36,000 పాయింట్ల పైకి సెన్సెక్స్‌ | Sakshi
Sakshi News home page

36,000 పాయింట్ల పైకి సెన్సెక్స్‌

Published Sat, Dec 29 2018 3:09 AM

Sensex Closes 269 Points Higher Nifty Settles At 10859 - Sakshi

రూపాయి పుంజుకోవడం, సానుకూల అంతర్జాతీయ సంకేతాల నేపథ్యంలో స్టాక్‌ మార్కెట్‌ శుక్రవారం లాభాల్లో ముగిసింది. జనవరి సిరీస్‌ లాభాలతో శుభారంభం చేసింది. వరుసగా మూడో రోజూ స్టాక్‌ సూచీలు లాభపడ్డాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 36 వేల పాయింట్లపైకి ఎగబాకగా, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ కీలకమైన 10,850 పాయింట్ల పైన ముగియగలిగింది. ముడి చమురు ధరల పతనం కొనసాగడం, గురువారం విదేశీ ఇన్వెస్టర్లు రూ. వెయ్యి కోట్ల మేర నికర కొనుగోళ్లు జరపడం  సానుకూల ప్రభావం చూపించాయి.  సెన్సెక్స్‌ 269 పాయింట్లు పెరిగి 36,077 పాయింట్ల వద్ద,  నిఫ్టీ 80 పాయింట్లు పెరిగి 10,860 పాయింట్ల వద్ద ముగిశాయి. టెలికం సూచీ మినహా మిగిలిన అన్ని రంగాల సూచీలు లాభాల్లోనే ముగిశాయి. బ్యాంక్, ఫార్మా, లోహ, వినియోగ, వాహన షేర్లు లాభపడ్డాయి. ఇక వారం పరంగా చూస్తే,  సెన్సెక్స్‌ 335 పాయింట్లు, నిఫ్టీ 106 పాయింట్లు చొప్పున పెరిగాయి.

బ్యాంక్‌ షేర్లకు నిధుల జోష్‌.... 
డాలర్‌తో రూపాయి మారకం 40 పైసలు బలపడి 69.95 వద్ద ముగిసింది. ఇది వారం గరిష్ట స్థాయి. విదేశాల్లో డాలర్‌ బలహీనపడటం, ముడి చమురు ధరలు 18 నెలల కనిష్ట స్థాయికి పడిపోవడంతో రూపాయి పుంజుకుంటోంది. ఏడు ప్రభుత్వ రంగ బ్యాంక్‌లకు కేంద్ర ప్రభుత్వం రూ.28,615 కోట్ల మూలధన నిధులు అందించనున్నదన్న వార్తలు ఇన్వెస్టర్ల సెంటమెంట్‌కు మరింత జోష్‌నిచ్చాయి. ఈ బ్యాంక్‌ నిధుల వార్తల నేపథ్యంలో బ్యాంక్‌ షేర్లు లాభపడ్డాయి. లిక్విడిటీ అనిశ్చితి తొలగిపోవడంతో నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీల షేర్లు పెరిగాయి. జపాన్‌ మినహా మిగిలిన అన్ని ఆసియా మార్కెట్లు లాభపడగా, యూరప్‌ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. ఆసియా మార్కెట్ల జోష్‌తో సెన్సెక్స్‌ భారీ లాభాలతో ట్రేడింగ్‌ను ప్రారంభించింది.

కొనుగోళ్ల జోరుతో రోజంతా లాభాల్లోనే ట్రేడైంది. ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 388 పాయింట్లు, నిఫ్టీ 114 పాయింట్ల వరకూ లాభపడ్డాయి. చివర్లో ఈ లాభాలు ఒకింత తగ్గాయి.  అంతర్జాతీయ దిగ్గజ ప్రైవేట్‌ ఈక్విటీ సంస్థ, వార్‌బర్గ్‌ పింకస్‌తో జాయింట్‌ వెంచర్‌ ఏర్పాటు వార్తల కారణంగా లెమన్‌ ట్రీ హోటల్స్‌ షేర్‌ 8.5 శాతం పెరిగి రూ.75 వద్ద ముగిసింది. రేటింగ్‌ సంస్థ కేర్‌ డబల్‌ ఏ రేటింగ్‌ను ఇవ్వడంతో టాటా స్టీల్‌ బీఎస్‌ఎల్‌ (గతంలో భూషణ్‌ స్టీల్‌) షేర్‌ 3%ఎగసి రూ.39 వద్ద ముగిసింది.  బాటా ఇండియా, ఎస్‌పీఎల్‌ ఇండస్ట్రీస్‌ వంటి 8 షేర్లు తాజా ఏడాది గరిష్ట స్థాయిలను తాకాయి. ప్రిఫరెన్షియల్‌ ప్రాతిపదికన కేంద్ర ప్రభుత్వం రూ.2,159 కోట్లు పెట్టుబడుల పెడుతుండటంతో యునైటెడ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా 9 శాతం లాభపడి రూ.12.59  వద్ద ముగిసింది.    

Advertisement
Advertisement