బ్లూచిప్ షేర్ల ర్యాలీపై సెబి కన్ను | Sakshi
Sakshi News home page

బ్లూచిప్ షేర్ల ర్యాలీపై సెబి కన్ను

Published Mon, Feb 16 2015 1:50 AM

బ్లూచిప్ షేర్ల ర్యాలీపై సెబి కన్ను

న్యూఢిల్లీ: బ్లూచిప్‌లతో సహా పలు కంపెనీల షేర్లు హఠాత్తుగా పెరగడం లేదా తగ్గడం, వాటి ట్రేడింగ్‌లో భారీ టర్నోవర్ నమోదుకావడంపై మార్కెట్ నియంత్రణా సంస్థ సెబి దృష్టిపెట్టింది. ఎక్స్ఛేంజీలకు తగిన వివరణనివ్వని కంపెనీలపై సెబి చర్యలకు ఉపక్రమించింది. ఈ ఏడాది ఆరంభం నుంచి దాదాపు నెలన్నరకాలంలో వివిధ షేర్ల ర్యాలీకి సంబంధించి ఆయా కంపెనీల నుంచి స్టాక్ ఎక్స్ఛేంజీల నుంచి వివరణ కోరాయి.

వీటిలో మహీంద్రా అండ్ మహీంద్రా, హిందుస్థాన్ యూనీలీవర్, ఎస్‌బీఐ, కోల్ ఇండియా, విప్రో, హీరోమోటో కార్ప్, ఐసీఐసీఐ బ్యాంక్, సిప్లా, ఎల్ అండ్ టీ తదితర సెన్సెక్స్ బ్లూచిప్ కంపెనీల షేర్లున్నాయి. ఈ సెన్సెక్స్ కంపెనీలతో పాటు ఈ ఏడాది ఇప్పటివరకూ దాదాపు 100 కంపెనీలకు నోటీసులు జారీ అయ్యాయి. నోటీసులు అందుకున్న కంపెనీల్లో పిపవావ్ డిఫెన్స్, సుజ్లాన్ ఎనర్జీ, క్లారిస్ లైఫ్, ఐడీఎఫ్‌సీ, అదాని ఎంటర్‌ప్రైజెస్, ఇప్కా లాబ్స్, ఆర్‌ఈఐ ఆగ్రో, ఎంఆర్‌ఎఫ్, పంజ్‌లాయడ్, బ్లూడార్ట్, పీవీఆర్, ఐఆర్‌బీ ఇన్‌ఫ్రా, పిరమల్ ఎంటర్‌ప్రైజెస్‌లు వున్నాయి.

స్టాక్ ఎక్స్ఛేంజీల ద్వారా ఇన్వెస్టర్లకు ముందస్తు సమాచారం ఇవ్వకుండా, వాటి షేరు ధరల్ని ప్రభావితం చేసే కీలక వాణిజ్య పరిణామాలకు సంబంధించిన వార్తలు మీడియాలో రావడంపై ఆయా కంపెనీలను ఎక్స్ఛేంజీలు వివరణ కోరాయి. అయితే చాలా కంపెనీలు సమాధానం ఇవ్వకపోవడం లేదా సంతృప్తికర వివరణ ఇవ్వకపోవడంతో తదుపరి చర్యల కోసం ఈ కేసుల్ని ఎక్ఛేంజీలు సెబికి నివేదించాయి.

Advertisement
Advertisement