10,800 పైకి నిఫ్టీ | Sakshi
Sakshi News home page

10,800 పైకి నిఫ్టీ

Published Sat, May 12 2018 1:47 AM

Sensex Jumps Over 100 Points, Nifty Above 10750 - Sakshi

సానుకూల అంతర్జాతీయ సంకేతాల దన్నుతో శుక్రవారం స్టాక్‌ మార్కెట్‌ లాభాల్లో ముగిసింది. కంపెనీల ఆర్థిక ఫలితాలు అంచనాలను మించడం, చివరి గంటలో లోహ, బ్యాంక్, క్యాపిటల్‌ గూడ్స్, ఇంధన, ఎఫ్‌ఎమ్‌సీజీ షేర్లలో జోరుగా కొనుగోళ్లు సాగడంతో ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 10,800 మార్క్‌ను దాటేసింది.

హెచ్‌డీఎఫ్‌సీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఏషియన్‌ పెయింట్స్, ఐటీసీలు మంచి లాభాలు సాధించడంతో సెన్సెక్స్‌ 290 పాయింట్ల లాభంతో 35,536 పాయింట్లకు చేరింది. ఇక ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 90 పాయింట్ల లాభంతో 10,807 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక వారం పరంగా చూస్తే, సెన్సెక్స్‌ 620 పాయింట్లు, నిఫ్టీ 188 పాయింట్లు చొప్పున లాభపడ్డాయి.  

తగ్గిన రేట్ల పెంపు భయాలు..
గురువారం వెలువడిన అమెరికా ద్రవ్యోల్బణ గణాంకాలు అంచనాల కంటే బలహీనంగా ఉన్నాయి. దీంతో ఫెడరల్‌ రిజర్వ్‌ వడ్డీరేట్ల పెంపు భయాలు తగ్గాయి. ఫలితంగా ప్రపం చ మార్కెట్లు ఎగిశాయి. అమెరికా మార్కెట్‌  లాభాలు సాధించడం, శుక్రవారం ఆసియా మార్కెట్లు లాభాల్లో ముగియడం, యూరప్‌ మార్కెట్లు లాభాల్లో ఆరంభం కావడం ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌కు జోష్‌నిచ్చాయి. సెన్సెక్స్‌ రోజంతా లాభాల్లోనే ట్రేడైంది. ఇంట్రాడేలో 350 పాయింట్ల లాభంతో 35,596 పాయింట్ల వద్ద గరిష్ట స్థాయిని తాకింది.

ఇంగర్‌సోల్‌   డివిడెండ్‌...రూ.202
ఇంగర్‌సోల్‌ రాండ్‌ (ఇండియా) రూ.202 స్పెషల్‌ డివిడెండ్‌ను ప్రకటించడంతో ఈ షేర్‌20 శాతం అప్పర్‌ సర్క్యూట్‌తో రూ.854 కు దూసుకుపోయింది. ఈ స్పెషల్‌ డివిడెండ్‌కు రికార్డ్‌ డేట్‌ ఈ నెల 25.

Advertisement

తప్పక చదవండి

Advertisement