మార్కెట్‌కు మద్దతు ధర జోష్‌...   | Sakshi
Sakshi News home page

మార్కెట్‌కు మద్దతు ధర జోష్‌...  

Published Thu, Jul 5 2018 1:12 AM

STFC, NDTV tumble over 5% in early race - Sakshi

ఖరీఫ్‌ పంటలకు కేంద్రం మద్దతు ధరను పెంచడం బుధవారం స్టాక్‌ మార్కెట్‌కు జోష్‌నిచ్చింది. అంతర్జాతీయ సంకేతాలు అంతంత మాత్రంగానే ఉన్నా, ముడి చమురు ధరలు పెరిగినా కూడా...బ్యాంక్, వాహన, ఫార్మా, ఎఫ్‌ఎమ్‌సీజీ  షేర్ల జోరుతో స్టాక్‌ సూచీలు భారీ లాభాలను సాధించాయి. దేశీయ ఇన్వెస్టర్ల కొనుగోళ్లు కొనసాగుతుండటం, జూన్‌ నెల సేవల రంగం పర్చేజింగ్‌ మేనేజర్స్‌ ఇండెక్స్‌ (పీఎమ్‌ఐ) గణాంకాలు ప్రోత్సాహాకరంగా ఉండటం, బజాజ్‌ ఆటో, రిలయన్స్‌ ఇండస్ట్రీస్, హెచ్‌డీఎఫ్‌సీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ షేర్లు పెరగడం సానుకూల ప్రభావం చూపించాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 267 పాయింట్లు లాభపడి 35,645 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 70 పాయింట్ల లాభంతో 10,770 పాయింట్ల వద్ద ముగిశాయి. వాణిజ్య ఘర్షణల నేపథ్యంలో అంతర్జాతీయ సంకేతాలు అంతంత మాత్రంగానే ఉండటంతో సూచీలు చాలా వరకూ పరిమిత శ్రేణిలోనే కదలాడాయి. వ్యవసాయ రంగానికి ఊపునిచ్చేలా, 14 ఖరీఫ్‌ పంటలకు కనీస మద్దతు ధరలను ప్రభుత్వం పెంచడం ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌కు జోష్‌నిచ్చింది.  

వినియోగ షేర్లకు డిమాండ్‌.. 
సెన్సెక్స్‌ లాభాల్లోనే ఆరంభమైంది. అయితే అమ్మకాల జోరుతో నష్టాల్లోకి జారింది. 69 పాయింట్ల నష్టంతో 35,310 పాయింట్ల వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకింది. కనీస మద్దతు ధర ప్రకటనతో కొనుగోళ్లు హుషారుగా సాగాయి. 289 పాయింట్ల లాభంతో 35,667 పాయింట్ల వద్ద ఇంట్రాడే గరిష్ట స్థాయిని తాకింది. రోజంతా 355 పాయింట్ల రేంజ్‌లో కదలాడింది. ఇక నిఫ్టీ ఒక దశలో 22 పాయింట్లు నష్టపోగా, మరో దశలో 77 పాయింట్లు పెరిగింది. 

నేడు రిలయన్స్‌ 41వ ఏజీఎమ్‌
రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ 41వ ఏజీఎమ్‌ (వార్షిక సాధారణ సమావేశం) నేడు(గురువారం) జరగనున్నది. దీంతో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేర్‌ 2 శాతం లాభంతో రూ.990  వద్ద ముగిసింది.

రూపాయి17 పైసలు పతనం  
ఫారెక్స్‌ మార్కెట్లో డాలర్‌తో రూపాయి మారకం బుధవారం 17 పైసలు పతనమై 68.74 వద్ద ముగిసింది. మంగళవారం భారీగా రికవరీ అయిన రూపాయి బుధవారం చమురు ధరలు పెరగడంతో నష్టపోయింది. ఖరీఫ్‌ పంటలకు కనీస మద్దతు ధరను  పెంచడంతో ద్రవ్యోల్బణం కూడా ఎగుస్తుందనే ఆందోళనలు రూపాయిని బలహీనపడేట్లు చేశాయి. ఐపీవో మార్గంలో ఎస్‌ఎమ్‌ఈల నిధుల సమీకరణ జోరు  చిన్న, మధ్య తరహా వాణిజ్య సంస్థలు (ఎస్‌ఎమ్‌ఈ)లు ఈ ఆర్థిక సంవత్సరం మొదటి మూడు నెలల కాలంలో ఐపీవోల ద్వారా జోరుగా నిధులు సమీకరించాయి. ఎస్‌ఎమ్‌ఈలు ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌–జూన్‌ కాలానికి రూ.825 కోట్లు సమీకరించాయని పంటోమాథ్‌ అడ్వైజరీ సర్వీసెస్‌ గ్రూప్‌ వెల్లడించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలానికి ఎస్‌ఎమ్‌ఈలు సమీకరించిన నిధులు (రూ.310 కోట్లు)తో పోల్చితే ఇది దాదాపు రెండు రెట్లు అధికమని పేర్కొంది. 

Advertisement
Advertisement