సెన్సెక్స్‌ 184 పాయింట్లు డౌన్‌ | Sakshi
Sakshi News home page

సెన్సెక్స్‌ 184 పాయింట్లు డౌన్‌

Published Thu, Feb 16 2017 1:46 AM

సెన్సెక్స్‌ 184 పాయింట్లు డౌన్‌

ప్రభావం చూపిన టాటా మోటార్స్, సన్‌ఫార్మా నష్టాలు
28,156 పాయింట్ల వద్ద ముగిసిన సెన్సెక్స్‌
68 పాయింట్ల నష్టంతో 8,725కు నిఫ్టీ


టాటా మోటార్స్, సన్‌ ఫార్మా కంపెనీల క్యూ3 ఫలితాలు నిరాశకు గురిచేయడంతో బుధవారం స్టాక్‌ మార్కెట్‌ నష్టపోయింది. వరుసగా రెండో రోజు స్టాక్‌  సూచీలు నష్టాల్లో ముగిశాయి.  బీఎస్‌ఈ సెన్సెక్స్‌184 పాయింట్లు నష్టపోయి 28,156 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 68 పాయింట్లు క్షీణించి 8,725 పాయింట్ల వద్ద ముగిశాయి. సెన్సెక్స్‌కు ఇది రెండు వారాల కనిష్ట స్థాయి. వాహన, రియల్టీ, ఫార్మా షేర్లు పతనమయ్యాయి. వచ్చే నెలలో రేట్లను పెంచే అవసరం ఉండొచ్చని ఫెడ్‌ చైర్‌పర్సన్‌ జానెట్‌ ఎలెన్‌ వ్యాఖ్యానించారు.

దీంతో భారత్‌ వంటి వర్థమాన దేశాల నంచి విదేశీ పెట్టుబడులు తరలిపోతాయనే ఆందోళనలు ప్రతికూల ప్రభావం చూపాయి. సెన్సెక్స్‌ నష్టాల్లోనే ప్రారంభమైంది. కొన్ని షేర్లలో కొనుగోళ్ల కారణంగా స్వల్ప సమయం లాభాల్లో ట్రేడయింది. ఆ తర్వాత నష్టాల్లోకి జారిపోయింది. ఇంట్రాడేలో 28,382 పాయింట్లు గరిష్ట స్థాయిని తాకింది. బుధవారం నాటి ముగింపుతో పోల్చితే సెన్సెక్స్‌ ఒక దశలో 237 పాయింట్లు నష్టపోయింది, మరొక దశలో 43 పాయింట్లు లాభపడింది. చివరకు 184 పాయింట్ల నష్టంతో 28,156 పాయింట్ల వద్ద ముగిసింది.

టాటా మోటార్స్‌ 10 శాతం డౌన్‌
క్యూ3లో నికర లాభం 96 శాతం తగ్గడంతో టాటా మోటార్స్‌ షేర్‌ భారీగా పతనమైంది. ఈ షేర్‌ 10.3 శాతం పతనమై రూ.437 వద్ద ముగిసింది. రూ.15,068 కోట్ల మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ హరించుకుపోయింది. ఈ కంపెనీ అనుబంధ సంస్థ, జాగ్వార్, ల్యాండ్‌ రోవర్‌(జేఎల్‌ఆర్‌) హెడ్జింగ్‌ నష్టాలు మరో 3–4 క్వార్టర్ల పాటు కొనసాగుతాయన్న భయాలు టాటా మోటార్స్‌  షేర్‌ను పడగొట్టాయి. రెండు రోజుల్లో ఈ  షేర్‌ 14 శాతం నష్టపోయింది. ఇక టాటా మోటార్స్‌ డీవీఆర్‌ షేర్‌ 15 శాతం పతనమైంది.

Advertisement
Advertisement