33 వేల దిగువకు సెన్సెక్స్‌ | Sakshi
Sakshi News home page

33 వేల దిగువకు సెన్సెక్స్‌

Published Tue, Mar 20 2018 1:33 AM

Sensex closes below 33000 - Sakshi

అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ వడ్డీరేట్ల పెంపు భయాలకు కరెంట్‌ అకౌంట్‌ లోటు (క్యాడ్‌) పెరగడం కూడా జత కావడంతో సోమవారం స్టాక్‌ మార్కెట్‌ నష్టపోయింది. సెన్సెక్స్‌ వరుసగా ఐదో ట్రేడింగ్‌ సెషన్‌లోనూ, నిఫ్టీ వరుసగా నాలుగో ట్రేడింగ్‌ సెషన్‌లోనూ నష్టపోయాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 33 వేల పాయింట్లు, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 10,100 పాయింట్ల దిగువకు పడిపోయాయి. లోహ, టెలికం, బ్యాంక్, టెక్నాలజీ, ఆయిల్, రియల్టీ షేర్లలో అమ్మకాలు కొనసాగడంతో సెన్సెక్స్‌ 253 పాయింట్లు నష్టపోయి 32,923 పాయింట్ల వద్ద, నిఫ్టీ 101  పాయింట్లు నష్టపోయి 10,094 పాయింట్ల వద్ద ముగిశాయి.

స్టాక్‌ సూచీలకు ఈ ఏడాది కనిష్ట స్థాయిలు ఇవే. సెన్సెక్స్, నిఫ్టీలు దాదాపు మూడు నెలల కనిష్టానికి పడిపోయాయి.  సెన్సెక్స్‌  ఒక దశలో 100 పాయింట్లు లాభపడగా, మరో దశలో 319 పాయింట్లు నష్టపోయింది. మొత్తం మీద 419 పాయింట్ల రేంజ్‌లో కదలాడింది. ఈ ఐదు ట్రేడింగ్‌ సెషన్లలో సెన్సెక్స్‌ మొత్తం 995 పాయింట్లు పతనమైంది. 

వచ్చే నెల 1 నుంచి దీర్ఘకాల మూలధన లాభాల పన్ను(ఎల్‌టీసీజీ) విధించనుండటంతో మార్కెట్లో అమ్మకాల జోరు కొనసాగుతోందని నిపుణులంటున్నారు.  ప్రపంచ మార్కెట్ల ఒడిదుడుకుల ప్రభావంతో మన మార్కెట్‌ కుదేలవుతోందని జియోజిత్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ రీసెర్చ్‌ హెడ్‌ వినోద్‌ నాయర్‌ చెప్పారు. బాండ్ల రాబడులు పెరుగుతుండడం, వాణిజ్య యుద్ధ భయాలు.. ఇన్వెస్టర్లను లాభాల స్వీకరణ వైపుకు పురికొల్పుతున్నాయని పేర్కొన్నారు. 

Advertisement
Advertisement