34,000పైకి సెన్సెక్స్‌ | Sakshi
Sakshi News home page

34,000పైకి సెన్సెక్స్‌

Published Sat, Feb 24 2018 1:15 AM

stockmarket over 34000 - Sakshi

సానుకూల అంతర్జాతీయ సంకేతాలకు దేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల జోరు జత కావడంతో శుక్రవారం స్టాక్‌ మార్కెట్‌ లాభపడింది. బీఎస్‌ఈ సెన్సెక్స్‌  కీలకమైన 34వేల పాయింట్లపైకి ఎగబాకగా. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ కీలకమైన 10,500 పాయింట్ల మైలురాయికి చేరువయ్యింది. అన్ని రంగాల షేర్లలో వేల్యూ బయింగ్‌ చోటు చేసుకోవడంతో మార్చి డెరివేటివ్స్‌ సిరీస్‌ శుభారంభం చేసింది. సెన్సెక్స్‌ 323 పాయింట్లు లాభపడి 34,142 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 108 పాయింట్లు పెరిగి 10,491 పాయింట్ల వద్ద ముగిశాయి.

స్టాక్‌ సూచీలు రెండూ ఒక శాతం మేర ఎగిశాయి. ఈ వారం  నష్టాలన్నింటిని పూడ్చుకున్న సెన్సెక్స్‌ వారం గరిష్ట స్థాయికి ఎగసింది. బీఎస్‌ఈ సూచీలన్నీ లాభాల్లోనే ముగిశాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 348 పాయింట్ల వరకూ లాభపడింది. ఫెడరల్‌ రిజర్వ్‌ రేట్ల పెంపుపై ఊరటనిచ్చేలా ఫెడరల్‌ రిజర్వ్‌ ఉన్నతాధికారొకరు వ్యాఖ్యానించడం, ఇటీవల వరకూ పెరుగుతూ వచ్చిన అమెరికా బాండ్‌ ఈల్డ్స్‌ దిగిరావడంతో ఆసియా మార్కెట్లు లాభపడ్డాయి. ఇంట్రాడేలో రూపాయి పుంజుకోవడం, లోహ, ఫార్మా, బ్యాంక్, ఆర్థిక రంగ షేర్లలో జోరుగా కొనుగోళ్లు జరగడం సానుకూల ప్రభావం చూపించాయి.  

ఐదు సెన్సెక్స్‌ షేర్లకే నష్టాలు: 31 సెన్సెక్స్‌ షేర్లలో ఐదు షేర్లు– హిందుస్తాన్‌ యూనిలివర్, మహీంద్రా అండ్‌ మహీంద్రా, ఇన్ఫోసిస్, కోల్‌ ఇండియా, ఏషియన్‌ పెయింట్స్‌ మాత్రమే నష్టపోయాయి. టాటా స్టీల్, సన్‌ ఫార్మా, యెస్‌ బ్యాంక్, భారతీ ఎయిర్‌టెల్, ఓఎన్‌జీసీ, డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్స్, ఎన్‌టీపీసీ, ఎస్‌బీఐ, యాక్సిస్‌ బ్యాంక్, టీసీఎస్, ఆర్‌ఐఎల్‌ షేర్లు లాభపడ్డాయి.  

ఆల్‌టైమ్‌ హైకి అవెన్యూ సూపర్‌ మార్ట్స్‌
డి–మార్ట్‌ రిటైల్‌ చెయిన్‌ను నిర్వహిస్తున్న అవెన్యూ సూపర్‌ మార్ట్స్‌ షేర్‌ 5% లాభంతో రూ.1,300 వద్ద ముగిసింది. ఈ షేర్‌ టార్గెట్‌ ధరను అంతర్జాతీయ బ్రోకరేజ్‌ సంస్థ గోల్డ్‌మన్‌ శాక్స్‌ రూ.1,672కు పెంచడంతో ఈ షేర్‌ ఇంట్రాడేలో ఆల్‌టైమ్‌ హై రూ.1,306ను తాకింది. ఈ షేర్‌తో పాటు వెంకీస్‌ ఇండియా,  బ్రిటానియా ఇండస్ట్రీస్, మైండ్‌ట్రీ తదితర షేర్లు కూడా ఇంట్రాడేలో ఆల్‌టైమ్‌ హైని తాకాయి.  

Advertisement
Advertisement