Sakshi News home page

మార్కెట్లలో రిలీఫ్‌ ర్యాలీ

Published Tue, Mar 27 2018 1:50 AM

Sensex Closes 469 Points Higher - Sakshi

ముంబై: రెండు రోజుల వరస నష్టాలకు ముగింపు పలుకుతూ స్టాక్‌ మార్కెట్లు సోమవారం మంచి ర్యాలీ చేశాయి. అమెరికా–చైనా వాణిజ్య యుద్ధ భయాలు కాస్తంత తెరిపిన పడడంతో తక్కువ విలువల వద్ద స్టాక్స్‌లో కొనుగోళ్లు, షార్ట్‌ కవరింగ్‌ చోటు చేసుకున్నాయి. దీంతో బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 470 పాయింట్లు లాభపడగా, నిఫ్టీ 133 పాయింట్లు పెరిగింది. డాలర్‌తో రూపాయి బలపడడం కూడా సానుకూలించింది.

బ్యాంకులు, ఫైనాన్షియల్స్, మెటల్స్, క్యాపిటల్‌ గూడ్స్, ఆటోమొబైల్‌ కౌంటర్లలో బాగా పడిన స్టాక్స్‌కు కొనుగోళ్ల మద్దతు లభించింది. దీంతో మార్కెట్లు ప్రారంభ నష్టాల నుంచి బయటపడి భారీ లాభాలను మూటగట్టుకున్నాయి. సెన్సెక్స్‌ తిరిగి 33,000 స్థాయిని అధిగమించి ఒక దశలో 33,115 వరకు వెళ్లి చివరికి 33,066.41 వద్ద క్లోజ్‌ అయింది. సెన్సెక్స్‌ 1.44 శాతం (469.87) లాభపడి ఈ నెల 12 (610 పాయింట్లు) తర్వాత ఈ నెలలోనే మరోసారి భారీ లాభాలను చవిచూసింది. అటు నిఫ్టీ సైతం కీలకమైన 10,000 మార్కుపైన 10,143 స్థాయి వరకు వెళ్లి చివరికి 10,130.65 వద్ద స్థిరపడింది.

‘‘ఉదయం మార్కెట్లు ఫ్లాట్‌గా మొదలు కాగా, ఆసియా యూరోప్‌ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు రావడం వాణిజ్య యుద్ధం సమసిపోతుందన్న సంకేతాలను ఇచ్చింది. దీంతో దేశీయ స్టాక్‌ మార్కెట్లు బలమైన ర్యాలీ చేశాయి. తీవ్ర అమ్మకాలను ఎదుర్కొన్న బ్యాంకింగ్‌ రంగంలో షార్ట్‌ కవరింగ్‌ జరగడం లాభాలకు తోడ్పడింది. అయితే, ఫ్యూచర్స్, ఆప్షన్స్‌ ఎక్స్‌పై రీ దగ్గర పడడం, ఈ వారం మార్కెట్‌ మూడు దినాలే పనిచేస్తుండడం వంటి అంశాల నేపథ్యంలో ఇన్వెస్టర్లలో అప్రమత్త ధోరణి కారణంగా అప్‌సైడ్‌కు అవకాశాలు పరిమితమే’’ అని జియోజిత్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ రీసెర్చ్‌ హెడ్‌ వినోద్‌ నా

డీఐఐల భారీ కొనుగోళ్లు
విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐ) నికర అమ్మకం దారులుగా ఉండగా, దేశీయ సంస్థాగత ఇన్వెస్టర్లు కొనుగోళ్లతో మద్దతుగా నిలిచారు. ఎఫ్‌ఐఐ/ఎఫ్‌పీఐలు రూ.741 కోట్ల మేర అమ్మకాలు జరిపారు. అదే సమయంలో డీఐఐలు రూ.2,018 కోట్ల మేర కొనుగోళ్లు జరిపారు. సూచీల లాభాలు వీరే ప్రధాన కారణం. గత శుక్రవారం మత్రం ఎఫ్‌పీఐలు 1,628 కోట్ల విలువైన కొనుగోళ్లు చేయడం గమనార్హం. అదే రోజు డీఐఐలు నికరంగా రూ.935 కోట్ల మేర అమ్మకాలు జరిపారు.

లాభపడిన స్టాక్స్‌: ప్రధానంగా బ్యాంకింగ్‌ రంగ షేర్లు వెలుగులో నిలిచాయి. చాలా స్టాక్స్‌ గణనీయ లాభాలను నమోదు చేసుకున్నాయి. సూచీల్లో యెస్‌ బ్యాంకు 5.67 శాతం, ఎస్‌బీఐ 5 శాతం, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, టాటా స్టీల్‌ 3 శాతం, హెచ్‌డీఎఫ్‌సీ 2.66 శాతం, ఎయిర్‌టెల్‌ 2.55 శాతం, ఎల్‌అండ్‌టీ, ఐసీఐసీఐ బ్యాంకు, ఎంఅండ్‌ఎం, హీరోమోటో కార్ప్‌ 2 శాతం చొప్పున లాభపడ్డాయి. విప్రో, ఇన్ఫోసిస్, టీసీఎస్‌ కౌంటర్లు మాత్రం 4 శాతం వరకు నష్టపోయాయి.

బ్యాంకెక్స్‌ అత్యధికంగా 2.30 శాతం లాభపడింది. మెటల్స్‌ 2.27 శాతం, ఫైనాన్స్‌ 2.26 శాతం, కన్జ్యూమర్‌ డ్యురబుల్స్‌ 2.24 శాతం, టెలికం 1.74 శాతం చొప్పున పెరిగాయి. ఎంఎంటీసీ, ఎస్‌టీసీ విలీన అవకాశాల నేపథ్యంలో, ఎంఎంటీసీ 8 శాతం లాభంతో బీఎస్‌ఈలో రూ.59.05 వద్ద క్లోజ్‌ అయింది. ఎస్‌టీసీ మాత్రం ఒక శాతం లాభానికే పరిమితమైంది. ప్రపంచ వ్యాప్తంగా స్టాక్‌ మార్కెట్లలో షార్ట్‌ కవరింగ్‌ ర్యాలీలు చోటు చేసుకోవడం గమనార్హం. అమెరికా, చైనా మధ్య చర్చలు మొదలయ్యాయన్న సంకేతాలతో యుద్ధభయాలు చల్లబడ్డాయి.

Advertisement

తప్పక చదవండి

Advertisement