కొత్త హై నుంచి కిందపడిన సెన్సెక్స్‌ | Sakshi
Sakshi News home page

కొత్త హై నుంచి కిందపడిన సెన్సెక్స్‌

Published Fri, Jun 23 2017 1:33 AM

కొత్త హై నుంచి కిందపడిన సెన్సెక్స్‌

31,523 పాయింట్ల రికార్డుస్థాయిని
తాకిన తర్వాత అమ్మకాలు
9,698 పాయింట్ల గరిష్టం నుంచి తగ్గిన నిఫ్టీ


ముంబై: నియంత్రణా సంస్థ సెబీ మార్కెట్‌కు పలు స్నేహపూరిత చర్యల్ని ప్రకటించిన నేపథ్యంలో గురువారం ఉదయం బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 239 పాయింట్లు ర్యాలీ జరిపి...31,523 పాయింట్లస్థాయికి చేరి కొత్త రికార్డును నెలకొల్పింది. జూన్‌ 6న నెలకొల్పిన 31,430 పాయింట్ల రికార్డును తాజాగా సెన్సెక్స్‌ అధిగమించింది. అయితే అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు బలహీనంగా ట్రేడవుతున్న నేపథ్యంలో మధ్యాహ్న సెషన్‌ తర్వాత అమ్మకాలు వెల్లువెత్తడంతో సెన్సెక్స్‌ లాభాలన్నింటినీ కోల్పోయి, స్వల్పనష్టాల్లోకి జారిపోయింది. చివరకు 7 పాయింట్ల స్వల్పలాభంతో 31,291 పాయింట్ల వద్ద ముగిసింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ మాత్రం గత రికార్డుస్థాయి 9,709 పాయింట్ల స్థాయిని చేరలేకపోయింది. తొలుత 60 పాయింట్లకుపైగా ర్యాలీ జరిపి..9,698 పాయింట్ల గరిష్టస్థాయికి చేరిన తర్వాత...9,618 పాయింట్ల కనిష్టస్థాయికి తగ్గింది.

చివరకు 3.6 పాయింట్ల క్షీణతతో 9,630 పాయింట్ల వద్ద ముగిసింది. మార్కెట్‌ సానుకూలంగా ప్రారంభమై, శరవేగంగా గరిష్టస్థాయికి చేరిందని, కానీ తర్వాత జరిగిన లాభాల స్వీకరణ కారణంగా చివరకు ఫ్లాట్‌గా ముగిసిందని బీఎన్‌పీ పారిబాస్‌ మ్యూచువల్‌ ఫండ్‌ సీనియర్‌ ఫండ్‌ మేనేజర్‌ కార్తిక్‌రాజ్‌ లక్ష్మణన్‌ చెప్పారు. క్రితం రోజు రాత్రి ప్రపంచ మార్కెట్లో క్రూడ్‌ ధర 10 నెలల కనిష్టస్థాయి 42,08 డాలర్ల వద్దకు తగ్గిన తర్వాత కోలుకోవడంతో గురువారం ఉదయం ఆసియా మార్కెట్లు పాజిటివ్‌గా ట్రేడయ్యాయని, ఆ ప్రభావంతో తొలుత మన మార్కెట్‌ పెరిగిందని లక్ష్మణన్‌ వివరించారు. కానీ తర్వాత మెటల్‌ షేర్లలో బాగా అమ్మకాలు జరపడంతో మెటల్‌ ఇండెక్స్‌ 1 శాతంపైగా క్షీణించిందని తెలిపారు.

ఆల్‌టైమ్‌ గరిష్టానికి బ్యాంక్‌ నిఫ్టీ...
ట్రేడింగ్‌ తొలిదశలో సెన్సెక్స్‌తో పాటు బ్యాంక్‌ నిఫ్టీ కొత్త రికార్డుస్థాయి 23,897 పాయింట్ల వద్దకు ఎగిసింది. చివరకు 0.16 శాతం లాభంతో 23,737 పాయింట్ల వద్ద ముగిసింది. ఇటీవలి రిజర్వుబ్యాంక్‌ ద్రవ్య పరపతి సమీక్షకు సంబంధించి..క్రితం రోజు వెలువడిన మినిట్స్‌లో సభ్యులు వడ్డీ రేట్ల పట్ల కఠినవైఖరితో లేరని వెల్లడికావడంతో బ్యాంకింగ్‌ షేర్లు పెరిగాయని విశ్లేషకులు చెప్పారు. ఎస్‌బీఐ 1.5 శాతం ర్యాలీ జరపగా, కొటక్‌ బ్యాంక్‌ 0.58 శాతం, యస్‌ బ్యాంక్‌ 1.45 శాతం చొప్పున పెరిగాయి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ రూ. 1,717 వద్ద, కొటక్‌ బ్యాంక్‌ రూ. 1000 వద్ద  చరిత్రాత్మక గరిష్టస్థాయిల్ని నమోదు చేశాయి.

Advertisement
Advertisement