క్యాష్‌బ్యాక్‌ ఆఫర్‌ నిబంధనలు వర్తిస్తాయ్‌... | Sakshi
Sakshi News home page

క్యాష్‌బ్యాక్‌ ఆఫర్‌ నిబంధనలు వర్తిస్తాయ్‌...

Published Mon, Dec 12 2016 1:03 AM

క్యాష్‌బ్యాక్‌ ఆఫర్‌ నిబంధనలు వర్తిస్తాయ్‌...

క్యాష్‌ బ్యాక్‌ ఆఫర్‌ ఉందేమో చూడండి
అక్కడే నిబంధనలు, పరిమితులూ ఉంటాయ్‌
ధర విషయంలో ఒకటికి మూడు సైట్లలో విచారించుకోవాలి


ఈ కామర్స్‌ కొనుగోళ్లు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. చివరికి ఉప్పు, పప్పు వంటి నిత్యావసరాలను కూడా ఇవి అమ్మేస్తున్నాయి. క్యాష్‌బ్యాక్‌ (కొన్న మొత్తం విలువలో నిర్ణీత శాతం మేర తిరిగి వెనక్కి వస్తుంది) కోసం డిస్కౌంట్‌ తదితర ఆఫర్లతో కస్టమర్లకు ఈ సంస్థలు గాలం వేస్తున్నాయి. నిజానికి ఈ ఆఫర్లు కస్టమర్లకు కూడా ఉపయోగకరమే. అయితే, ఈ ఆఫర్ల ప్రయోజనాన్ని అందుకోవాలంటే కొనుగోలు సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.  

ఉదాహరణకు అభిరామ్‌ ఎల్‌జీ 8కిలోల ఫ్రంట్‌ లోడింగ్‌ వాషింగ్‌ మెషిన్‌ కొనుగోలు చేయాలనుకున్నాడు. క్యాష్‌ బ్యాక్, తగ్గింపు వంటి ఆఫర్లు ఏవైనా ఉన్నాయేమోనని ఆన్‌లైన్‌ పోర్టల్స్‌ను పరిశీలించాడు. అమెజాన్‌ సైటులో హెచ్‌డీఎఫ్‌సీ డెబిట్‌ కార్డులపై 5 శాతం, స్టాండర్డ్‌ చార్టెడ్‌ బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డులపై 10 శాతం ఆఫర్‌ ఉందని తెలిసింది. పూర్తి వివరాలు తెలుసుకోకుండా కొనేస్తే పూర్తి ప్రయోజనం రాకపోవచ్చు. ఎందుకంటే ఇలాంటి ఆఫర్లకు పరిమితులు, నిబంధనలు ఉంటాయి. నిర్ణీత కాలపరిమితి అనేది కూడా ఉంటుంది. ఒక్కొక్క సమయంలో ఒక్కో బ్యాంకు కార్డులపై ఈ ఆఫర్లు అందుబాటులో ఉంటాయి.

క్యాష్‌ బ్యాక్‌ అంటే...?
ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులతో టైఅప్‌ అయ్యి ఆయా బ్యాంకు ఖాతాదారులు క్రెడిట్, డెబిట్‌ కార్డులు, ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌ ద్వారా చేసే కొనుగోళ్లపై ఈ కామర్స్‌ పోర్టల్స్‌ అదనపు తగ్గింపును క్యాష్‌ బ్యాక్‌ రూపంలో అందిస్తుంటాయి. ఈ క్యాష్‌ బ్యాక్‌ ఆయా కస్టమర్ల బ్యాంకు ఖాతాల్లో క్రెడిట్‌ అవుతుంది. ఉదాహరణకు అమెజాన్‌ సైట్‌లో వాషింగ్‌ మెషిన్‌ ధర రూ.20వేలు ఉందనుకోండి. ఎస్‌బీఐ డెబిట్‌/క్రెడిట్‌కార్డు దారులకు 10 క్యాష్‌ బ్యాక్‌ ఆఫర్‌ చేస్తే ఆ ఉత్పత్తి నికర కొనుగోలు విలువ రూ.18వేలు. సాధారణ తగ్గింపునకు ఈ క్యాష్‌ బ్యాక్‌ అదనం. ఇలాంటి ఆఫర్‌ ఉన్న సమయంలో ఉత్పత్తి ధర చాలా తక్కువకే వస్తుంది. కానీ, అదే సమయంలో ఇతర ఈకామర్స్‌ పోర్టల్స్‌లో అదే ఉత్పత్తి ధర ఎంతుందన్న అంశాన్ని పరిశీలించుకోవాలి.  

ఆఫర్లకు పరిమితులు
క్యాష్‌ బ్యాక్‌ ఆఫర్ల విషయంలో పరిమితులు కూడా ఉంటాయని తెలుసుకోవాలి. ఉదాహరణకు రూ.20వేల వాషింగ్‌ మెషిన్‌పై 15 శాతం క్యాష్‌ ఉందనుకోండి. ఈ లెక్కన రూ.3,000 క్యాష్‌ బ్యాక్‌ రూపంలో వెనక్కి రావాలి. కానీ అక్కడ కార్డు సంస్థ గరిష్ట క్యాష్‌ బ్యాక్‌ రూ.2,000కే పరిమితం అనే నిబంధన విధించి ఉండవచ్చు. ఇక, కనీస లావాదేవీ విలువ అంటూ మరో నిబంధన కూడా ఉంటుంది. రూ.2,000 లేదా రూ.5,000 అంతకంటే ఎక్కువ కొనుగోలు విలువ ఉండాలని షరతు విధించి ఉండవచ్చు. అలాగే, ఒక క్రెడిట్‌ కార్డుపై ఒక్కసారి జరిపే లావాదేవీకే క్యాష్‌ బ్యాక్‌ పరిమితం చేయవచ్చు.

క్యాష్‌ బ్యాక్‌లలో రకాలు
ఈ క్యాష్‌బ్యాక్‌లలో నూ రకాలు ఉ న్నాయి. ఒక విధానంలో తక్షణమే క్యాష్‌ బ్యాక్‌  ప్రయోజనం లభి స్తుం ది. అంటే అప్పటికప్పుడే ఆఫర్‌ మేర బిల్లు మొత్తంలో తగ్గింపు లభిస్తుంది. అది పోను మిగిలిన విలువమేర చెల్లిస్తే సరిపోతుంది. మరో విధానంలో కొనుగోలు తర్వాత కొన్ని రోజులకు గానీ ఆ క్యాష్‌ బ్యాక్‌ రాదు. ఇక క్యాష్‌ బ్యాక్‌ ఆఫర్‌ అప్పటికప్పుడు చెల్లింపుల ద్వారా చేసే కొనుగోళ్లకే పరిమితం కాదు. ఈఎంఐ విధానంలో కొనుగోళ్లపైనా అందుబాటులో ఉండవచ్చు. అయితే, చెల్లింపులు చేసే ముందు అక్కడున్న నిబంధనలు, మినహాయింపులు, పరిమితుల గురించి పూర్తిగా తెలుసుకోవాలి.

Advertisement
Advertisement