సెన్సెక్స్‌... సెప్టెం‘బేర్‌’ | Sakshi
Sakshi News home page

సెన్సెక్స్‌... సెప్టెం‘బేర్‌’

Published Sat, Sep 29 2018 1:16 AM

 Sensex, Nifty log worst month in over 2 years - Sakshi

లాభనష్టాల మధ్య సయ్యాటలాడిన స్టాక్‌ సూచీలు శుక్రవారం నాటి ట్రేడింగ్‌లో చివరకు నష్టాల్లో ముగిశాయి. స్టాక్‌ మార్కెట్‌ క్షీణించడం ఇది వరుసగా మూడో రోజు. రూపాయి క్షీణత కారణంగా ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ బలహీనంగా ఉండటం, ముడి చమురు ధరలు భగ్గుమంటుండటం, లిక్విడిటీ సమస్యలు స్టాక్‌ మార్కెట్‌ను పడగొట్టాయి. వచ్చే వారం ఆర్‌బీఐ పాలసీ నేపథ్యంలో తాజాగా పొజిషన్లు తీసుకోవడానికి ట్రేడర్లు ముందుకు రాకపోవడం కూడా ప్రతికూల ప్రభావం చూపించింది.

అయితే హెచ్‌డీఎఫ్‌సీ ద్వయం, ఐటీసీలు లాభపడటంతో నష్టాలు తగ్గాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 97 పాయింట్లు క్షీణించి 36,227 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 47 పాయింట్లు పతనమై, 10,930 పాయింట్ల వద్ద ముగిశాయి. వాహన, లోహ, ఆర్థిక, రియల్టీ, ఐటీ, ఫార్మా, మీడియా రంగ షేర్లు నష్టపోయాయి. ఎఫ్‌ఎమ్‌సీజీ, కొన్ని బ్యాంక్‌ షేర్లు లాభపడ్డాయి. ఇక వారం పరంగా చూస్తే, వరుసగా నాలుగో వారమూ స్టాక్‌సూచీలు నష్టాల్లో ముగిశాయి. ఈ వారంలో సెన్సెక్స్‌ 614 పాయింట్లు(1.67 శాతం), ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 213 పాయింట్లు(1.91 శాతం) చొప్పున క్షీణించాయి.  

సెన్సెక్స్‌ 2,418 పాయింట్లు డౌన్‌..
ఈ నెలలో సెన్సెక్స్‌ 2,418 పాయింట్లు,(6.3 శాతం) నిఫ్టీ 700 పాయింట్లకు పైగా నష్టపోయాయి. శాతం పరంగా చూస్తే, రెండున్నరేళ్ల కాలంలో సెన్సెక్స్‌కు ఇదే అత్యంత అధ్వానమైన నెలవారీ క్షీణత. ఈ నెలలో ఇన్వెస్టర్ల సంపద రూ.14 లక్షల కోట్లు హరిం చుకుపోయింది. పలు బ్లూచిప్‌ షేర్లు భారీగా పతనమయ్యాయి. మారుతీ సుజుకీ 21%, టాటా మోటార్స్‌ డీవీఆర్‌ 17%, ఎస్‌బీఐ 14 శాతం, టాటా మోటార్స్‌14 శాతం, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ 13 శాతం, అదానీ పోర్ట్స్‌ 13 శాతం చొప్పున కుదేలయ్యాయి.  

567 పాయింట్ల రేంజ్‌లో సెన్సెక్స్‌..
ఆసియా మార్కెట్ల లాభాల కారణంగా సెన్సెక్స్‌ లాభాల్లోనే ఆరంభమైంది. ఆరంభ కొనుగోళ్లతో ఈ లాభాలు కొనసాగాయి.  ఆ తర్వాత నష్టాల్లోకి జారిపోయింది. స్వల్పంగా లాభపడి, మళ్లీ నష్టాల బాట పట్టింది. మళ్లీ కోలుకొని 228 పాయింట్ల లాభంతో 36,552 పాయింట్ల వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. ఆ తర్వాత  నష్టాల్లోకి వెళ్లిపోయింది. 339 పాయింట్ల నష్టంతో 35,986 పాయింట్ల వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకింది.

మొత్తం మీద రోజంతా   567 పాయింట్ల రేంజ్‌లో కదలాడింది. ఇక నిఫ్టీ ఒక దశలో 57 పాయింట్లు పెరగ్గా, మరో దశలో 127 పాయింట్లు పతనమైంది. మనీ మార్కెట్లో ఒడిదుడుకులు తీవ్రం కావడంతో స్టాక్‌ మార్కెట్‌ నష్టపోయిందని జియోజిత్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ రీసెర్చ్‌ హెడ్‌ వినోద్‌ నాయర్‌ చెప్పారు. రూపాయి క్షీణత, బాండ్ల రాబడులు పెరగడం,  ఇతర వర్థమాన మార్కెట్లలో విదేశీ ఇన్వెస్టర్లు అమ్మకాలు సాగించడంతో మన మార్కెట్లో అప్రమత్త వాతావరణం ఏర్పడిందని వివరించారు.  

నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీల షేర్ల నష్టాలు కొనసాగాయి. దివాన్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ 5 శాతం, ఇండియాబుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ 9 శాతం, పీఎన్‌బీ హౌసింగ్‌ ఫైనాన్స్‌ 4.4 శాతం చొప్పున నష్టపోయాయి.  
   సెప్టెంబర్‌ అమ్మకాల గణాంకాలు వెల్లడి కానున్న నేపథ్యంలో వాహన షేర్లు పతనమయ్యాయి.   
   లోహ షేర్లు అమ్మకాల ఒత్తిడితో విలవిలలాడాయి. జిందాల్‌ స్టీల్, సెయిల్, నాల్కో, హిందాల్కో, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, టాటా స్టీల్, హిందుస్తాన్‌ జింక్‌  షేర్లు 4 శాతం వరకూ        నష్టపోయాయి.  
    నిఫ్టీలో లుపిన్‌ స్థానంలో జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ను చేర్చిన నేపథ్యంలో జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ షేర్‌ 5 శాతం పెరిగింది.  
    విజయా బ్యాంక్, దేనా బ్యాంక్‌ విలీనానికి సంబంధించిన కీలకమైన బోర్డ్‌ సమావేశం నేడు(శనివారం) జరగనుండటంతో బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా షేర్‌ భారీగా పడిపోయింది. రూ.100 దిగువకు పడిపోయిన ఈ షేర్‌ చివరకు 6 శాతం నష్టంతో రూ. 99 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో ఈ షేర్‌ ఐదేళ్ల కనిష్ట స్థాయి, రూ.97ను తాకింది.
    యస్‌ బ్యాంక్‌ షేర్‌ పతనం శుక్రవారం కూడా కొనసాగింది. ఈ షేర్‌  9.7 శాతం నష్టంతో రూ.183 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో ఈ షేర్‌ 18 శాతం నష్టంతో రూ.166 వద్ద, తాజా ఏడాది కనిష్ట స్థాయిని తాకింది. ఈ బ్యాంక్‌ సీఈఓ రాణా కపూర్‌ పదవీకాలాన్ని ఆర్‌బీఐ కుదించినప్పటినుంచి ఈ షేర్‌ నష్టపోతూనే ఉంది. గత రెండు రోజుల్లో ఈ బ్యాంక్‌ మార్కెట్‌ క్యాప్‌ రూ.9,203 కోట్లు హరించుకుపోయి, రూ.42,364 కోట్ల వద్ద ముగిసింది.  సెన్సెక్స్‌లో బాగా నష్టపోయిన షేర్‌ ఇదే. బీఎస్‌ఈలో 93 లక్షలు, ఎన్‌ఎస్‌ఈలో 14 కోట్ల షేర్లు చేతులు మారాయి.  
    500కు పైగా షేర్లు తాజా ఏడాది కనిష్ట స్థాయిలకు పడిపోయాయి. అలహాబాద్‌ బ్యాంక్, అపోలో టైర్స్, అరవింద్, అశోక బిల్డ్‌కాన్, బీఈఎమ్‌ఎల్, కెన్‌ఫిన్‌ హోమ్స్, డీహెచ్‌ఎఫ్‌ఎల్, డీసీబీ బ్యాంక్, హీరో మోటొకార్ప్, ఇండియాబుల్స్‌ రియల్‌ఎస్టేట్, వొడాఫోన్‌ ఐడియా, జెట్‌ ఎయిర్‌వేస్, మారుతీ సుజుకీ ఇండియా, ఎన్‌బీసీసీ, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్, రిలయన్స్‌ క్యాపిటల్, రిలయన్స్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, టాటా మోటార్స్, యూనియన్‌ బ్యాంక్, యస్‌బ్యాంక్, ఐడీఎఫ్‌సీ, సియట్, క్యాస్ట్రాల్‌ ఇండియా,  షేర్లు ఈ జాబితాలో ఉన్నాయి.
 గురువారం అమెరికా మార్కెట్‌ లాభపడిన జోష్‌తో ఆసియా మార్కెట్లు లాభాల్లో ఆరంభమై, లాభాల్లోనే ముగిశాయి. యూరప్‌ మార్కెట్లు బలహీనంగా  ఆరంభమై, మిశ్రమంగా ముగిశాయి.

Advertisement
Advertisement