మార్కెట్లకు బడ్జెట్‌ ఫీవర్‌..  | Sakshi
Sakshi News home page

మార్కెట్లకు బడ్జెట్‌ ఫీవర్‌.. 

Published Tue, Jan 29 2019 1:13 AM

Sensex cracks over 368 points; banking, auto stocks drag - Sakshi

అమెరికా, చైనా మధ్య వాణిజ్య వివాదాలు, కేంద్రం మరో మూడు రోజుల్లో ప్రవేశపెట్టబోయే బడ్జెట్‌లో ప్రజాకర్షక పథకాలతో ఆర్థిక క్రమశిక్షణ గాడి తప్పుతుందేమోనన్న భయాలు దేశీ మార్కెట్లను వెన్నాడుతున్నాయి. అంతర్జాతీయంగా ప్రతికూల సంకేతాలు కూడా దీనికి తోడు కావడంతో సోమవారం అమ్మకాలు వెల్లువెత్తాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 368 పాయింట్లు క్షీణించి 35,657 పాయింట్ల వద్ద, నిఫ్టీ 119 పాయింట్లు క్షీణించి 10,662 పాయింట్ల వద్ద క్లోజయ్యాయి. బ్యాంకింగ్, ఆటోమొబైల్, కన్జూమర్‌ డ్యూరబుల్స్‌ స్టాక్స్‌లో భారీగా అమ్మకాలు జరిగాయి. బీఎస్‌ఈలో ఈ రంగాల షేర్లు దాదాపు 5.46 శాతం దాకా క్షీణించాయి. ఆటోమొబైల్‌ సంస్థల ఆర్థిక ఫలితాలు అంతంతమాత్రంగా ఉండటం, ఇటు బ్యాంకుల స్టాక్స్‌లో అమ్మకాలు సూచీలపై ప్రతికూల ప్రభావం చూపాయి. దేశీ అంశాలతో పాటు అమెరికా–చైనా మధ్య వాణిజ్య వివాదాలపై కూడా ఇన్వెస్టర్లలో భయాలు కొనసాగుతున్నాయని మార్కెట్‌వర్గాలు తెలిపాయి. శుక్రవారం 169 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్‌ తాజాగా రెండు సెషన్లలో మొత్తం 537 పాయింట్లు క్షీణించింది. రైతాంగాన్ని ప్రసన్నం చేసుకునేందుకు బడ్జెట్‌లో ప్రత్యేక ప్రతిపాదనలకు కేంద్రం సత్వరం ఆమోదించనుందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఇలాంటి జనాకర్షక పథకాలతో ప్రభుత్వ ఆర్థిక క్రమశిక్షణ గాడి తప్పే అవకాశం ఉందన్నది విశ్లేషణ.  

యస్‌ బ్యాక్‌ 5 శాతం డౌన్‌.. 
సెన్సెక్స్‌ ఇంట్రా డేలో 36,124–35,565 పాయింట్ల మధ్య తిరుగాడగా, నిఫ్టీ 10,804–10630 శ్రేణిలో తిరిగింది. సెన్సెక్స్‌ షేర్లలో యస్‌ బ్యాంక్‌ అత్యధికంగా 5.46 శాతం క్షీణించగా, బజాజ్‌ ఫైనాన్స్‌ 5.4 శాతం, ఐసీఐసీఐ బ్యాంక్‌ 3.82 శాతం, ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌ 3.10 శాతం, హీరో మోటోకార్ప్‌ 2.55 శాతం పడ్డాయి. కోల్‌ ఇండియా, లార్సన్‌ అండ్‌ టూబ్రో, పవర్‌గ్రిడ్, ఏషియన్‌ పెయింట్, ఎన్‌టీపీసీ మొదలైనవి 1.51 శాతం దాకా పెరిగాయి.

ఐటీఐ ఎఫ్‌పీఓకు సెబీ ఆమోదం 
మరో 2 కంపెనీల ఐపీఓలకూ సెబీ ఓకే 
ప్రభుత్వ రంగ టెలికం కంపెనీ ఐటీఐ ఫాలో ఆన్‌ ఆఫర్‌కు (ఎఫ్‌పీఓ) మార్కెట్‌ నియంత్రణ సంస్థ, సెబీ ఆమోదం తెలిపింది. ఈ ఎఫ్‌పీఓతో పాటు రెండు కంపెనీల ఐపీఓ(ఇనీషియల్‌ పబ్లిక్‌ ఆఫర్‌)కు కూడా సెబీ ఆమోదం తెలిపింది. వంటగది ఉపకరణాలు తయారు చేసే స్టోవ్‌ క్రాఫ్ట్‌ కంపెనీ ఐపీఓకు, వైర్లు, కేబుళ్లు తయారుచేసే పాలీక్యాబ్‌ ఐపీఓకు కూడా సెబీ పచ్చజెండా ఊపింది.  

స్టోవ్‌ క్రాఫ్ట్‌ ఐపీఓ... 
స్టోవ్‌ క్రాఫ్ట్‌ కంపెనీ రూ.145 కోట్ల విలువైన తాజా షేర్లను జారీ చేస్తుంది. వీటితో పాటు ఆఫర్‌ ఫర్‌సేల్‌ కింద 71.63 లక్షల షేర్లను విక్రయించనున్నది. ఈ ఐపీఓకు ఎడెల్‌వీజ్‌ ఫైనాన్షియల్‌ సర్వసీఎస్, ఐడీఎఫ్‌సీ బ్యాంక్, జేఎమ్‌ ఫైనాన్షియల్‌ కంపెనీలు లీడ్‌ మేనేజర్లుగా వ్యవహరిస్తాయి. 

పాలీక్యాబ్‌.. రూ.500 కోట్ల తాజా షేర్లు 
ఇక పాలీక్యాబ్‌ కంపెనీ రూ.500 కోట్ల విలువైన తాజా షేర్లను ఆఫర్‌ చేయనున్నది. అదనంగా ఆఫర్‌ ఫర్‌ సేల్‌ కింద 2.48 కోట్ల ఈక్విటీ షేర్లను విక్రయిస్తుంది. ఈ ఐపీఓకు కోటక్‌ మహీంద్రా క్యాపిటల్‌ కంపెనీ, యాక్సిస్‌ క్యాపిటల్, సిటిగ్రూప్‌ గ్లోబల్‌ మార్కెట్స్‌ ఇండియా, ఐఐఎఫ్‌ఎల్‌ హోల్డింగ్స్, యెస్‌ సెక్యూరిటీస్‌ వ్యవహరిస్తాయి.  

Advertisement

తప్పక చదవండి

Advertisement