Sakshi News home page

స్టాక్స్ వ్యూ

Published Mon, Sep 14 2015 1:23 AM

Stocks Overview

వర్ల్‌పూల్ ఇండియా
కొనొచ్చు

బ్రోకరేజ్ సంస్థ: ఫస్ట్‌కాల్ రీసెర్చ్
ప్రస్తుత ధర: రూ.616     
టార్గెట్ ధర: రూ.732
ఎందుకంటే: ఫ్రిజ్, వాషింగ్ మెషీన్లు, తదితర ప్రదాన గృహోపకరణాలను తయారు చేసి, మార్కెట్ చేస్తోంది. గుర్గావ్ కేంద్రంంగా కార్యకలాపాలు నిర్వహిస్తోంది. 1980లో భారత్‌లోకి ప్రవేశించిన వర్ల్‌పూల్ 1995లో కెల్వినేటర్ ఇండియాను కొనుగోలు చేయడం ద్వారా రిఫ్రిజిరేటర్ మార్కెట్లోకి అడుగిడింది. మైక్రోవేవ్ ఓవెన్‌లు, ఏసీ, వాటర్ ప్యూరిఫయర్స్, బిల్టిన్ అప్లయెన్సెస్, ఇతర ఉత్పత్తులకు విస్తరించింది. ఫరీదాబాద్,పాండిచ్చేరి, పుణేల్లో ప్లాంట్లున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసిక కాలంలో నికర లాభం 18 శాతం వృద్ధితో రూ.98 కోట్లకు, నికర అమ్మకాలు 5 శాతం వృద్ధితో రూ.1,100 కోట్లకు పెరిగాయి.

నిర్వహణ లాభం 17 శాతం వృద్ధితో రూ.162 కోట్లకు, స్థూల లాభం 18 శాతం పెరుగుదలతో రూ.146 కోట్లకు చేరాయి.  షేర్‌వారీ ఆర్జన(ఈపీఎస్) 18 శాతం వృద్ధితో రూ.8కు పెరిగింది. ఇదే జోరు మరికొన్ని క్వార్టర్లు కొనసాగవచ్చు. ఈపీఎస్ ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.20, వచ్చే ఆర్థిక సంవత్సరంలో రూ.22కు పెరుగుతుందని భావిస్తున్నాం రెండేళ్లలో నికర అమ్మకాలు 13 శాతం, నికర లాభం 31 శాతం చొప్పున చక్రగతిన వృద్ధి సాధిస్తాయని అంచనా.. మరో మూడేళ్ల పాటు కంపెనీ మిగులు కొనసాగవచ్చు. గృహోపకరణాల వినియోగం పట్టణాల్లోనే కాకుండా గ్రామాల్లో కూడా పెరుగుతోంది. ఈ కంపెనీ టైర్ 2, టైర్ 3 నగరాలకు కూడా విస్తరిస్తోంది. పుుస్తక ధరకు, మార్కెట్ ధరకు మధ్య నిష్పత్తి ఈ ఆర్థిక సంవత్సరంలో 7.74గానూ, వచ్చే ఆర్థిక సంవత్సరంలో 6.79గానూ ఉండొచ్చని అంచనా. మధ్య కాలం నుంచి దీర్ఘకాలానికి రూ.732 టార్గెట్ ధరగా ప్రస్తుత ధరలో ఈ షేర్‌ను కొనుగోలు చేయవచ్చు.
 
ఐషర్ మోటార్స్
కొనొచ్చు

బ్రోకరేజ్ సంస్థ: రెలిగేర్
ప్రస్తుత ధర: రూ.18,892    
టార్గెట్ ధర: రూ.22,500  
ఎందుకంటే: భారత ప్రీమియమ్ బైక్ మార్కెట్లో ఐషర్ మోటార్స్ కంపెనీకి చెందిన రాయల్ ఎన్‌ఫీల్డ్(ఆర్‌ఈ) బ్రాండ్ మార్కెట్ వాటా 96 శాతంగా ఉంది. ఈ బైక్‌ల అమ్మకాలు మరో మూడేళ్లలో 33 శాతం చొప్పున చక్రగతిన వృద్ధి సాధిస్తాయని అంచనా.  పోటీ తక్కువగా ఉండడం, పటిష్టమైన స్థితిలో బ్రాండ్ ఉండడం, కొత్త మోడళ్లు అందుబాటులోకి తేవడం, నెట్‌వర్క్ విస్తరణ, మార్కెట్ అగ్రస్థానం వంటి అంశాలు దీనికి దోహదపడతాయి.  బుల్లెట్, క్లాసిక్, థండర్‌బర్డ్, కాంటినెంటల్ జీటీలతో మంచి అమ్మకాలు సాధిస్తోంది. రెండేళ్లుగా అమ్మకాల్లేక కుదేలవుతున్న వాణిజ్య వాహనాల(సీవీ) మార్కెట్ ఇప్పుడిప్పుడే  పుంజుకోవడం, కొత్త వాహ నాలను అందుబాటులోకి తీసుకురానుండడం వంటి కారణాల వల్ల  వాణిజ్య వాహనాల విక్రయాలు మూడేళ్లలో 19 శాతం చొప్పున చక్రగతిన వృద్ధి సాధిస్తాయని భావిస్తున్నాం.

ఆర్‌ఈ అమ్మకాలు పుంజుకోవడం, సీవీ మార్జిన్లు అధికంగా ఉండడం వంటి కారణాల వల్ల మూడేళ్లలో  కంపెనీ ఆదాయం 30 శాతం, నికర లాభం 50 శాతం చొప్పున పెరుగుతాయని అంచనా. ఈ ఏడాది ఆగస్టు వరకూ ఈ కంపెనీ షేర్ ధర 77 శాతం పెరిగింది. గత నెలలో 20 శాతం తగ్గినప్పటికీ, ఏడాది కాలంలో 50 శాతం వరకూ పెరిగినట్లు లెక్క. గరిష్ట స్థాయి నుంచి చూస్తే 20 శాతం తగ్గి ప్రస్తుతం ఆకర్షణీయ ధరలో లభ్యమవుతోందని భావిస్తున్నాం. ఎలాంటి రుణ భారం లేని కంపెనీ. ఐదేళ్లలో షేర్ ధర రెట్టింపు అవుతుందని భావిస్తున్నాం.

గమనిక: ఈ కాలమ్‌లో షేర్లపై ఇచ్చిన సలహాలు, సూచనలు, వివిధ బ్రోకరేజి సంస్థలు వ్యక్తం చేసిన అభిప్రాయాలు మాత్రమే.

Advertisement

తప్పక చదవండి

Advertisement