Sakshi News home page

వచ్చే వాటికంటే పోయే ఉద్యోగాలే ఎక్కువ

Published Wed, Apr 26 2017 7:31 PM

వచ్చే వాటికంటే పోయే ఉద్యోగాలే ఎక్కువ

న్యూఢిల్లీ: అమెరికా హెచ్‌ 1 బీ వీసాలను కఠినతరం చేయడం, ఆస్ట్రేలియా 457 వీసాలను రద్దు చేయడంతో ఉద్యోగాలు దొరికేదెట్లా అని భారతీయులు అప్పుడే ఆందోళన చెందుతున్నారు. ముందుంది అసలైన ముసుళ్ల పండగ అన్నట్లు ఉద్యోగాలు దొరక్క అలమటించే రోజులు, హాహాకారాలు చేసే రోజులు ముందున్నాయని పలు సర్వేలు, అంచనాలు ఆందోళన కలిగిస్తున్నాయి. 
 
ఉద్యోగాలు కల్పించడంలో కల్పతరువులాంటి ఐటీ రంగంలోనే గత రెండు నెలలుగా చోటు చేసుకుంటున్న పరిణామాలు ప్రమాద గట్టికలను మోగిస్తున్నాయి. కొన్ని కంపెనీలు కొత్త నియామకాలను నిలిపివేయగా, కొన్ని కంపెనీలు చాలా తక్కువ మందిని నియమించుకుంటున్నాయి. 
 
గతంతో పోలిస్తే మైక్రో,  చిన్న, మధ్యతరహా పరిశ్రమలు తక్కువ సంఖ్యలో నియామకాలు జరుపుతున్నాయి. విప్రో మొదలుకొని లార్సన్‌ అండ్‌ టార్బో, హెచ్‌డీఎఫ్‌సీల వరకు కంపెనీల్లో లేఆఫ్‌లు సాధారణమవుతున్నాయి. ఇటీవలి కాలంలో స్టార్టప్‌ కంపెనీల శంకుస్థాపనలు వేల సంఖ్యలో పెరిగినా అవి కార్యరూపం దాల్చడం మాత్రం అంతంతమాత్రంగానే ఉన్నాయి. ప్రస్తుతం మనుగడలోవున్న కంపెనీల పెరుగుదల రెండు శాతం కూడా ఉండడం లేదు.
 
అమెరికాలో చోటు చేసుకుంటున్న పరిణామాల కారణంగా అక్కడి నుంచి భారత్‌కు వచ్చేందుకు ప్రయత్నిస్తున్న వారి సంఖ్య ఇప్పుడు పదింతలు పెరిగిందని ‘డిలైటీ టచే తోయిమస్త్సు ప్రైవేట్‌ లిమిటెడ్‌’ కంపెనీ తెలిపింది. ప్రస్తుతం ఐటీ రంగంలో పనిచేస్తున్న భారతీయుల్లో 60 శాతం ఉద్యోగులు భవిష్యత్తులో పనికి రాకుండాపోయే ప్రమాదం ఉందని ‘మ్యాక్‌కిన్సే అండ్‌ కంపెనీ’ వెల్లడించింది. అంటే కొత్త ఉద్యోగాలకంటే ఊడిపోయే ఉద్యోగాల సంఖ్యే ఎక్కువన్న మాట.
 
గతేడాది గణాంకాల ప్రకారం దేశంలో 1.70 కోట్లమంది నిరుద్యోగులు ఉన్నారు. దేశంలో ప్రస్తుతం ఉన్నత విద్యను అభ్యసిస్తున్నవారు 340 కోట్ల మంది ఉన్నారు. వారు రేపు పట్టాలు పుచ్చుకోగానే వారికి ఉద్యోగాలు కావాలి. ప్రస్తుతం ఒకటో తరగతి నుంచి 12వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులు దేశంలో దాదాపు 26 కోట్ల మంది ఉన్నారు. ఈ లెక్కన 2028 వరకు దాదాపు 35 కోట్ల కొత్త ఉద్యోగాలు కావాలని పలు సర్వేలు తెలియజేస్తున్నాయి.
 
అంటే రానున్న 11 ఏళ్లలో ఏడాదికి మూడు కోట్ల చొప్పున కొత్త ఉద్యోగాలను సృష్టించాల్సి ఉంది. 2016 సంవత్సరం లెక్కల ప్రకారం ఏడాదికి 1.40 కోట్ల కొత్త ఉద్యోగావకాశాలు లభిస్తున్నాయి. పాశ్చాత్య దేశాల్లో ఉద్యోగావకాశాలు కనుమరుగవుతున్న పరిస్థితుల్లో కొత్త ఉద్యోగాల సంఖ్య ఏడాదికి రెండింతలు పెరగాలంటే ఎంత కష్టమో ఊహించవచ్చు. ఈ అంశాలను దష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వం ఇప్పటి నుంచే భవిష్యత్‌ మీద దష్టి పెట్టి కార్యరంగంలోకి దిగితే తప్ప భవిష్యత్‌ భయానక పరిస్థితుల నుంచి బయటపడలేం. 
 

Advertisement

What’s your opinion

Advertisement