‘వాణిజ్య యుద్ధం’ ఎఫెక్ట్‌ | Sakshi
Sakshi News home page

‘వాణిజ్య యుద్ధం’ ఎఫెక్ట్‌

Published Sat, Apr 7 2018 1:39 AM

Sensex, Nifty close flat, telecom, IT stocks fall - Sakshi

రోజంతా ఒడిదుడుకులమయంగా సాగిన ట్రేడింగ్‌లో శుక్రవారం స్టాక్‌ మార్కెట్‌ స్వల్పలాభాలతో గట్టెక్కింది. అంతర్జాతీయ సంకేతాలు అంతంతమాత్రంగానే ఉండడంతో స్టాక్‌ సూచీలు లాభనష్టాల మధ్య కదలాడాయి.  కంపెనీల క్యూ4 ఫలితాలు త్వరలో వెల్లడి కానుండటంతో ఇన్వెస్టర్లు ఆచి, తూచి వ్యవహరించారు.

బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 30 పాయింట్ల లాభంతో 33,627 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 6 పాయింట్ల లాభంతో 10,332 పాయింట్ల వద్ద ముగిశాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్‌ట్రంప్‌ తాజాగా చైనా దిగుమతులపై పదివేల కోట్ల డాలర్ల మేర అదనపు సుంకాలు విధించడానికి సిద్ధమవుతున్నారన్న వార్తలతో మళ్లీ వాణిజ్య యుద్ధ భయాలు చెలరేగి ప్రపంచ మార్కెట్లలో అనిశ్చితి నెలకొనడం మన మార్కెట్లపై ప్రతికూల ప్రభావం చూపించింది.

ఇంట్రాడేలో సెన్సెక్స్‌ ఒక దశలో 101 పాయింట్లు లాభపడగా, మరో దశలో 95 పాయింట్లు నష్టపోయింది. మొత్తం మీద రోజంతా 196 పాయింట్ల రేంజ్‌లో కదలాడింది. ఇక నిఫ్టీ ఒక దశలో 25 పాయింట్లు లాభపడగా, మరో దశలో 34 పాయింట్లు నష్టపోయింది. వారం పరంగా చూస్తే, బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 658 పాయింట్లు(1.99 శాతం), నిఫ్టీ 218 పాయింట్లు(2.15 శాతం) చొప్పున లాభపడ్డాయి.

అందరి కళ్లూ క్యూ4 ఫలితాలపైననే..
అంతర్జాతీయంగా మళ్లీ వాణిజ్య ఉద్రిక్తతలు తలెత్తడంతో ఇన్వెస్టర్లు ఆందోళనకు గురయ్యారని జియోజిత్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ రీసెర్చ్‌ హెడ్‌ వినోద్‌ నాయర్‌ చెప్పారు. ఇక ఇప్పుడు అందరి దృష్టి క్యూ4 ఫలితాలపైననే ఉందని, ఈ ఫలితాలు బాగా ఉంటే,  అంతర్జాతీయ అనిశ్చితి కారణంగా తలెత్తే ఒడిదుడుకులను మార్కెట్‌ తట్టుకోగలుగుతుందని వివరించారు.  

ఐసీఐసీఐ బ్యాంక్‌ 1 శాతం అప్‌..
బ్యాంక్‌ షేర్ల లాభాలు కొనసాగాయి. ఐసీఐసీఐ బ్యాంక్‌ 1 శాతం లాభపడింది. సెన్సెక్స్‌లో బాగా పెరిగిన షేర్‌ ఇదే. మారుతీ సుజుకీ, అదానీ పోర్ట్స్, సన్‌ ఫార్మా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్స్, ఎస్‌బీఐ, యస్‌ బ్యాంక్, ఐటీసీ, రిలయన్స్‌ ఇండస్ట్రీస్, ఎన్‌టీపీసీ, హెచ్‌డీఎఫ్‌సీ, పవర్‌ గ్రిడ్, టాటా మోటార్స్‌లు స్వల్పంగా లాభపడ్డాయి. భారతీ ఎయిర్‌టెల్‌ 2.17 శాతం నష్టపోయింది. సెన్సెక్స్‌లో బాగా నష్టపోయిన షేర్‌ ఇదే.

ఇన్ఫోసిస్, ఎల్‌ అండ్‌ టీ, బజాజ్‌ ఆటో, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్, యాక్సిస్‌ బ్యాంక్, హిందుస్తాన్‌ యూనిలివర్, విప్రో, కోల్‌ ఇండియా, టీసీఎస్, మహీంద్రా, ఓఎన్‌జీసీ, ఏషియన్‌ పెయింట్స్, హీరో మోటొకార్ప్‌ షేర్లు కూడా నష్టపోయాయి. ముడి చమురు ధరలు తగ్గడంతో ప్రభుత్వ రంగ ఆయిల్‌ మార్కెటింగ్‌ షేర్లు–బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్, ఐఓసీలు 3 శాతం వరకూ పెరిగాయి.                         

Advertisement
Advertisement