జిల్‌ జిల్‌ జియో! | Sakshi
Sakshi News home page

జిల్‌ జిల్‌ జియో!

Published Tue, May 5 2020 1:02 AM

Silver Lake invests in Mukesh Ambani is Reliance Jio - Sakshi

న్యూఢిల్లీ: పారిశ్రామిక దిగ్గజం రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ గ్రూప్‌ సంస్థల్లోకి పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా ఫేస్‌బుక్‌ బాటలో సిల్వర్‌ లేక్‌ పార్ట్‌నర్స్‌ సంస్థ.. జియో ప్లాట్‌ఫామ్స్‌లో 1.15 శాతం వాటాలు కొనుగోలు చేస్తోంది. ఇందుకోసం రూ. 5,655.75 కోట్లు వెచ్చిస్తోంది. ‘ తాజా డీల్‌ ప్రకారం జియో ప్లాట్‌ఫామ్స్‌ ఈక్విటీ విలువ రూ. 4.90 లక్షల కోట్లుగాను, ఎంటర్‌ప్రైజ్‌ విలువ రూ. 5.15 లక్షల కోట్లుగాను ఉంటుంది‘ అని జియో ప్లాట్‌ఫామ్స్‌ ఒక ప్రకటనలో తెలిపింది.

ఇటీవలే జియో ప్లాట్‌ఫామ్స్‌లో వాటాల కోసం ఫేస్‌బుక్‌ చెల్లించిన రేటుతో పోలిస్తే సిల్వర్‌ లేక్‌ 12.5 శాతం అధిక ప్రీమియం చెల్లిస్తోంది. జియో ప్లాట్‌ఫామ్స్‌ విలువను రూ. 4.62 లక్షల కోట్ల కింద లెక్కించి 9.99 శాతం వాటాల కోసం ఫేస్‌బుక్‌ రూ. 43,574 కోట్లు చెల్లించింది. టెలికం కార్యకలాపాలు సహా డిజిటల్‌ వ్యాపార విభాగాలన్నింటినీ కలిపి జియో ప్లాట్‌ఫామ్స్‌ కింద రిలయన్స్‌ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ‘ ప్రముఖ టెక్నాలజీ కంపెనీల్లో సిల్వర్‌ లేక్‌ ఎంతో విలువైన భాగస్వామిగా ఉంది. సిల్వర్‌ లేక్‌ పెట్టుబడులు పెట్టడాన్ని స్వాగతిస్తున్నా.

దేశప్రజలందరికీ ప్రయోజనాలు చేకూరేలా భారతీయ డిజిటల్‌ సమాజంలో విప్లవాత్మకమైన మార్పులు తెచ్చేందుకు ఇది దోహదపడగలదని ఆశిస్తున్నాను‘ అని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేశ్‌ అంబానీ తెలిపారు. ‘జియో ప్లాట్‌ఫామ్స్‌కు ప్రపంచ దిగ్గజ కంపెనీల్లో విశిష్ట స్థానముంది.  సాహసోపేతమైన లక్ష్యాన్ని సుసాధ్యం చేసే దిశగా పటిష్టమైన మేనేజ్‌మెంట్‌ సారథ్యంలో నడుస్తోంది‘ అని సిల్వర్‌ లేక్‌ కో–సీఈవో ఎగాన్‌ డర్బన్‌ పేర్కొన్నారు. 20 శాతం దాకా వాటాలను వ్యూహాత్మక, ఆర్థిక ఇన్వెస్టర్లకు జియో ప్లాట్‌ఫామ్స్‌ విక్రయిస్తోంది. ఇప్పటికే ఇందులో సగభాగం ఫేస్‌బుక్‌ కొనుగోలు చేసింది. మిగతా వాటాలను సిల్వర్‌ లేక్‌తో పాటు ఇతర ఇన్వెస్టర్లు కొనుగోలు చేయనున్నారు.  

సిల్వర్‌ లేక్‌ కథ ఇదీ..
భారీ టెక్నాలజీ కంపెనీల్లో ఇన్వెస్ట్‌ చేయడంలో సిల్వర్‌ లేక్‌ పార్ట్‌నర్స్‌ పేరు ప్రముఖంగా వినిపిస్తుంటుంది. దీని నిర్వహణలోని ఆస్తులు, పెట్టుబడుల పరిమాణం 40 బిలియన్‌ డాలర్ల పైగానే ఉంటుంది. ఎయిర్‌బీఎన్‌బీ, ఆలీబాబా, యాంట్‌ ఫైనాన్షియల్, ఆల్ఫాబెట్‌లో భాగమైన వెరిలీ.. వేమో విభాగాల్లో, డెల్‌ టెక్నాలజీస్, ట్విటర్‌ తదితర గ్లోబల్‌ దిగ్గజ సంస్థల్లో ఇది ఇన్వెస్ట్‌ చేస్తింది.  భారత్‌లో సిల్వర్‌లేక్‌ ఇంత భారీ పెట్టుబడులు పెట్టడం ఇదే ప్రథమం.  

రుణభారం తగ్గించుకునే దిశగా అడుగులు
2021 నాటికి రుణరహిత సంస్థగా మారాలని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ నిర్దేశించుకుంది. మార్చి త్రైమాసికం ఆఖరు నాటికి సంస్థ నికర రుణభారం రూ. 1,61,035 కోట్లుగా ఉంది. రుణ భారం తగ్గించుకునే ప్రణాళికల్లో భాగంగా జూన్‌ నాటికి రూ. 1.04 లక్షల కోట్లు సమీకరించాలని రిలయన్స్‌ భావిస్తోంది. జియో ప్లాట్‌ఫామ్స్, ఇంధన రిటైలింగ్‌ వ్యాపారంలో వాటాల విక్రయంతో పాటు రైట్స్‌ ఇష్యూ తదితర మార్గాల్లో సమీకరించనుంది.

Advertisement
Advertisement