అంచనాలు మించనున్న ద్రవ్యలోటు | Sakshi
Sakshi News home page

అంచనాలు మించనున్న ద్రవ్యలోటు

Published Thu, Jan 1 2015 2:43 AM

అంచనాలు మించనున్న ద్రవ్యలోటు

ఇప్పటికే బడ్జెట్ లక్ష్యంలో 99% చేరిక
నవంబర్ వరకూ పరిస్థితిపై గణాంకాలు

న్యూఢిల్లీ: కేంద్ర ద్రవ్య పరిస్థితి క్లిష్టతను సూచిస్తూ ‘లోటు’ గణాంకాలు బుధవారం వెలువడ్డాయి. ఏప్రిల్-నవంబర్ మధ్య ద్రవ్యలోటు రూ.5.25 లక్షల కోట్లుగా నమోదయ్యింది. 2014-15 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ లక్ష్యంలో (రూ.5.31 లక్షల కోట్లు) ఈ పరిమాణం ఇప్పటికే దాదాపు 99 శాతానికి చేరినట్లయ్యింది. ఆర్థిక సంవత్సరంలో ఇంకా నాలుగు నెలలు మిగిలి ఉండగానే ద్రవ్యలోటు 99 శాతానికి చేరిపోవడం స్థూల ఆర్థిక రంగానికి సంబంధించి చర్చనీయాంశం. గత ఏడాది ఇదే నెలకు ద్రవ్యలోటు 93.9 శాతంగా ఉంది.  

కేంద్రానికి ఒక నిర్దిష్ట ఏడాదిలో వచ్చే మొత్తం ఆదాయం-చేసే వ్యయం మధ్య వ్యత్యాసాన్ని ద్రవ్యలోటుగా పేర్కొంటాం. రెవెన్యూ భారీగా తగ్గడమే తాజా పరిస్థితికి కారణమని సంబంధిత వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఆర్థిక సంవత్సరం మొత్తంగా రూ.9.77 లక్షల కోట్ల నికర పన్ను వసూళ్లను బడ్జెట్ అంచనా వేసింది. అయితే నవంబర్ నాటికి ఈ మొత్తం రూ.4.13 లక్షల కోట్లుగా నమోదయ్యాయి.  

కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ తాజాగా ఈ గణాంకాలను విడుదల చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొత్తం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో ద్రవ్యలోటును 4.1 శాతం (రూ.5.31 లక్షల కోట్లు)  వద్ద కట్టడి చేయాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. అయితే ఇప్పటికే ఈ పరిమాణం 98.9 శాతానికి చేరడంతో లక్ష్యసాధన కష్టమేనన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. 2013-14లో జీడీపీలో ద్రవ్యలోటు 4.5 శాతం (రూ.5.08 లక్షల కోట్లు). 2012-13లో ఇది 4.9 శాతంగా ఉంది.

Advertisement
Advertisement