10వేల మార్కును తాకి, కిందకి దిగింది! | Sakshi
Sakshi News home page

10వేల మార్కును తాకి, కిందకి దిగింది!

Published Tue, Jul 25 2017 3:58 PM

Sensex ends in the red, Nifty flat after touching 10K in opening tick

ముంబై : భారీ లాభాలతో దీపావళి సంబురాలు జరుపుకున్న స్టాక్‌ మార్కెట్లు చివరికీ ఫ్లాట్‌గా ముగిశాయి. సెన్సెక్స్‌ 17.60 పాయింట్ల నష్టంలో 32,228 వద్ద క్లోజ్‌ కాగ, నిఫ్టీ 1.85 పాయింట్ల నష్టంలో 9,950కి పైన, 9,964 వద్ద స్థిరపడింది. ప్రారంభంలోనే నిఫ్టీ ఇన్వెస్టర్లందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 10వేల మార్కును తాకి రికార్డు సృష్టించింది. దీంతో దలాల్‌ స్ట్రీట్‌ పండుగ వాతావరణం నెలకొంది. కానీ కొద్ది క్షణాల్లోనే ఈ మార్కును నుంచి కిందకి పడిపోయింది. మళ్లీ ట్రేడింగ్‌ అంతా నిఫ్టీ ఆ మార్కును తాకలేకపోయింది.
 
నేటి సెషన్‌లో యాక్సిస్‌ బ్యాంకు, భారతీ ఎయిర్‌టెల్‌, వేదాంత, ఇండియాబుల్స్‌ హౌసింగ్‌ ఎక్కువగా లాభపడగా.. లుపిన్‌, టాటా మోటార్స్‌, డీవీఆర్‌, జీ ఎంటర్‌టైన్మెంట్‌, ఆల్ట్రాటెక్‌ సిమెంట్‌ టాప్‌ లూజర్లుగా నష్టాలు పాలయ్యాయి. 2017 జూన్‌తో ముగిసిన క్వార్టర్‌లో వేదాంత గణనీయమైన లాభాలను ఆర్జించగా.. ఈ కంపెనీ షేర్లు సుమారు 4 శాతం మేర ర్యాలీ జరిపాయి. కంపెనీ ప్రాఫిట్‌ ఏకంగా 67.2 శాతం పైకి ఎగిసింది.
 
మరోవైపు టెలికాం దిగ్గజాలు వొడాఫోన్‌, ఐడియాల విలీన ప్రతిపాదనకు కాంపిటీషన్‌ కమిషన్‌(సీఐఐ) ఆమోదముద్ర వేయడంతో ఐడియా షేర్లు దూసుకెళ్లాయి. ఈ కంపెనీ షేర్లు 6 శాతం మేర లాభాలు పండించాయి. అటు డాలర్‌తో రూపాయి మారకం విలువ 6 పైసలు బలహీనపడి 64.40 వద్ద ఉంది. ఎంసీఎక్స్‌ మార్కెట్‌లో బంగారం ధరలు 77 రూపాయలు పడిపోయి, రూ.28,439గా ఉన్నాయి.  

Advertisement
Advertisement