మన సంగీత మార్కెట్‌లోకి మరో దిగ్గజం | Sakshi
Sakshi News home page

మన సంగీత మార్కెట్‌లోకి మరో దిగ్గజం

Published Thu, Feb 28 2019 6:14 PM

Spotify Entry Into The Indian Music Streaming Market - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : భారతీయులకు సంగీతాన్ని ఆస్వాదించే సంస్కృతి అద్భుతంగా ఉండడంతో భారతీయ పాటల ప్రపంచంలోకి మరో ప్రపంచ దిగ్గజ సంస్థ ‘స్పాటిఫై’ అడుగు పెట్టింది. స్వీడన్‌ రాజధాని స్టాక్‌హోమ్‌ నగరం ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న ఈ అంతర్జాతీయ సంస్థ భారత పాటల మార్కెట్‌లోకి ప్రవేశించాలనే సంకల్పంతో సరిగ్గా 11 నెలల క్రితం ముంబైలో తన భారతీయ కార్యాలయాన్ని ఏర్పాటు చేసింది. ఈ కార్యాలయంలో మూడు వందల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. దీనికి మేనేజింగ్‌ డైరెక్టర్‌గా ఇంతకుముందు ఆన్‌లైన్‌ మార్కెట్‌ప్లేస్‌ ‘ఓఎల్‌ఎక్స్‌’కు సీఈవోగా పనిచేసిన అమర్‌సింగ్‌ బాత్రాను తీసుకున్నారు. భారతీయ మార్కెట్‌లోకి తమ ఉత్పత్తిని లాంఛనంగా ప్రవేశపెడుతున్నట్లు స్పాటిఫై వ్యవస్థాపకులు, కంపెనీ సీఈవో డేనియల్‌ ఎక్‌ బుధవారం ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు.

హిందీ, తెలుగు, తమిళ్, పంజాబీ భాషల్లో నాలుగు కోట్లకుపైగా భారతీయ పాటలు తమ వద్ద ఉన్నాయని, వాటిని ఏకంగా ‘త్రీ బిలియన్‌ ప్లే లిస్ట్స్‌’తో విడుదల చేస్తున్నామని చెప్పారు. భారతీయ వినియోగదారుడి నుంచి నెలకు 119 రూపాయల చందాకు ఎలాంటి వాణిజ్య ప్రకటనలు లేకుండా తమ పాటలు అందుబాటులోకి వస్తాయని ఆయన తెలిపారు. ఇదే అమెరికా వినియోగదారుడి దగ్గరి నుంచి నెలకు 9.99 డాలర్లు వసూలు చేస్తున్నట్లు చెప్పారు. వాస్తవానికి జనవరి చివరలోనే ‘స్పాటిఫై’ భారతీయ మార్కెట్‌లోకి రావల్సి ఉండింది. అమెరికాలోని ‘వార్నర్‌ మ్యూజిక్‌ గ్రూప్‌’కు చెందిన వార్నర్‌–ఛాపెల్‌ మ్యూజిక్‌ కంపెనీ, స్పాటిఫై లెసెన్స్‌ ఒప్పందంపై ముంబై హైకోర్టుకు వెళ్లడంతో మార్కెట్‌లోకి రావడానికి ఆలస్యమైంది.

హాలివుడ్‌ సింగర్స్‌ కేటి పెర్రీ, బెయాన్స్, కెండ్రిక్‌ లామర్, లెడ్‌ జెప్పెలిన్‌ కేటలాగ్‌ల విషయంలో రెండు కంపెనీల మధ్య వివాదం తలెత్తింది. ఈ విషయమై ఓ పక్క న్యాయ పోరాటం కొనసాగుతుండగానే ప్రపంచంలోని దాదాపు 80 దేశాల్లో 20 కోట్ల మంది వినియోగదారులకు ‘స్పాటిఫై’ తన పాటల సర్వీస్‌ను అందిస్తోంది. భారత్‌లోని అతిపెద్ద సంగీత బ్రాండ్‌ లేబుల్‌ కలిగిన టీ సీరీస్‌తో ఒప్పందం కుదుర్చుకొని 1,60,000 పాటల లైబ్రరీని సమకూర్చుకుంది. అయినప్పటికీ భారతీయ మార్కెట్‌లో ఉన్న పోటీని తట్టుకొని నిలబడడం చాలా కష్టం. 2017 లెక్కల ప్రకారం మొత్తం ఆసియాలో సంగీత మార్కెట్‌ రెవెన్యూ 38.2 శాతానికి విస్తరించగా ఒక్క భారత్‌లోనే 60.8 శాతానికి విస్తరించింది. భారత్‌లో ఇంటర్నెట్‌ విస్తృతంగా అందుబాటులోకి రావడం, డేటా చార్జీలు బాగా తగ్గడం కూడా సంగీత మార్కెట్‌ విస్తరించడానికి దోహదపడ్డాయి. 2020 నాటికి భారత సంగీత ప్రపంచంలో రెవెన్యూ 27.30 కోట్ల డాలర్లకు చేరుకుంటుందన్నది ఓ అంచనా.
 
గత ఏడాది ఫిబ్రవరి నెలలోనే అమెజాన్‌ కంపెనీ భారత సంగీత మార్కెట్‌లోకి అడుగు పెట్టింది. ఏడాది సబ్‌స్క్రిప్షన్‌ కింద కేవలం 999 రూపాయలనే వసూలు చేస్తోంది. ఇంగ్లీషు, హిందీతోపాటు పలు భారత ప్రాంతీయ భషల్లో కొన్ని కోట్ల కాటలాగ్‌లను ‘అమెజాన్‌ మ్యూజిక్‌’ అందిస్తోంది. చైనా ఇంటర్నెట్‌ దిగ్గజం ‘టెన్సెంట్‌’ భారతీయ సంగీత మార్కెట్‌లోకి ‘గానా’ పేరుతో ప్రవేశించింది. ఏకంగా 7.50 కోట్ల మంది నెల ఛందాదారులతో మార్కెట్‌లో నెంబర్‌ వన్‌గా చెలామణి అవుతోంది. రిలయెన్స్, ఏర్‌టెల్, వొడావోన్‌ కంపెనీలు భారతీయ సంగీత మార్కెట్‌లోకి ఎప్పుడో అడుగుపెట్టాయి. రిలయెన్స్‌ కంపెనీకి చెందిన ‘జియో మ్యూజిక్‌’ను గతేడాది మార్చి నెలలో అంతర్జాతీయ కంపెనీ ‘సావ్న్‌’లో వంద కోట్ల డాలర్లకు విలీనం చేసింది.

Advertisement
Advertisement