మార్కెట్లలో కొనసాగిన ర్యాలీ | Sakshi
Sakshi News home page

మార్కెట్లలో కొనసాగిన ర్యాలీ

Published Sat, May 26 2018 1:16 AM

 Sensex, Nifty tread higher - Sakshi

ముంబై: దేశీయ స్టాక్‌ మార్కెట్లు వరుసగా రెండో రోజూ లాభాల్లో ముగిశాయి. ఎనర్జీ, మెటల్‌ కౌంటర్లలో అధిక కొనుగోళ్లు జరిగాయి. రూపాయి రికవరీ, దేశీయ ఇన్‌స్టిట్యూషనల్‌ ఇన్వెస్టర్లు భారీగా కొనుగోళ్లతో సానుకూల సెంటిమెంట్‌ నెలకొన్నట్టు బ్రోకర్లు తెలిపారు. ఉదయం సెన్సెక్స్‌ 34,753 వద్ద ప్రారంభం కాగా, రోజంతా అప్‌ట్రెండ్‌ కొనసాగించింది. ఇంట్రాడేలో 35,017.93 గరిష్ట స్థాయి వరకు వెళ్లింది. చివరికి 261 పాయింట్ల లాభంతో 34,924.87 వద్ద క్లోజయింది.

ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ సైతం 91.30 పాయింట్ల పెరుగుదలతో 10,605.15 వద్ద ముగిసింది. ఈ వారంలో సెన్సెక్స్‌ 76.57 పాయింట్ల లాభంలో ముగియగా, నిఫ్టీ 8.75 పాయింట్ల మేర పెరిగింది. రూపాయి, చమురు ధరల్లో కాస్తంత ఉపశమనం రావడంతో మార్కెట్లు ఈ వారంలో నష్టాలను పూడ్చుకోగలిగినట్టు జియోజిత్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ రీసెర్చ్‌ హెడ్‌ వినోద్‌నాయర్‌ పేర్కొన్నారు.

షార్ట్‌ కవరింగ్‌ కూడా లాభాలకు కారణమైనట్టు చెప్పారు. క్రూడాయిల్‌ బెంచ్‌మార్క్‌ బ్రెంట్‌ 77.03 డాలర్లకు దిగొచ్చింది. శుక్రవారం విదేశీ ఇన్వెస్టర్లు రూ.768 కోట్లు అమ్మకాలు జరపగా, దేశీయ ఇన్‌స్టిట్యూషనల్‌ ఇన్వెస్టర్లు రూ.887 కోట్ల మేర కొనుగోళ్లు చేశారు. సెన్సెక్స్‌లో ఓఎన్‌జీసీ అత్యధికంగా 4.59 శాతం లాభపడింది. టాటా స్టీల్‌ 3.43 శాతం పెరిగింది. యెస్‌ బ్యాంకు, ఇండస్‌ఇండ్‌ బ్యాంకు, అదానీ పోర్ట్స్‌ 2 శాతానికి పైగా లాభపడ్డాయి.

మోదీ హయాంలో 72 లక్షల కోట్ల సంపద
మోదీ సర్కారు కొలువు దీరిన తర్వాత ఈ నాలుగేళ్లలో ప్రధాన సూచీలు 40 శాతం మేర లాభపడ్డాయి. 2014 మే 26న మోదీ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయగా ఆరోజు నుంచి సెన్సెక్స్‌ 10,207.99 పాయింట్లు (41.30 శాతం) లాభపడింది. ఫలితంగా ఇన్వెస్టర్ల సంపద రూ.72 లక్షల కోట్ల మేర వృద్ధి చెందింది. నిఫ్టీ కూడా 3,246.10 పాయింట్ల మేర పెరిగింది. ఇది 44.11 శాతం పెరుగుదల. శుక్రవారం క్లోజింగ్‌తో చూస్తే బీఎస్‌ఈ మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ రూ.1,47,28,699 కోట్లుగా ఉంది.

‘‘మోదీ నాలుగేళ్ల పాలనలో మార్కెట్‌ రోలర్‌కోస్టర్‌ రైడ్‌ మాదిరిగా ఎగుడుదిగుళ్లుగా ఉంది. కొన్ని విధానాలకు సంబంధించి ప్రణాళిక, నిర్వహణ పరంగా మోదీ ప్రభుత్వ పనితీరు చెప్పుకోతగ్గ స్థాయిలో ఉంది. అయితే, స్థూల ఆర్థిక అంశాల్లో అంత పెరుగుదల లేదు’’ అని శామ్కో సెక్యూరిటీస్‌ సీఈవో జిమీత్‌మోదీ పేర్కొన్నారు. ‘‘మోదీ సర్కారు నాలుగేళ్ల కాలంలో సెన్సెక్స్‌ పెరుగుదల 40 శాతమే. అయితే, 2018–19 నుంచి వృద్ధి పుంజుకోవాల్సి ఉంది’’ అని జియోజిత్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ చీఫ్‌ స్ట్రాటజిస్ట్‌ వీకే విజయ్‌కుమార్‌ పేర్కొన్నారు.   


టీసీఎస్‌ రూ.7 లక్షల కోట్ల మైలురాయి
ఐటీ రంగ దిగ్గజ కంపెనీ టీసీఎస్‌ మార్కెట్‌ వ్యాల్యూషన్‌ మొదటిసారి రూ.7 లక్షల కోట్లను దాటింది. శుక్రవారం ఇంట్రాడేలో టీసీఎస్‌ 3,674 గరిష్ట స్థాయిని నమోదు చేయగా, ఆ ధర ప్రకారం మార్కెట్‌ విలువ రూ.7,03,309 కోట్లుగా నమోదైంది.

అయితే చివరికి స్టాక్‌ స్వల్పంగా నష్టపోయి బీఎస్‌ఈలో రూ.3,589.45 వద్ద ముగిసింది.  దీంతో మార్కెట్‌ క్యాప్‌ 6,87,123.96 కోట్లకు పరిమితమైంది. మార్కెట్‌ విలువలో టీసీఎస్‌ దేశీయంగా మొదటి స్థానంలో ఉంది.  తర్వాత ఆర్‌ఐఎల్‌ రూ.5,83,908.87కోట్ల మార్కెట్‌విలువతో రెండో స్థానంలో ఉంది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, హెచ్‌యూఎల్, ఐటీసీ వరుసగా టాప్‌ 5లో ఉన్నాయి.

 

Advertisement
Advertisement