రెండు రోజుల లాభాలకు బ్రేక్‌ | Sakshi
Sakshi News home page

రెండు రోజుల లాభాలకు బ్రేక్‌

Published Thu, Mar 29 2018 2:15 AM

Sensex drops 150 pts, Nifty below 10150 - Sakshi

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి ట్రేడింగ్‌ రోజైన బుధవారం నాడు స్టాక్‌ మార్కెట్‌ నష్టాల్లో ముగిసింది. సెన్సెక్స్‌ 33 వేల పాయింట్లు, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 10,150 పాయింట్ల దిగువకు పడిపోయాయి. అంతర్జాతీయ సంకేతాలు బలహీనంగా ఉండటం, మార్చి సిరీస్‌ డెరివేటివ్స్‌ కాంట్రాక్టులు ముగియనుండటంతో ఇన్వెస్టర్ల తమ పొజిషన్లను స్క్వేరాఫ్‌ చేసుకోవడంతో స్టాక్‌ సూచీలు నష్టపోయాయి.

దీంతో రెండు రోజుల లాభాలకు బ్రేక్‌ పడింది. సెన్సెక్స్‌ 206 పాయింట్ల నష్టంతో 32,969 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 70 పాయింట్ల నష్టంతో 10,114 పాయింట్ల వద్ద ముగిశాయి. ఇక వారం పరంగా చూస్తే, ఈ వారంలో సెన్సెక్స్‌ 372 (1.14 శాతం)పాయింట్లు, నిఫ్టీ 116 పాయింట్లు(1.16 శాతం)చొప్పున లాభపడ్డాయి.  ద్రవ్యలోటు తీవ్రత గణాంకాలూ  ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీసింది.   

ఈ ఆర్థిక సంవత్సరంలో 11 శాతం లాభం
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి రోజైన బుధవారం స్టాక్‌ మార్కెట్‌ నష్టపోయినప్పటికీ, ఈ ఆర్థిక సంవత్సరం మొత్తంలో సెన్సెక్స్‌ 11 శాతం, నిఫ్టీ 10 శాతం  మేర లాభపడ్డాయి.  సెన్సెక్స్‌ 3,348 పాయింట్లు, నిఫ్టీ 940 పాయింట్లు  చొప్పున పెరిగాయి.

గత ఆర్థిక సంవత్సరంలో సెన్సెక్స్‌ 17 శాతం, నిఫ్టీలు 19 శాతం చొప్పున వృద్ధి చెందాయి. ఇన్వెస్టర్ల సంపద రూ.20.70 లక్షల కోట్లు పెరిగింది. గత ఏడాది మార్చి 31న రూ.121.54 లక్షల కోట్లుగా ఉన్న ఇన్వెస్టర్ల సంపద (బీఎస్‌ఈలో లిస్టైన అన్ని కంపెనీల మొత్తం మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌) ఈ ఏడాది మార్చి 28 నాటికి రూ.142.24 లక్షల కోట్లకు పెరిగింది.  

వరుసగా నాలుగు రోజుల సెలవులు
మహావీర్‌ జయంతి సందర్భంగా నేడు(గురువారం) స్టాక్‌ మార్కెట్‌కు సెలవు. ఇక గుడ్‌ప్రైడే కారణంగా శుక్రవారం కూడా సెలవు. బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలతో పాటు ఫారెక్స్, మనీ మార్కెట్లు కూడా పనిచేయవు. సాధారణంగా ఉండే శని, ఆదివారాలను కూడా కలుపుకుంటే, స్టాక్‌ మార్కెట్‌కు ఈ వారంలో మొత్తం నాలుగు రోజుల సెలవులు  వచ్చాయి.

Advertisement
Advertisement