పడి... లేచిన మార్కెట్లు! | Sakshi
Sakshi News home page

పడి... లేచిన మార్కెట్లు!

Published Fri, Sep 22 2017 12:45 AM

పడి... లేచిన మార్కెట్లు!

► ఫెడ్‌ సంకేతాలతో ఎఫ్‌ఐఐల అమ్మకాలు
► దేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల మద్దతు
►  చివరకు స్వల్ప నష్టాలకే పరిమితం
►  బలహీనపడ్డ రూపాయి


ముంబై: దేశీయ స్టాక్‌ మార్కెట్లలో గురువారం ట్రేడింగ్‌ అద్యంతం ఒడిదుడుకులమయంగా సాగింది. మార్కెట్‌ ఆరంభం నుంచే నెగెటివ్‌లో ఉండి... ఒక దశలో ఏకంగా ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 80 పాయింట్లకు పైగా నష్టపోయింది. ఆర్థిక ఉద్దీపన ప్రోత్సాహకాలను క్రమంగా తగ్గించడంతో పాటు ఈ ఏడాది ముగిసేలోపు ఒక సారి రేట్ల కోత ఉంటుందంటూ అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ ఇచ్చిన భవిష్యత్తు సంకేతాలు సెంటిమెంట్‌పై ప్రభావం చూపాయి. దీంతో డాలర్‌ బలపడగా, రూపాయి బలహీనపడింది.

ఫలితంగా దేశీయ స్టాక్‌ మార్కెట్లు నష్టాలను చవిచూశాయి. అయితే మధ్యాహ్నం తరవాత మార్కెట్లు మళ్లీ కోలుకున్నాయి. విదేశీ ఇన్వెస్టర్లు విపరీతంగా అమ్మకాలు జరిపినా... దేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు దానికి ధీటుగా కొనుగోళ్లు జరపటంతో మార్కెట్లు నష్టాలను తగ్గించుకున్నాయి. చివరకు బీఎస్‌ఈ సూచీ సెన్సెక్స్‌ 30 పాయింట్లు నష్టపోయి 32,370.04 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో ఒకదశలో 230 పాయింట్ల వరకూ నష్టపోయినా చివరకు 200 పాయింట్లు కవరయ్యి 30 పాయింట్లు మాత్రమే నష్టపోవటం పరిస్థితికి అద్దం పడుతోంది.

విదేశీ ఇన్వెస్టర్లు ఏకంగా రూ.1,200 కోట్ల మేర ఈక్విటీలో అమ్మకాలు జరిపారు. దేశీయ ఇన్వెస్టర్లు రూ.1400 కోట్లకు పైగా కొనుగోళ్లు జరపటంతో మార్కెట్లు కోలుకున్నాయి. బుధవారం నాటి ఫెడ్‌ సమావేశం నిర్ణయాలు ఎలా ఉంటాయోనని ఇన్వెస్టర్లు వేచిచూడటం వల్ల అంతకు ముందు రెండు సెషన్లలోనూ సెన్సెక్స్‌ 23 పాయింట్ల మేర ష్టపోయిన విషయం తెలిసిందే. అటు ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ సైతం గురువారం 19 పాయింట్ల నష్టంతో 10,158.90 వద్ద ముగిసింది. నిఫ్టీ కూడా ఒక దశలో 80 పాయింట్లకు పైగా నష్టపోవటం గమనార్హం.

మ్యాట్రిమోనీ స్టాక్‌కు నష్టాలు
మ్యాట్రిమోనీ.కామ్‌ స్టాక్‌ లిస్టింగ్‌ రోజే ఇన్వెస్టర్లను నిరాశపరిచింది. ఏకంగా 8.5 శాతం నష్టపోయింది. ఒక్కో షేరును రూ.985కు ఆఫర్‌ చేయగా, ఉదయం ఈ ధరలోనే స్టాక్‌ లిస్ట్‌ అయింది. కానీ, చివరికి వచ్చే సరికి 8.5 శాతం నష్టపోయి బీఎస్‌ఈలో రూ.901.20 వద్ద క్లోజయింది. ఇంట్రాడేలో రూ.893.20 కనిష్ట స్థాయికి సైతం పడిపోయింది. ఎన్‌ఎస్‌ఈలో రూ.904.65 వద్ద ముగిసింది. ఈ ఇష్యూ 4.4 రెట్లు ఓవర్‌ సబ్‌స్క్రయిబ్‌ అయిన విషయం తెలిసిందే.

Advertisement

తప్పక చదవండి

Advertisement