... ఖాతాల్లో అవకతవకలకు పాల్పడ్డ సమయంలో తమ షేర్లను అధిక ధరలకు అమ్ముకోవడం, తనఖా పెట్టడం(రుణాల కోసం) ద్వారా అక్రమంగా లాభాలను సంపాదించారని తెలిపింది.


 కంపెనీ వాస్తవ ఆర్థిక పరిస్థితి తెలియకపోవడం.. పటిష్టమైన స్థితిలో ఉందన్న సమాచారంతో షేరు ధర ఎక్కువగా ట్రేడయ్యేందుకు తోడ్పడిందని, స్టాక్ మార్కెట్లో సత్యం షేరు అధిక ధరల్లో ట్రేడవుతున్న ఈ సమయంలో రాజు సోదరులు దీన్ని తమకు అనుకూలంగా మలచుకున్నారని సెబీ స్పష్టం చేసింది. క్రమం తప్పకుండా(ప్రతి మూడునెలలకోసారి) కంపెనీ ఆర్థిక గణాంకాలను నిక్కచ్చిగా వెల్లడించడం లిస్టెడ్ కంపెనీల నైతికనియమావళిలో ఒక భాగమని.. స్టాక్‌మార్కెట్ సమగ్రతకు కూడా ఇది చాలా కీలకమని సెబీ వ్యాఖ్యానించింది.
 
 ఇది సహజ న్యాయసూత్రాలకు విరుద్ధం
 హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: స్టాక్ మార్కెట్ లావాదేవీల్లో అవకతవకలకు పాల్పడిన సత్యం కంప్యూటర్స్ మాజీ ఎగ్జిక్యూటివ్‌లపై సెబీ విధించిన అపరాధ రుసుము వడ్డీతో కలుపుకొని రూ. 3,069 కోట్లుంటుందని ఢిల్లీకి చెందిన కార్పొరేట్ లాయర్ అమిత్ గర్గ్ చెప్పారు. ఈ మొత్తాన్ని 45 రోజుల్లో చెల్లించాలని ఉత్తర్వులివ్వడం సహజ న్యాయ సూత్రాలకు భిన్నంగా ఉందన్నారు. ఈ మధ్య సెబీ పలు కార్పొరేట్ కేసుల్లో భారీ జరిమానాలు విధిస్తూ, స్వల్పకాలంలోనే ఆ మొత్తాన్ని చెల్లించమంటూ ఉత్తర్వులు జారీచేస్తున్నదని, ఇది న్యాయసూత్రాలకు విరుద్ధమని ఆయన వివరించారు. దాంతో కార్పొరేట్లు పైస్థాయికి అప్పీలుకు వెళుతున్నారన్నారు.

 సెబీ ఉత్తర్వును సత్యం కంప్యూటర్స్ మాజీ ప్రమోటర్లు సెక్యూరిటీస్ అప్పిలేట్ ట్రిబ్యునల్‌లో సవాలు చేసే అవకాశం ఉందన్నారు. ఒక వేళ ట్రిబ్యునల్‌లో కూడా వాళ్లకు వ్యతిరేకంగా తీర్పు వస్తే... తదుపరి సుప్రీం కోర్టులో అప్పీలు చేసుకునే అవకాశం ఉందన్నారు. సుప్రీంకోర్టు కూడా సెబీ ఉత్తర్వులను సమర్థిస్తే రామలింగరాజు, తదితరులు ఆ మొత్తాన్ని చెల్లించాల్సివుంటుందని, చెల్లించలేకపోతే ఆస్తులను అటాచ్‌చేయడం జరుగుతుందని ఆయన వివరించారు. ఆదాయపు పన్ను శాఖలానే సెబీ రికవరీ యంత్రాంగం కూడా పటిష్టంగా వుందని, సత్యం కంప్యూటర్స్ మాజీ ప్రమోటర్ల నుంచి జరిమానా మొత్తాన్ని వసూలుచేయడానికి సెబీ అన్ని చర్యలూ చేపడుతుందని కార్పొరేట్ పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.
 
 ‘సత్యం’ పతనం ఇలా..
 దేశంలో 4వ అతిపెద్ద సాఫ్ట్‌వేర్ కంపెనీగా వెలుగొందుతున్న సమయంలో సత్యం కంప్యూటర్స్ పతనానికి 2008 డిసెంబర్ 16న కౌంట్‌డౌన్ మొదలైంది.

 రామంలింగరాజు కుమారులు తేజరాజు, రామరాజులు ప్రమోట్ చేసిన మేటాస్ ఇన్‌ఫ్రా అనే కంపెనీలో 51 శాతం వాటాను, మేటాస్ ప్రాపర్టీస్‌లో 100 శాతం వాటాను కొనుగోలు చేస్తున్నట్లు సత్యం ఆ రోజున ప్రకటించింది. దీనికి 1.6 బిలియన్ డాలర్లను చెల్లించాలని నిర్ణయించింది.

 అయితే, ఈ డీల్‌ను కంపెనీ ఇన్వెస్టర్లు తీవ్రంగా వ్యతిరేకించడంతో మర్నాడే అంటే 2008, డిసెంబర్ 17న ప్రతిపాదనను విరమించుకున్నారు.

 2009, జనవరి 7న సత్యం డెరైక్టర్ల బోర్డుకు రాజీనామా చేస్తున్నట్లు రామలింగరాజు ప్రకటించారు. కంపెనీ ఆదాయాలు, ఆస్తులను చాలాఏళ్లపాటు ఎక్కువచేసి చూపుతూ వస్తున్నామని.. తప్పుడు ఆర్థిక ఫలితాలను ప్రకటించినట్లు స్వయంగా ఒప్పుకుంటూ బోర్డుకు ఒక లేఖ రాశారు. సెబీకి కూడా ఈ లేఖ ప్రతిని ఈ-మెయిల్ చేశారు.

 సెబీ దర్యాప్తు ప్రకారం ఈ ఆర్థిక అవకతవకల స్కామ్ విలువ సుమారు రూ.12,320 కోట్లుగా అంచనా.

 మొత్తానికి ఫిక్స్‌డ్ డిపాజిట్లలో రూ.3,308 కోట్ల నగదును లేనిది ఉన్నట్లుగా చూపేందుకు నకిలీ బ్యాంక్ ఖాతాలను, రిసీట్‌లను సృష్టించినట్లు సెబీ దర్యాప్తులో తేలింది. రూ.4,783 కోట్ల మేర ఆదాయాలను పెంచిచూపడానికి ఫోర్జరీ ఇన్‌వాయిస్‌లు, డాక్యుమెంట్లను సృష్టించారని,. 5-6 ఏళ్లపాటు ఈ తంతు నడిచిందని సెబీ పేర్కొంది.

 ఇంకా రూ.500 కోట్ల మేర లేని అప్పును కూడా నకిలీ రుణదాతల పేరుతో సత్యం ఖాతాల్లో సృష్టించినట్లు సెబీ తన దర్యాప్తులో కనుగొంది.

 ఈ భారీ ఖాతాల కుంభకోణం వెలుగులోకిరావడం... సీబీఐ విచారణకు అదేశించడంతో రామలింగరాజు అరెస్టయ్యారు. ఆ తర్వాత నవంబర్ 2011న ఆ యనకు బెయిల్ లభించింది. ఈ కేసు కోర్టులో ప్రస్తుతం విచారణలో ఉంది.
 
  స్కామ్‌లో కూరుకుపోయిన కంపెనీని విక్రయించేందుకు ప్రభుత్వం  చొరవతీసుకోవడంతో చివరకు టెక్ మహీంద్రా... సత్యంను చేజిక్కించుకుని దాని పేరును మహీంద్రా సత్యంగా మార్చింది.

 
  ఆతర్వాత మహీంద్రా సత్యంకూడా టెక్ మహీంద్రాలో గతేడాది పూర్తిగా విలీనంకావడంతో సత్యం కంపెనీ పేరు కాలగర్భంలో కలిసిపోయింది.
 
  సత్యం కుంభకోణం బయటపడిన రోజున(రాజు ప్రకటన) సత్యం షేరు ధర రూ.180 స్థాయి నుంచి ఏకంటా రూ.30కి పడిపోయింది. ఆతర్వాత రూ.11 కనిష్టాన్ని కూడా తాకింది. ఇన్వెస్టర్లు తీవ్రంగా నష్టపోయారు. 2008లో ఒకానొక సమయంలో షేరు ధర రూ.544 స్థాయికీ వెళ్లడం గమనార్హం.

Advertisement

What’s your opinion

Advertisement