కర్ణాటక కాక.. చమురు సెగ | Sakshi
Sakshi News home page

కర్ణాటక కాక.. చమురు సెగ

Published Sat, May 19 2018 1:11 AM

Sensex drops over 50 pts, Nifty50 tests 10650 - Sakshi

కర్ణాటక కాక, చమురు సెగ కారణంగా శుక్రవారం స్టాక్‌ మార్కెట్‌ క్షీణించింది. స్టాక్‌ సూచీలు వరుసగా నాలుగో రోజూ నష్టపోయాయి. సెన్సెక్స్‌ 35 వేల పాయింట్లు, నిఫ్టీ 10,600 పాయింట్ల దిగువకు పడిపోయాయి. బ్యాంకింగ్, ఆర్థిక రంగ, లోహ, ఇన్‌ఫ్రా, చమురు షేర్లు నష్టపోయాయి.

బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 301 పాయింట్లు పతనమై 34,848 పాయింట్ల వద్ద, నిఫ్టీ 86 పాయింట్లు పడిపోయి 10,596 పాయింట్ల వద్ద ముగిశాయి. బీఎస్‌ఈ ఎఫ్‌ఎమ్‌సీజీ సూచీ మినహా మిగిలిన అన్ని రంగాల సూచీలు నష్టపోయాయి. స్టాక్‌ సూచీలు మూడు వారాల కనిష్ట స్థాయికి పడిపోయాయి. ఈ వారంలో సెన్సెక్స్‌ 687 పాయింట్లు, నిఫ్టీ 210 పాయింట్లు చొప్పున క్షీణించాయి. వారం పరంగా చూస్తే, మార్చి 9 తర్వాత స్టాక్‌ సూచీలు ఈ స్థాయిలో పతనం కావడం ఇదే ప్రథమం.

కర్ణాటకలో యడ్యూరప్ప మెజారిటీని శనివారం నాడే నిరూపించుకోవాలని సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేయడం... కర్ణాటక రాజకీయాలనే కాకుండా స్టాక్‌మార్కెట్‌నూ వేడెక్కించింది. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్‌ బ్రెంట్‌ చమురు 80 డాలర్లకు చేరడంతో భారత దిగుమతుల బిల్లు భారీగా పెరిగిపోయి ద్రవ్యలోటు మరింతగా విస్తరిస్తుందనే భయాలు నెలకొన్నాయి. సుంకాల విషయమై చైనా –అమెరికాల మధ్య పురోగతి పెద్దగా లేకపోవడం, విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు కొనసాగుతుండటం, డాలర్‌తో రూపాయి మారకం 30 పైసలు క్షీణించడంతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ దెబ్బతింది. సెన్సెక్స్‌ ఒక దశలో 14 పాయింట్లు లాభపడగా, మరో దశలో 327 పాయింట్లు నష్టపోయింది.

కొనసాగిన ప్రభుత్వ బ్యాంక్‌ల పతనం...
మొండి బకాయిల కారణంగా ప్రభుత్వ రంగ బ్యాంక్‌ల నికర నష్టాలు మరింతగా పెరగడంతో ఆ బ్యాంక్‌ షేర్లలో అమ్మకాలు కొనసాగుతున్నాయి

ఐటీసీని దాటేసిన హెచ్‌యూఎల్‌..: మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ పరంగా నాలుగో అతి పెద్ద భారత కంపెనీగా హిందుస్తాన్‌ యూనిలీవర్‌ (హెచ్‌యూఎల్‌) అవతరించింది. ఐటీసీని తోసిరాజని హెచ్‌యూఎల్‌ ఈ స్థానానికి ఎగబాకింది. ఆర్థిక ఫలితాలు అంచనాలను మించడం, ఈ ఏడాది వర్షాలు బాగానే ఉండగలవన్న అంచనాల కారణంగా గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్‌ పుంజుకోగలదన్న అంచనాలు ఈ షేర్‌ జోరుకు ప్రధాన కారణాలని నిపుణులంటున్నారు.

ఏడాది కనిష్టానికి 170 షేర్లు..
టాటా మోటార్స్, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, కార్పొరేషన్‌ బ్యాంక్, ఓబీసీ, సిండికేట్‌ బ్యాంక్, భెల్‌ తదితర దాదాపు 170 షేర్లు తాజా ఏడాది కనిష్ట స్థాయిలను తాకాయి. ఏబీబీ ఇండియా, అజంతా ఫార్మా, పిటీసీ ఇండియా తదితర షేర్లు కూడా ఈ జాబితాలో ఉన్నాయి.   

Advertisement
Advertisement