స్వల్ప లాభాలు బడ్జెట్‌పై ఆశలతో కొనుగోళ్ల జోరు | Sakshi
Sakshi News home page

స్వల్ప లాభాలు బడ్జెట్‌పై ఆశలతో కొనుగోళ్ల జోరు

Published Tue, Jan 24 2017 1:51 AM

స్వల్ప లాభాలు బడ్జెట్‌పై ఆశలతో కొనుగోళ్ల జోరు

83 పాయింట్ల లాభంతో 27,117కు సెన్సెక్స్‌
42 పాయింట్ల లాభంతో 8,392కు నిఫ్టీ


బడ్జెట్‌పై ఆశలతో సోమవారం స్టాక్‌ మార్కెట్‌ లాభాల్లో ముగిసింది. ఇటీవల పతనం కారణంగా పడిపోయిన షేర్లలో కొనుగోళ్లు జరగడంతో బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 83 పాయింట్లు లాభపడి 27,117  పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 42 పాయింట్లు లాభపడి 8,392 పాయింట్ల వద్ద ముగిశాయి. ఎఫ్‌ఎంసీజీ, లోహ, ప్రభుత్వ రంగ ఆయిల్‌  మార్కెటింగ్‌ షేర్లు పెరిగాయి. క్యాపిటల్‌ గూడ్స్, ఫార్మా, ఇన్‌ఫ్రా షేర్లు పతనమయ్యాయి.

ట్రేడింగ్‌ ఆద్యంతం స్టాక్‌ సూచీలు స్వల్ప రేంజ్‌లోనే కదలాడాయి. జనవరి సిరీస్‌  డెరివేటివ్‌ కాంట్రాక్టుల ముగింపు మరో మూడు రోజుల్లో ముగియనున్నందున ట్రేడింగ్‌లో ఒడిదుడుకులు చోటు చేసుకున్నాయి. పెద్ద కరెన్సీ నోట్ల రద్దు కారణంగా కుదేలైన ఆర్థిక వ్యవస్థలో జోష్‌ పెంచడానికి బడ్జెట్‌లో రాయితీలు ఉంటాయనే అంచనాలతో  కొనుగోళ్ల జోరు పెరిగింది.

లాభాల్లో లోహషేర్లు
లండన్‌ మెటల్‌ ఎక్సే్ఛంజ్‌(ఎల్‌ఎంఈ)లో ప్రధాన లోహాల ధరలు పెరగడంతో లోహ, మైనింగ్‌ షేర్లు లాభపడ్డాయి. టాటా స్టీల్, హిందాల్కో, నాల్కో, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, జిందాల్‌ స్టీల్, హిందుస్తాన్‌ జింక్, వేదాంత, ఎన్‌ఎండీసీ షేర్లు 6 శాతం వరకూ పెరిగాయి. 30 సెన్సెక్స్‌ షేర్లలో 19 షేర్లు పెరిగాయి. 11 షేర్లు నష్టపోయాయి. గెయిల్‌ 2.4 శాతం, హెచ్‌డీఎఫ్‌సీ 1.7 శాతం, టాటా మోటార్స్‌ 1.7 శాతం చొప్పున లాభపడ్డాయి. ఐటీసీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, టాటా మోటార్స్, ఎస్‌బీఐ, ఐడియా సెల్యులర్, గ్రాసిమ్‌ ఇండస్ట్రీస్, గెయిల్‌ ఇండియా, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్, యెస్‌ బ్యాంక్‌ లాభపడ్డాయి.  ఐసీఐసీఐ బ్యాంక్, ఎల్‌ అండ్‌ టీ, రిలయన్స్‌ ఇండస్ట్రీస్, యాక్సిస్‌ బ్యాంక్, సన్‌ ఫార్మా, భారతీ ఇన్‌ఫ్రాటెల్, డాక్టర్‌ రెడ్డీస్‌ 2 శాతం వరకూ నష్టపోయాయి. బీఎస్‌ఈలో 1,611 షేర్లు లాభాల్లో, 1,103 షేర్లు నష్టాల్లో ముగిశాయి.ఆసియా మార్కెట్లు మిశ్రమంగా  ముగిశాయి.

Advertisement

తప్పక చదవండి

Advertisement