10,800 పైకి నిఫ్టీ | Sakshi
Sakshi News home page

10,800 పైకి నిఫ్టీ

Published Tue, Jul 10 2018 12:48 AM

Sensex, Nifty hit fresh intraday high - Sakshi

ప్రపంచ మార్కెట్లలోని రిలీఫ్‌ ర్యాలీ ప్రభావంతో సోమవారం మన స్టాక్‌ మార్కెట్‌ భారీ లాభాల్లో ముగిసింది. డాలర్‌తో రూపాయి మారకం బలపడడం, ఇంధన, క్యాపిటల్‌ గూడ్స్, పవర్, బ్యాంకింగ్, లోహ రంగ షేర్లలో జోరుగా కొనుగోళ్లు జరగడం, ఇండెక్స్‌ హెవీ వెయిట్‌ షేర్లు రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ 2 శాతం, ఇన్ఫోసిస్‌ 1.1 శాతం, ఎల్‌ అండ్‌ టీ  1.5 శాతం చొప్పున లాభపడటం సానుకూల ప్రభావం చూపించాయి.

బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 277 పాయింట్ల లాభంతో 35,935 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ  80 పాయింట్ల లాభంతో 10,853 పాయింట్ల వద్ద ముగిశాయి. సెన్సెక్స్‌కు ఇది ఐదు నెలల గరిష్ట స్థాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్‌  320 పాయింట్లు లాభపడింది.   

లాభాల్లో టాటా షేర్లు...
మంగళవారం ఆర్థిక ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో లాభాల స్వీకరణ చోటు చేసుకుని టీసీఎస్‌ షేరు 1.3 శాతం నష్టంతో రూ.1,886 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో ఈ షేర్‌ జీవిత కాల గరిష్ట స్థాయి. రూ.1,930ని తాకింది. ఈ ఏడాది ఇప్పటివరకూ ఈ షేర్‌ 40 శాతం లాభపడింది.

తనను చైర్మన్‌ గిరీ నుంచి అన్యాయంగా తొలగించారంటూ టాటా సన్స్‌కు వ్యతిరేకంగా  సైరస్‌ మిస్త్రీ దాఖలు చేసిన కేసును ఎన్‌సీఎల్‌టీ కొట్టివేసింది. దీంతో టాటా గ్రూప్‌ షేర్లు లాభపడ్డాయి. టాటా పవర్‌ 2 శాతం, టాటా కెమికల్స్‌ 1.6 శాతం, టాటా కాఫీ 0.6 శాతం, టాటా స్టీల్‌ 0.4 శాతం, టాటా మోటార్స్‌ 0.8 శాతం చొప్పున పెరిగాయి.  

ఆల్‌టైమ్‌ హైకి మహీంద్రా...
మహీంద్రా అండ్‌ మహీంద్రా షేర్‌ జీవిత కాల గరిష్ట స్థాయి, రూ.940ని తాకింది. గత ఐదు రోజులుగా ఈ షేర్‌ పెరుగుతూనే ఉంది. ఈ షేర్‌తో పాటు బ్రిటానియా ఇండస్ట్రీస్, హిందుస్తాన్‌ యూనిలివర్, టాటా ఎలెక్సీ, వి–మార్ట్‌ రిటైల్, ఏషియన్‌ పెయింట్స్, బెర్జర్‌ పెయింట్స్, పేజ్‌ ఇండస్టీస్‌ షేర్లు కూడా ఆల్‌టైమ్‌ హైలను తాకాయి.

పేజ్‌ ఇండస్ట్రీస్‌ షేర్‌ నెల రోజుల్లో 20 శాతం ఎగసింది. నాలుగు వారాల క్రితం రూ.24,346గా ఉన్న ఈ షేర్‌ సోమవారం రూ.29,340 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో ఈ షేర్‌ ఆల్‌టైమ్‌ హై, రూ.29,600ని తాకింది. స్టాక్‌ మార్కెట్‌ భారీ లాభాలను సాధించినప్పటికీ, 90కి పైగా షేర్లు తాజా ఏడాది కనిష్ట స్థాయిలను తాకాయి. జేకే సిమెంట్, ఐనాక్స్‌ విండ్, క్వాలిటీ ఇండస్ట్రీస్‌ వంటి షేర్లు ఈ జాబితాలో ఉన్నాయి.   


లాభాలు ఎందుకంటే.. అంతర్జాతీయంగా రిలీఫ్‌ ర్యాలీ...
అమెరికాలో జూన్‌ నెల ఉద్యోగ గణాంకాలు అంచనాలను మించాయి. దీంతో చైనాతో వాణిజ్య యుద్ధ భయాలు వెనక్కి వెళ్లిపోయాయి. మరోవైపు వేతనాల వృద్ధి నెమ్మదించడంతో సెప్టెంబర్‌లో అమెరికా సెంట్రల్‌ బ్యాంక్‌ ఫెడ రల్‌ రిజర్వ్‌ రేట్ల పెంపు అంచనాలు తగ్గాయి. ఫలితంగా శుక్రవారం అమెరికా స్టాక్‌ మార్కెట్‌ భారీ లాభాల్లో ముగిశాయి. ఈ జోరుతో సోమవారం ఆసియా మార్కెట్లు లాభాల్లో ఆరంభమై, లాభాల్లోనే ముగిశాయి. యూరప్‌ మార్కెట్లూ లాభాల్లో ప్రారంభమయ్యాయి.

క్యూ1 ఫలితాలపై ఆశావహ అంచనాలు  
కంపెనీలు వెల్లడించే  ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక ఆర్థిక ఫలితాలు బాగా ఉంటాయనే అంచనాలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌కు జోష్‌నిచ్చాయి.  

కోలుకున్న రూపాయి...
గత వారంలో జీవిత కాల కనిష్ట స్థాయికి పడిపోయిన డాలర్‌తో రూపాయి మారకం పుంజుకోవడం కలసివచ్చింది. గడచిన రెండు ట్రేడింగ్‌ సెషన్స్‌లో 23పైసలు లాభపడింది.

Advertisement
Advertisement