ట్రంప్‌ వీసా బిల్లుకు ఐటీ షేర్లు కుదేల్‌ | Sakshi
Sakshi News home page

ట్రంప్‌ వీసా బిల్లుకు ఐటీ షేర్లు కుదేల్‌

Published Wed, Feb 1 2017 1:52 AM

ట్రంప్‌ వీసా బిల్లుకు ఐటీ షేర్లు కుదేల్‌ - Sakshi

8,600 పాయింట్ల దిగువకు నిఫ్టీ
71 పాయింట్ల నష్టంతో 8,561 వద్ద ముగింపు
194 పాయింట్ల నష్టంతో 27,656కు సెన్సెక్స్‌


బడ్జెట్‌ నేపథ్యంలో ఇన్వెస్టర్ల ముందు జాగ్రత్త, అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్‌  ట్రంప్‌ వీసా బిల్లు కారణంగా మంగళవారం స్టాక్‌ మార్కెట్‌ నష్టాల్లో ముగిసింది. ఆర్థిక సర్వే వృద్ధి అంచనాలను తగ్గించడం ప్రతికూల ప్రభావం చూపడంతో ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 8,600 పాయింట్ల దిగువకు పడిపోయింది.  బీఎస్‌ఈ సెన్సెక్స్‌194 పాయింట్లు నష్టపోయి 27,656 పాయింట్ల వద్ద, నిఫ్టీ 71 పాయింట్లు నష్టపోయి 8,561 పాయింట్ల వద్ద ముగిశాయి. సెన్సెక్స్‌కు ఇది వారం కనిష్ట స్థాయి. ఆయిల్, గ్యాస్, పీఎస్‌యూ, ఫార్మా, ఇన్‌ఫ్రా, లోహ షేర్లు నష్టపోయాయి.

లాభాల స్వీకరణ.. : పెద్ద కరెన్సీ నోట్ల రద్దు, రుణ వృద్ధి అంతంతమాత్రంగానే ఉండడం, కమోడిటీ ధరలు పెరగడం,  విదేశాల్లో పరిస్థితులు ఆశాజనకంగా లేకపోవడం తదితర కారణాల వల్ల వృద్ధి 6.5 శాతమే ఉండగలదని ఆర్థిక సర్వే అంచనా వేసిందని జియోజిత్‌ బీఎన్‌పీ పారిబా ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ రీసెర్చ్‌ హెడ్‌ వినోద్‌ నాయర్‌ చెప్పారు. ఆర్థిక సర్వే వృద్ధి అంచనాలు,  ట్రంప్‌ కఠినమైన వీసా బిల్లు నేపథ్యంలో టెక్నాలజీ షేర్లలో షార్ట్స్‌ బిల్డప్‌ కావడం ప్రతికూల ప్రభావం చూపాయి. పైగా బుధవారం బడ్జెట్‌ సమర్పణ నేపథ్యంలో లాభాల స్వీకరణ చోటు చేసుకుంది.

ఐటీ షేర్లు డౌన్‌...: ట్రంప్‌ కఠినమైన వీసా నిబంధనల కారణంగా ఐటీ షేర్లు విలవిలలాడాయి.వీసా నిబంధనల కారణంగా హెచ్‌ 1 బీ వీసా ఉన్న వారికి ప్రస్తుతం ఇస్తున్న 60 వేల డాలర్ల వేతాన్ని లక్షన్నర డాలర్లకు ఐటీ కంపెనీలు పెంచాల్సి ఉంటుంది. దీంతో ఐటీ కంపెనీల లాభదాయకత ప్రభావితమవుతుందన్న అంచనాలతో ఐటీ షేర్లు కుదేలయ్యాయి. టీసీఎస్‌ 4.6 శాతం, ఇన్ఫోసిస్‌ 2 శాతం, టెక్‌ మహీంద్రా 4 శాతం వరకూ పతనమయ్యాయి. ఈ పతనంతో అగ్రశ్రేణి ఐదు (ఇన్ఫోసిస్, టీసీఎస్, విప్రో, టెక్‌ మహీంద్రా, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌) ఐటీ కంపెనీల మార్కెట్‌ క్యాప్‌ రూ.33,000 కోట్లు హరించుకుపోయింది.  మిడ్‌ క్యాప్‌ ఐటీ కంపెనీల షేర్లు కూడా కుదేలయ్యాయి.


 

Advertisement
Advertisement