టీసీఎస్‌ దెబ్బ  | Sakshi
Sakshi News home page

టీసీఎస్‌ దెబ్బ 

Published Sat, Jan 12 2019 2:09 AM

Sensex slips 97 pts Nifty ends at 10795 TCS falls over 2 percent - Sakshi

టీసీఎస్‌ ఫలితాలు అంచనాలకు అనుగుణంగా లేకపోవడంతో ఇతర కంపెనీల క్యూ3 ఫలితాలపై ఆందోళనతో స్టాక్‌ మార్కెట్లో శుక్రవారం లాభాల స్వీకరణ చోటు చేసుకుంది. ముడి చమురు ధరలు 1 శాతం మేర పెరగడంతో డాలర్‌తో రూపాయి మారకం విలువ పతనం కావడం, అంతర్జాతీయ సంకేతాలు మిశ్రమం ఉండటం ప్రతికూల ప్రభావం చూపించాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 36,000 పాయింట్ల పైన ముగియగా, నిఫ్టీ 10,800 పాయింట్ల దిగువకు పడిపోంది. వరుసగా రెండో రోజూ స్టాక్‌ సూచీలు నష్టపోయాయి. సెన్సెక్స్‌ 97 పాయింట్లు పతనమై 36,010 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 27 పాయింట్లు తగ్గి 10,795 పాయింట్ల వద్ద ముగిశాయి. ఎఫ్‌ఎమ్‌సీజీ మినహా మిగిలిన అన్ని రంగాల సూచీలు నష్టపోయాయి.

ఇక వారం పరంగా చూస్తే, స్టాక్‌ సూచీలు లాభాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్‌ 315 పాయింట్లు, నిఫ్టీ 68 పాయింట్లు చొప్పున పెరిగాయి. సెన్సెక్స్‌ లాభాల్లోనే ఆరంభమైంది. ఆరంభ కొనుగోళ్ల జోరుతో 108 పాయింట్లు లాభపడింది. అయితే ఆ లాభాలు కొనసాగలేదు. మధ్యాహ్నం తర్వాత అమ్మకాలు వెల్లువెత్తాయి. మధ్యాహ్నం తర్వాత 266 పాయింట్ల వరకూ నష్టపోయింది. చివరి గంటలో కొనుగోళ్ల తోడ్పాటుతో నష్టాలు తగ్గాయి. మొత్తం మీద రోజంతా సెన్సెక్స్‌ 374 పాయింట్ల రేంజ్‌లో కదలాడింది. ఆసియా మార్కెట్లు లాభాల్లో, యూరప్‌ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి.  గురువారం మార్కెట్‌ ముగిసిన తర్వాత టీసీఎస్‌ క్యూ3 ఫలితాలు వెలువడ్డాయి. నికర లాభం పెరిగినా, మార్జిన్లు అంచనాల కంటే తక్కువగా ఉండటం ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీసింది.

టీసీఎస్‌ షేర్‌ 2.45 శాతం తగ్గి రూ.1,842 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌ మొత్తం 97 పాయింట్ల నష్టంతో టీసీఎస్‌ వాటాయే 48 పాయింట్ల మేర ఉంది.  అంతర్జాతీయ బ్రోకరేజ్‌ సంస్థ సీఎల్‌ఎస్‌ఏ ఐటీసీ షేర్‌ బై రేటింగ్‌ను ఇచ్చింది. టార్గెట్‌ ధరను రూ.390 నుంచి రూ.400కు పెంచింది. దీంతో ఐటీసీ షేర్‌ 2 శాతం లాభంతో రూ. వద్ద ముగిసింది.  ఎవరెడీ ఇండస్డ్రీస్‌ ఇండియాలో ప్రమోటర్‌ బీఎమ్‌ ఖైతాన్‌ తన వాటాను అమ్మేయనున్నారన్న వార్తల కారణంగా ఆ షేర్‌ 13 శాతం పెరిగి రూ. 205 కు చేరింది.  జాగ్వార్‌ ల్యాండ్‌ రోవర్‌(జేఎల్‌ఆర్‌) గత నెల అంతర్జాతీయ అమ్మకాలు 6 శాతం తగ్గడంతో ఐదు రోజుల టాటా మోటార్స్‌ పరుగుకు బ్రేక్‌  పడింది. ఈ షేర్‌ 3 శాతం వరకూ నష్టపోయి రూ.180 వద్ద ముగిసింది.  దాదాపు వందకు పైగా షేర్లు తాజా ఏడాది కనిష్ట స్థాయిలకు పడిపోయాయి. టాటా స్టీల్, అపోలో ట్యూబ్స్, దేనా బ్యాంక్, నీల్‌కమల్‌ తదితర షేర్లు ఈ జాబితాలో ఉన్నాయి. మరోవైపు ఆర్తి ఇండస్ట్రీస్, ముత్తూట్‌ ఫైనాన్స్, పీవీఆర్, టొరెంట్‌ ఫార్మా వంటి 40కు పైగా షేర్లు తాజా ఏడాది గరిష్ట స్థాయిలను తాకాయి. 

Advertisement
Advertisement