Sakshi News home page

స్వల్ప లాభాలతో సరి..

Published Thu, Jun 9 2016 1:04 AM

స్వల్ప లాభాలతో సరి..

11 పాయింట్ల లాభంతో 27,021కు సెన్సెక్స్
7 పాయింట్ల లాభంతో 8,273కు నిఫ్టీ

 ఒడిదుడుకులమయంగా సాగిన బుధవారం నాటి ట్రేడింగ్‌లో స్టాక్ మార్కెట్ స్వల్పలాభాలతో గట్టెక్కింది. నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకాయన్న వార్తలు, కొనసాగుతున్న విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు, రూపాయి బలపడడం సానుకూల ప్రభావం చూపాయి. అయితే ట్రేడింగ్ చివర్లో లాభాల స్వీకరణ చోటు చేసుకోవడంతో స్టాక్ సూచీలు స్వల్ప లాభాలతోనే సరిపెట్టుకోవలసి వచ్చిందని బీఎన్‌పీ పారిబా మ్యూచువల్ ఫండ్ ఫండ్ మేనేజర్(ఈక్విటీస్) శ్రేయాస్ దేవాల్కర్ పేర్కొన్నారు.

బీఎస్‌ఈ సెన్సెక్స్ 11 పాయింట్ల లాభంతో 27,021 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 7 పాయింట్ల లాభంతో 8,273 పాయింట్ల వద్ద ముగిశాయి. సెన్సెక్స్‌కు గత  ఏడాది అక్టోబర్ 28 తర్వాత ఇదే అధిక ముగింపు స్థాయి. ఐటీ, టెక్నాలజీ, ఫార్మా షేర్లు నష్టపోగా, విద్యుత్తు, క్యాపిటల్ గూడ్స్, పీఎస్‌యూ, వాహన, రియల్టీ, కన్సూమర్ డ్యూరబుల్స్, ఆయిల్ అండ్ గ్యాస్, లోహ, ఎఫ్‌ఎంసీజీ, బ్యాంకింగ్ షేర్లు పెరిగాయి.

 రక్షణ షేర్ల జోరు..: స్పెక్ట్రమ్ వినియోగ చార్జీని కంపెనీ వార్షిక ఆదాయంలో 3 శాతానికే పరిమితం చేయాలన్న నిర్ణయం కారణంగా టెలికం కంపెనీలు లాభపడ్డాయి. రిలయన్స్ కమ్యూనికేషన్స్ 1.6 శాతం వృద్ధితో రూ.49కు, భారతీ ఎయిర్‌టెల్ 0.9 శాతం లాభపడి రూ.352కు పెరిగాయి. వాల్‌చంద్ నగర్, రిలయన్స్ డిఫెన్స్, బీఈఎంఎల్, భారత్ ఎలక్ట్రానిక్స్ వంటి రక్షణ  రంగ కంపెనీల షేర్లు 11 శాతం వరకూ ఎగిశాయి. భారత్‌ను ప్రధాన రక్షణ భాగస్వామిగా అమెరికా గుర్తించిందన్న వార్తల కారణంగా  రక్షణ సంబంధిత ఆర్డర్లు పెరుగుతాయన్న అంచనాలతో ఈ రక్షణ షేర్లు కళకళలాడాయి.

Advertisement
Advertisement