మార్కెట్‌ జంప్‌ | Sakshi
Sakshi News home page

మార్కెట్‌ జంప్‌

Published Tue, Jun 20 2017 1:06 AM

మార్కెట్‌ జంప్‌

సెన్సెక్స్‌ 255 పాయింట్లు, నిఫ్టీ 69 పాయింట్లు అప్‌
సానుకూల అంతర్జాతీయ సంకేతాలు
జీఎస్‌టీ అమలుపై భరోసా


ముంబై: అంతర్జాతీయ సానుకూల సంకేతాలకు తోడు.. జీఎస్‌టీ అమలుకు కేంద్రం శరవేగంగా చర్యలు చేపట్టడంతో సోమవారం మార్కెట్‌ పరుగులు తీసింది. ఇంట్రాడేలో బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 31,362 పాయింట్లస్థాయికి ఎగిసిన తర్వాత..చివరకు క్రితం ముగింపుతో పోలిస్తే 255 పాయింట్ల లాభంతో 31,312 పాయింట్ల వద్ద ముగిసింది. సెన్సెక్స్‌కు ఇది రికార్డు ముగింపు. జూన్‌ 5నాటి 31,309 పాయింట్ల ముగింపుస్థాయికంటే ఎగువన ముగిసి ఈ సూచి కొత్త రికార్డు నెలకొల్పింది. ఇంట్రాడేలో 9,673 పాయింట్ల వరకూ పెరిగిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ...చివరకు 69 పాయింట్ల పెరుగుదలతో 9,657 పాయింట్ల వద్ద క్లోజయ్యింది.

జీఎస్‌టీ వ్యవస్థలోకి వ్యాపారస్తులు సులభంగా మారేందుకు వీలుగా రిటర్నుల దాఖలు గడువును రెండు నెలలు పెంచడం పట్ల మార్కెట్‌ సెంటిమెంట్‌ బాగా మెరుగయ్యిందని జియోజిత్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ రీసెర్చ్‌ హెడ్‌ వినోద్‌ నాయర్‌ చెప్పారు. అలాగే రుణాలు ఎగవేసిన కార్పొరేట్లపై బ్యాంకులు దివాళా ప్రక్రియ ప్రారంభించడానికి రిజర్వుబ్యాంక్‌ ఒత్తిడి చేయడంవల్ల బ్యాంకుల బ్యాలెన్స్‌ షీట్‌లు మెరుగవుతాయన్న అంచనాలు కూడా మార్కెట్లో తాజా కొనుగోళ్లకు కారణమని విశ్లేషించారు.

ప్రపంచ మార్కెట్ల ర్యాలీ..: ఇటీవల ఫ్రాన్స్‌ అధ్యక్షునిగా ఎన్నికైన మాక్రాన్‌కు చెందిన సెంట్రిస్ట్‌ పార్టీ పార్లమెంటరీ ఎన్నికల్లో మంచి మెజారిటీ సాధించడం, బ్రిటన్‌...బ్రెగ్జిట్‌ చర్చల్ని ప్రారంభించడం వంటి సానుకూల అంశాల ప్రభావంతో ప్రపంచ ప్రధాన మార్కెట్లు కూడా పెరిగాయి.

రికార్డుస్థాయికి బ్యాంక్‌ నిఫ్టీ...
తాజా ర్యాలీలో బ్యాంకింగ్‌ షేర్లపై ఇన్వెస్టర్లు దృష్టినిలపడంతో ఎన్‌ఎస్‌ఈ బ్యాంక్‌ నిఫ్టీ కొత్త రికార్డుస్థాయి 23,800 పాయింట్లకు తాకింది. చివరకు 1 శాతం లాభంతో చరిత్రాత్మక గరిష్టస్థాయి 27,750 పాయింట్ల వద్ద ముగిసింది.

Advertisement
Advertisement