సెన్సెక్స్‌ 261 పాయింట్లు అప్‌ | Sakshi
Sakshi News home page

సెన్సెక్స్‌ 261 పాయింట్లు అప్‌

Published Thu, Jun 21 2018 12:54 AM

Sensex, Nifty hit fresh intraday high - Sakshi

ప్రపంచ మార్కెట్ల రికవరీకి మన మార్కెట్లో వేల్యూ బయింగ్‌ కూడా జత కావడంతో బుధవారం స్టాక్‌ మార్కెట్‌ లాభపడింది. చమురు ధరలు చల్లబడటం, రూపాయి బలపడటం కూడా కలసి వచ్చాయి. రిలయన్స్‌ ఇండస్ట్రీస్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీలు లాభపడటం సానుకూల ప్రభావం చూపించింది.

బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 261 పాయింట్ల లాభంతో 35,547 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 62 పాయింట్లు పెరిగి 10,772 పాయింట్ల వద్ద ముగిశాయి. గత రెండు ట్రేడింగ్‌ సెషన్లలో సెన్సెక్స్‌ 335 పాయింట్లు తగ్గింది. ఎఫ్‌ఎమ్‌సీజీ, క్యాపిటల్‌ గూడ్స్, ఆయిల్, గ్యాస్,  ఐటీ షేర్లు నష్టపోగా, లోహ,  బ్యాంక్, కన్జ్యూమర్‌ డ్యూరబుల్, వాహన  షేర్లు లాభపడ్డాయి.  

ప్రపంచ మార్కెట్ల రికవరీ...
అమెరికా– చైనా మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు తీవ్రం కావడంతో మంగళవారం చైనా షాంగై సూచీ 4 శాతం వరకూ పతనమైంది. వాణిజ్య ఉద్రిక్తత కారణంగా ఉత్పన్నమయ్యే ప్రతికూల ప్రభావాన్ని అధిగమించే చర్యలు తీసుకుంటామని చైనా ప్రభుత్వ వర్గాలు అభయం ఇచ్చాయి. దీనికి తోడు పలు బ్లూచిప్‌ షేర్లు షేర్ల కొనుగోళ్ల ప్రణాళికను ప్రకటిస్తామని భరోసాను ఇచ్చాయి. ఈ రెండు అంశాల కారణంగా ప్రపంచ మార్కెట్లు రికవరీ బాట పట్టాయి.

ఇటీవలి పతనం కారణంగా ధరలు క్షీణించి పలు షేర్లు ఆకర్షణీయంగా ఉండటంతో కొనుగోళ్లు జోరుగా సాగాయి. అమెరికా–చైనాల మధ్య సుంకాల పోరు తీవ్రమవుతున్నప్పటికీ, అంతర్జాతీయంగా ప్రపంచ మార్కెట్లు రికవరీ అయ్యాయని జియోజిత్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ రీసెర్చ్‌ హెడ్‌ వినోద్‌ నాయర్‌ చెప్పారు. చమురు ధర లు తక్కువ స్థాయిలోనే రికవరీ కావడంతో డాలర్‌తో రూపాయి మారకం కోలుకోవడం ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌కు జోష్‌నిచ్చిందన్నారు. బహిరంగ మార్కెట్‌ కొనుగోళ్లు చేయనున్నామని ఆర్‌బీఐ ప్రకటించడంతో పదేళ్ల బాండ్ల రాబడులు దిగిరావడంతో బ్యాంక్‌ షేర్లు లాభపడ్డాయని వివరించారు.   

రోజంతా లాభాలే..: లాభాల్లో ఆరంభమైన బీఎస్‌ఈ 30 సెన్సెక్స్‌ రోజంతా అదే తీరున పయనించింది. ఒక దశలో   285 పాయింట్ల లాభంతో 35,571 పాయింట్ల వద్ద ఇంట్రాడే గరిష్ట స్థాయిని తాకింది.

త్వరలో అన్మోల్‌ ఇండస్ట్రీస్‌ ఐపీఓ !
బిస్కెట్లు తయారు చేసే కంపెనీ అన్మోల్‌ ఇండస్ట్రీస్‌ త్వరలో ఐపీఓకు (ఇనీషియల్‌ పబ్లిక్‌ ఆఫర్‌) వస్తోంది. ఈ కంపెనీ ఐపీఓ సంబంధిత పత్రాలను మార్కెట్‌ నియంత్రణ సంస్థ, సెబీకి ఇటీవలే సమర్పించింది. ఈ ఐపీఓలో భాగంగా కంపెనీ రూ.750 కోట్ల మేర షేర్లను ఆఫర్‌ ఫర్‌ సేల్‌ కింద జారీ చేయనుందని సమాచారం.

వీటిల్లో కంపెనీ ప్రధాన ప్రమోటర్‌బైజ్‌నాధ్‌ చౌధురి అండ్‌ ఫ్యామిలీ ట్రస్ట్‌ రూ.720.4 కోట్ల మేర షేర్లను ఆఫర్‌ చేయనుంది. అన్మోల్‌ బ్రాండ్‌ కింద ఈ కంపెనీ బిస్కెట్లు, కేక్‌లను విక్రయిస్తోంది. మొత్తం 62 రకాల బిస్కెట్లను, 26 వెరైటీల కేక్‌లను అందిస్తోంది.  

Advertisement

తప్పక చదవండి

Advertisement