స్మార్ట్ తయారీకి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ | Sakshi
Sakshi News home page

స్మార్ట్ తయారీకి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్

Published Tue, Dec 1 2015 2:05 AM

స్మార్ట్ తయారీకి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ - Sakshi

 తెలంగాణలో ఏర్పాటుకు ప్రతిపాదన
 నీతి ఆయోగ్ సభ్యుడు సారస్వత్
 హైదరాబాద్, బిజినెస్ బ్యూరో:
డిఫెన్స్, ఏరోస్పేస్ రంగంలో స్మార్ట్ మాన్యుఫ్యాక్చరింగ్‌ను ప్రోత్సహించేందుకు తొలి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌ను తెలంగాణలో ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ‘రక్షణ, అంతరిక్ష రంగానికి అవసరమైన పరికరాల తయారీలో ప్రముఖ కేంద్రంగా రూపొందేందుకు తెలంగాణలో అన్ని వసతులు, మానవ వనరులు ఉన్నాయి. అందుకే ఈ సెంటర్‌ను ఇక్కడ నెలకొల్పాలని కేంద్రానికి ప్రతిపాదించాం’ అని నీతి ఆయోగ్ సభ్యుడు వి.కె.సారస్వత్ సోమవారం వెల్లడించారు. హెచ్‌ఐసీసీలో జరుగుతున్న డిఫెన్స్, ఏరోసప్లై సదస్సులో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడారు.
 
 మెయింటెనెన్స్, రిపేర్, ఓవర్‌హాలింగ్(ఎంఆర్‌వో) రంగంలో లాభదాయకత తగ్గిందని సారస్వత్ చెప్పారు. కొన్ని రాష్ట్రాల్లో విడిభాగాలపైన అధిక వ్యాట్‌తోపాటు ఇతర పన్నుల మూలంగా విమానయాన సంస్థలు సర్వీసింగ్ కోసం సింగపూర్, అబుదాబి వంటి దేశాలకు వెళ్తున్నాయని వెల్లడించారు. దేశంలో వడ్డీ రేట్లు ఇంకా ఎక్కువగా ఉన్నాయంటూ... ఇటువంటి అడ్డంకులను తొలగించినప్పుడే ఈ రంగం బలపడుతుందని చెప్పారు. భారత ఎంఆర్‌వో రంగం 2020 నాటికి రూ.16,900 కోట్లకు చేరుకుంటుందని ఆయన వెల్లడించారు.
 
 ఐదేళ్లలో రూ.13 వేల కోట్లు..
 వైమానిక, రక్షణ ప్రాజెక్టులకై భారతీయ కంపెనీల నుంచి విడిభాగాలను ఎయిర్‌బస్ కొనుగోలు చేస్తోంది. వచ్చే ఐదేళ్లలో దేశం నుంచి రూ.13,000 కోట్ల విలువైన విడిభాగాలను సమీకరించాలన్నది గ్రూప్ లక్ష్యమని ఎయిర్‌బస్ డిఫెన్స్, స్పేస్ ఇండియా హెడ్ వెంకట్ కట్కూరి వెల్లడించారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా 5 వేల మందికి ఎయిర్‌బస్ ఉపాధి కల్పిస్తోందని చెప్పారు. భారత్‌లో అవకాశాలతో పాటు అడ్డంకులూ ఉన్నాయన్నారు. కాగా, కార్యక్రమంలో తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి రాజీవ్ శర్మ పాల్గొని మాట్లాడారు.
 

Advertisement
Advertisement