లోహ షేర్లకు సెగ | Sakshi
Sakshi News home page

లోహ షేర్లకు సెగ

Published Sat, Mar 10 2018 1:53 AM

Sensex, Nifty close lower, bank, metal stocks fall - Sakshi

చివరి గంటలో జరిగిన  అమ్మకాలు ఆరంభ లాభాలను హరించేయడంతో శుక్రవారం స్టాక్‌ మార్కెట్‌ నష్టపోయింది. ఉక్కు, అల్యూమినియమ్‌ ఉత్పత్తులపై అమెరికా దిగుమతి సుంకాలు విధించడంతో వాణిజ్య యుద్ధాలు చెలరేగుతాయనే ఆందోళనతో లోహ షేర్లలో అమ్మకాలు జరగడం, బ్యాంక్‌ షేర్లలో నష్టాలు కొనసాగడం ప్రతికూల ప్రభావం చూపించాయి.

  బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 43 పాయింట్లు పతనమై 33,307 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 16 పాయింట్లు క్షీణించి 10,227 పాయింట్ల వద్ద ముగిశాయి. ఇక వారం పరంగా చూస్తే, వరుసగా రెండో వారమూ స్టాక్‌ మార్కెట్‌ నష్టపోయింది. సెన్సెక్స్‌740 పాయింట్లు, నిఫ్టీ 232 పాయింట్లు చొప్పున నష్టపోయాయి.

లోహ షేర్లు విలవిల...
ఉక్కు ఉత్పత్తులపై 25 శాతం, అల్యూమినియమ్‌ ఉత్పత్తులపై 10 శాతం చొప్పున అమెరికా దిగుమతి సుంకాలు విధించింది. దీంతో లోహ షేర్లు వెలవెలపోయాయి. సెయిల్‌ 6.4 శాతం నష్టపోయి రూ.69.45 వద్ద ముగిసింది. జిందాల్‌ స్టీల్‌ 5.2 శాతం, టాటా స్టీల్‌ 4.6 శాతం, నాల్కో 2.1 శాతం, ఎన్‌ఎమ్‌డీసీ 1.8 శాతం, వేదాంత 1.5 శాతం, హిందాల్కో 1.2 శాతం చొప్పున క్షీణించాయి.

బ్యాంక్‌షేర్ల నష్టాలు కొనసాగాయి. యాక్సిస్‌ బ్యాంక్‌ 3 శాతం వరకూ, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా 2.1 శాతం, ఐసీఐసీఐ బ్యాంక్‌ 1.4 శాతం, యస్‌ బ్యాంక్‌ 1.4 శాతం, ఎస్‌బీఐ 1.4 శాతం చొప్పున నష్టపోయాయి. డాలర్‌తో రూపాయి మారకం బలహీనపడటంతో ఐటీ షేర్లు పెరిగాయి. టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రోలు 1 శాతం వరకూ లాభపడ్డాయి.

జీటీఎల్‌ ఇన్‌ఫ్రా 20 శాతం డౌన్‌...
ఎయిర్‌సెల్‌ దివాలా తమపై బాగానే ప్రభావం చూపించగలదని జీటీఎల్‌ ఇన్‌ఫ్రా వెల్లడించడంతో జీటీఎల్‌ ఇన్‌ఫ్రా షేర్‌ 20 శాతం పతనమై, తాజా ఏడాది కనిష్ట స్థాయి,రూ.3.11కు పడిపోయింది. ఈ ఏడాదిలో ఈ షేర్‌ 57 శాతం నష్టపోయింది. తమ మొత్తం ఆదాయంలో 43 శాతం వరకూ ఎయిర్‌సెల్‌ నుంచే వస్తోందని జీటీఎల్‌ ఇన్‌ఫ్రా పేర్కొంది.

కొనసాగిన గీతాంజలి జెమ్స్‌ పతనం...
గీతాంజలి జెమ్స్‌ షేర్‌ పతనం కొనసాగుతోంది. ఈ షేర్‌ మరో 5% పతనమై ఏడాది కనిష్ట స్థాయి, రూ.15.80కు పడిపోయింది. వరుసగా 17వ రోజు ఈ షేర్‌ పతనమైంది.


263 పాయింట్ల శ్రేణిలో కదిలిన సెన్సెక్స్‌
ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జంగ్‌ యున్‌తో చర్చలు జరపడానికి సిద్ధంగా ఉన్నానంటూ అమెరికా అధ్యక్షుడు  డొనాల్ట్‌ ట్రంప్‌ వెల్లడించడంతో గురువారం అమెరికా మార్కెట్లు లాభాల్లో ముగియగా, ఈ దన్నుతో శుక్రవారం ఆసియా మార్కెట్లు  లాభపడడం సానుకూల ప్రభావం చూపించింది. సెన్సెక్స్‌ ఒక దశలో 168 పాయింట్ల లాభంతో 33,519 పాయింట్ల వద్ద ఇంట్రాడేలో గరిష్టాన్ని తాకింది.

అయితే ఉక్కు, అల్యూమినియం ఉత్పత్తులపై అమెరికా సుంకాలు విధించడంతో లోహ షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తడం, బ్యాంక్‌ షేర్ల నష్టాలు కొనసాగడం, పై స్థాయిల్లో లాభాల స్వీకరణ చోటు చేసుకోవడంతో చివర్లో నష్టాలు వచ్చాయి. సెన్సెక్స్‌  ఒక  దశలో 95 పాయింట్ల నష్టంతో 33,256 పాయింట్ల వద్ద ఇంట్రాడేలో కనిష్ట స్థాయిని తాకింది. మొత్తం మీద రోజంతా 263 పాయింట్ల రేంజ్‌లో కదలాడింది. మరో వైపు నిఫ్టీ ఒక దశలో 54 పాయింట్లు పెరగ్గా, మరో దశలో 31 పాయింట్లు నష్టపోయింది. స్టాక్‌ మార్కెట్‌ లాభాల్లో ఆరంభమైందని, అయితే గురువారం నాటి ర్యాలీ కారణంగా అమ్మకాలు జరిగాయని జియోజిత్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ రీసెర్చ్‌ హెడ్‌ వినోద్‌ నాయర్‌ చెప్పారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement