బ్లూ చిప్‌ షేర్లలో లాభాల స్వీకరణ | Sakshi
Sakshi News home page

బ్లూ చిప్‌ షేర్లలో లాభాల స్వీకరణ

Published Thu, Mar 28 2019 12:13 AM

Sensex Ends 101 Points Lower As Markets Reverse Direction - Sakshi

మార్చి నెల డెరివేటివ్స్‌ కాంట్రాక్టుల ముగింపు నేపథ్యంలో బుధవారం స్టాక్‌ సూచీలు ఆద్యంతం తీవ్రమైన ఒడిదుడుకులకు గురయ్యాయి. ఆరంభ లాభాలను కోల్పోయి చివరకు నష్టాల్లో ముగిశాయి. రూపాయి పతనం, అంతర్జాతీయ వృద్ధి మందగమనంపై ఆందోళనలు ప్రతికూల ప్రభావం చూపాయి. బీఎస్‌ఈ నిఫ్టీ 101 పాయింట్లు తగ్గి 38,133 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 38 పాయింట్లు తగ్గి 11,445 పాయింట్ల వద్ద ముగిశాయి. ఫార్మా, వాహన, రియల్టీ షేర్లు నష్టపోయాయి. వచ్చే ఆర్థిక సంవత్సరంలో రుణ వృద్ధి పుంజుకుంటుందన్న అంచనాలు, ప్రస్తుతం లిక్విడిటీ మెరుగుపడటం వంటి సానుకూలతల కారణంగా ఇండస్‌ఇండ్‌ బ్యాంక్, యెస్‌బ్యాంక్, ఎస్‌బీఐ వంటి బ్యంక్‌షేర్లు లాభపడ్డాయి. దీంతో  నష్టాలు పరిమితమయ్యాయి.  

480 పాయింట్ల రేంజ్‌లో సెన్సెక్స్‌... 
జాతినుద్దేశించి ప్రసంగించబోతున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఉదయం ట్వీట్‌ చేశారు. ఈ ప్రసంగంపై ఊహాగానాలతో స్టాక్‌ సూచీలు ఊగిసలాటకు గురయ్యాయి. ఉపగ్రహాన్ని కూల్చే క్షిపణి(ఏశాట్‌)ను భారత్‌ తయారు చేసిందని, శాటిలైట్‌ను కూల్చే పరీక్ష, ఆపరేషన్‌ శక్తి విజయవంతమైందన్న మోదీ ప్రకటనతో మార్కెట్‌ లాభపడింది.  మధ్యాహ్నం వరకూ లాభాలు కొనసాగాయి. ఇటీవల బాగా పెరిగిన బ్లూ చిప్‌షేర్లలో మధ్యాహ్నం తర్వాత లాభాల స్వీకరణ చోటు చేసుకోవడం, యూరప్‌ మార్కెట్లు బలహీనంగా ఆరంభం కావడంతో అమ్మకాలు జోరుగా సాగాయి. దీంతో నష్టాల్లోకి జారిపోయిన సెన్సెక్స్‌ చివరకు నష్టాల్లోనే ముగిసింది. ఒక దశలో 243 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్‌ మరో దశలో 237 పాయింట్లు పతనమైంది. మొత్తం మీద రోజంతా 480 పాయింట్ల రేంజ్‌లో కదలాడింది. ఇక నిఫ్టీ ఒక దశలో 63 పాయింట్లు పెరగ్గా, మరో దశలో 70 పాయింట్లు పడిపోయింది. డాలర్‌తో రూపాయి మారకం 2 పైసలు  తగ్గి 68.88 వద్ద ముగిసింది.    మందగమన భయాల నేపథ్యంలో వివిధ దేశాల కేంద్ర బ్యాంక్‌లు ఎలాంటి చర్యలు తీసుకుంటాయోనన్న అనిశ్చితి  కారణంగా ప్రపంచ మార్కెట్లు నష్టాల్లో  ముగిశాయి.  

►జెట్‌ ఎయిర్‌వేస్‌ లాభాలు కొనసాగాయి. ఏప్రిల్‌ చివరి నాటికి 40 అదనపు విమాన సర్వీసులు నిర్వహించాలన్న కంపెనీ లక్ష్యం దీనికి ప్రధాన కారణం. ఇంట్రాడేలో 6 శాతం ఎగసిన ఈ షేర్‌ చివరకు 2.2 శాతం లాభంతో రూ.277 వద్ద ముగిసింది. గత మూడు రోజుల్లో ఈ షేర్‌ మొత్తం 20 శాతం మేర పెరిగింది.  

Advertisement

తప్పక చదవండి

Advertisement