మళ్లీ 33 వేల పైకి సెన్సెక్స్‌ | Sakshi
Sakshi News home page

మళ్లీ 33 వేల పైకి సెన్సెక్స్‌

Published Fri, Nov 17 2017 12:29 AM

Sensex rises to 33,000 - Sakshi - Sakshi

మూడు రోజుల వరుస నష్టాల అనంతరం గురువారం స్టాక్‌మార్కెట్లో రిలీఫ్‌ ర్యాలీ చోటు చేసుకుంది. అంతర్జాతీయ సంకేతాలు సానుకూలంగా ఉండడం కూడా కలసిరావడంతో సెన్సెక్స్‌ 33 వేల పాయింట్లపైన, నిఫ్టీ 10,200 పాయింట్ల ఎగువన ముగిశాయి. అన్ని రంగాల షేర్లు... ప్రధానంగా బ్యాంక్‌ షేర్లు లాభపడ్డాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 346 పాయింట్ల లాభంతో 33,107 పాయింట్ల వద్ద, నిఫ్టీ 97 పాయింట్ల లాభంతో 10,215 పాయింట్ల వద్ద ముగిశాయి. స్టాక్‌ సూచీలు ఒక్క రోజులో ఇన్ని పాయింట్లు లాభపడడం ఈ నెలలో ఇదే మొదటిసారి.

బ్లూ చిప్‌ షేర్లలో కొనుగోళ్లు..
బ్లూ చిప్‌ షేర్లలో కొనుగోళ్లు జరగడం, అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు తగ్గడం, ఆసియా మార్కెట్లు లాభాల్లో ముగియడం, యూరప్‌ మార్కెట్లు లాభాల్లో ప్రారంభం కావడం సానుకూల ప్రభావం చూపించాయి. ముడి చమురు ధరలు తగ్గడం వల్ల ద్రవ్యలోటు ఆందోళనలు తగ్గుముఖం పట్టి, కొనుగోళ్లు జోరందుకున్నాయని నిపుణులు పేర్కొన్నారు. ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 405 పాయింట్లు, నిఫ్టీ 114 పాయింట్ల వరకూ లాభపడటం గమనార్హం.

ఒడిదుడుకులున్నా, బుల్‌ రన్‌ కొనసాగుతుంది...!
గత మూడు సెషన్లలో సెన్సెక్స్‌ 554 పాయింట్లు  నష్టపోయింది. ఇటీవల మూడు రోజుల నష్టాల కారణంగా ధరలు తగ్గి, ఆకర్షణీయంగా ఉండటంతో పలు ఇండెక్స్‌ షేర్లలో కొనుగోళ్లు జరిగాయని జియోజిత్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ చీఫ్‌ మార్కెట్‌ స్ట్రాటజిస్ట్‌ ఆనంద్‌ జేమ్స్‌ చెప్పారు. కంపెనీల క్యూ2 ఫలితాలు ముగిసినందున ఇక ఇప్పుడు అందరి దృష్టి అమెరికా పన్ను సంస్కరణల బిల్లు,  అంతర్జాతీయ అంశాలపై ఉంటుందని తెలియజేశారు. గుజరాత్‌ ఎన్నికలకు ముందు మార్కెట్లో కొంచెం ఒడిదుడుకులు చోటు చేసుకుంటాయని ఆల్టామౌంట్‌ క్యాపిటల్‌కు చెందిన ప్రకాశ్‌ దివాన్‌ వ్యాఖ్యానించారు. బుల్‌ రన్‌ కొనసాగుతుందని అంచనా వేశారు.

బ్యాంక్, రియల్టీ షేర్ల జోరు..
డాలర్‌ బలపడడం, వచ్చే ఏడాది నుంచి వృద్ధి ఊపందుకుంటుందనే అంచనాలతో ఇన్ఫోసిస్‌ 4 శాతం ఎగసి రూ.989 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో బాగా పెరిగిన షేర్‌ ఇదే. బ్యాంక్‌ల మూలధన నిధుల ప్రణాళిక ఊపందుకోవడంతో బ్యాంక్‌ షేర్లు జోరుగా పెరిగాయి. బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, యూనియన్‌ బ్యాంక్, ఇండియన్‌ బ్యాంక్, అలహాబాద్‌ బ్యాంక్, ఓబీసీ, పీఎన్‌బీ, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, కెనరా బ్యాంక్, సిండికేట్‌ బ్యాంక్‌లు 4–6% రేంజ్‌లో పెరిగాయి. ఎస్‌బీఐ 3% ఎగసింది. ప్రధాన మంత్రి ఆవాస్‌ యోజన పథకం కింద వడ్డీ రాయితీ పొందే గృహాల కార్పెట్‌ ఏరియాను పెంచాలన్న కేబినెట్‌ నిర్ణయంతో రియల్టీ షేర్లు లాభపడ్డాయి. ప్రెస్టీజ్‌ ఎస్టేట్స్, డీఎల్‌ఎఫ్, బ్రిగేడ్‌ ఎంటర్‌ప్రైజెస్, కోల్టే–పాటిల్, పెనున్సులా ల్యాండ్, పురవంకర షేర్లు 2–4% రేంజ్‌లో పెరిగాయి. బుధవారం భారీగా నష్టపోయిన అనిల్‌ అంబానీ షేర్లు గురువారం కోలుకున్నాయి. రిలయన్స్‌ కమ్యూనికేషన్స్‌ 16% లాభపడగా, రిలయన్స్‌ ఇన్‌ఫ్రా, రిలయన్స్‌ క్యాపిటల్, రిలయన్స్‌ హోమ్‌ ఫైనాన్స్, రిలయన్స్‌ నిప్పన్‌ లైఫ్, రిలయన్స్‌ పవర్‌ షేర్లు 1–9% రేంజ్‌లో పెరిగాయి. మొత్తం 31 సెన్సెక్స్‌ షేర్లలో 5 షేర్లు–బజాజ్‌ ఆటో, సిప్లా, హీరో మోటోకార్ప్, కోల్‌ ఇండియా, అదానీ పోర్ట్స్‌ మాత్రమే నష్టపోగా, మిగిలిన 26 షేర్లు లాభాల్లో ముగిశాయి. 

Advertisement

తప్పక చదవండి

Advertisement