ఆన్‌లైన్ షాపింగ్ హల్‌చల్..! | Sakshi
Sakshi News home page

ఆన్‌లైన్ షాపింగ్ హల్‌చల్..!

Published Fri, Nov 21 2014 12:41 AM

ఆన్‌లైన్ షాపింగ్ హల్‌చల్..!

న్యూఢిల్లీ: భారత్‌లో ఆన్‌లైన్ కొనుగోళ్లు దూసుకెళ్తున్నాయని సెర్చింజన్ దిగ్గజం గూగుల్ పేర్కొంది. రెండేళ్లలో(2016 కల్లా) ఈ-కామర్స్ మార్కెట్ 15 బిలియన్ డాలర్ల(దాదాపు రూ.93 వేల కోట్లు)కు ఎగబాకనున్నట్లు తెలిపింది. ప్రధానంగా ఇంటర్నెట్ వినియోగం అంతకంతకూ పెరుగుతుండటం.. ఆన్‌లైన్‌లో షాపింగ్‌కు మొగ్గుచూపుతున్నవాళ్ల సంఖ్య జోరందుకుంటుండటమే దీనికి కారణమని వెల్లడించింది. ప్రస్తుతం దేశంలో ఈ-కామర్స్ మార్కెట్ విలువ 3 బిలియన్ డాలర్లు(సుమారు రూ.18,600 కోట్లు)గా పరిశ్రమ విశ్లేషకుల అంచనా. 2012లో ఆన్‌లైన్ కొనుగోలుదారుల సంఖ్య 80 లక్షలు కాగా, ప్రస్తుతం ఈ సంఖ్య దాదాపు 3.5 కోట్లకు పెరిగిందని గూగుల్ పేర్కొంది.

దుస్తులు, పాదరక్షల నుంచి ఎలక్ట్రానిక్స్, సౌందర్య ఉత్పత్తులు, ఫర్నిచర్ ఇలా సమస్తం ఆన్‌లైన్ ద్వారా కొనుగోలు చేస్తున్న ట్రెండ్ వేగంగా విస్తరిస్తోంది. కాగా, 2016నాటికి ఆన్‌లైన్ షాపర్ల సంఖ్య మూడింతలై 10 కోట్లకు వృద్ధి చెందనుందనేది గూగుల్ అంచనా. కన్సల్టింగ్ సంస్థ ఫారెస్టర్ నిర్వహించిన అధ్యయనం ఆధారంగా రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. సర్వేలో 6,859 మంది పాల్గొన్నారు.

 ఆన్‌లైన్‌పై పెరుగుతున్న విశ్వాసం...
 ‘వచ్చే రెండేళ్లలో మూడింతలు కానున్న ఆన్‌లైన్ కొనుగోలుదార్లలో 5 కోట్ల మంది ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల నుంచే జతకానున్నారు. ఈ నగరాల్లోని ఆఫ్‌లైన్ కొనుగోలుదారుల్లో(అధ్యయనంలో పాల్గొన్నవాళ్లు) 71 శాతం మంది రానున్న 12 నెలల్లో తాము ఆన్‌లైన్‌లో కొనుగోలు చేస్తామంటున్నారు. ఆన్‌లైన్ షాపింగ్ విషయంలో కస్టమర్ల విశ్వాసం పుంజుకుంటోందనడానికి ఇదే నిదర్శనం. ఈ డిసెంబర్ చివరినాటికి భారత్‌లో ఇంటర్నెట్ యూజర్ల సంఖ్య 30.2 కోట్లుగా ఉండొచ్చని అంచనా.

తద్వారా ఆన్‌లైన్ యూజర్‌బేస్ విషయంలో అమెరికాను వెనక్కినెట్టి భారత్ రెండో స్థానాన్ని ఆక్రమించనుంది’ అని గూగుల్ ఇండియా ఎండీ రాజన్ ఆనంద్ పేర్కొన్నారు. ఆన్‌లైన్ షాపింగ్‌పై విశ్వాసం, పెరుగుతున్న యూజర్లతో ఈ-కామర్స్ రంగం ఊహించని వృద్ధిని సాధించనుందన్న సంకేతాలు  న్నాయని గూగుల్ ఇండియా డెరైక్టర్‌నితిన్ బావంకులే  అన్నారు. పటిష్టమైన వృద్ధి ధోరణికి అనుగుణంగా యూజర్ల అవసరాలను తీర్చడంపై పరిశ్రమ దృష్టిపెట్టాలన్నారు.

Advertisement
Advertisement