స్టాక్స్‌ వ్యూ | Sakshi
Sakshi News home page

స్టాక్స్‌ వ్యూ

Published Mon, Mar 6 2017 12:53 AM

స్టాక్స్‌ వ్యూ

అంబుజా సిమెంట్‌
బ్రోకరేజ్‌ సంస్థ: మోతిలాల్‌ ఓస్వాల్‌
ప్రస్తుత ధర: రూ.226    టార్గెట్‌ ధర: రూ.277

ఎందుకంటే:  హోల్సిమ్‌ గ్రూప్‌కు చెందిన ఈ కంపెనీ భారత్‌లో మూడో అతి పెద్ద సిమెంట్‌ కంపెని. సిమెంట్‌ను తక్కువ వ్యయంతో ఉత్పత్తి చేస్తున్న కొన్ని కంపెనీల్లో ఇదొక్కటి. భారత్‌ నుంచి అత్యధికంగా సిమెంట్‌ను ఎగుమతి చేస్తున్న కంపెనీ కూడా ఇదే. సిమెంట్‌కు డిమాండ్‌  బాగా ఉన్న ఉత్తర, తూర్పు, పశ్చిమ భారత ప్రాంతాల్లో ప్రధానంగా దృష్టి కేంద్రీకరిస్తోంది. ఈ కంపెనీ గత ఏడాది డిసెంబర్‌ క్వార్టర్‌ ఆర్థిక ఫలితాలు మిశ్రమంగా ఉన్నప్పటికీ, భవిష్యత్‌ వృద్ధి దృష్ట్యా ఈ షేరు కొనుగోలుకు అనువైనదని భావిస్తున్నాం. డిసెంబర్‌ త్రైమాసికంలో కంపెనీ ఆదాయం 7 శాతం తగ్గి రూ.2,190 కోట్లకు చేరింది. పెద్ద కరెన్సీ నోట్ల రద్దు కారణంగా అమ్మకాలు 7 శాతం తగ్గాయి. ఇబిటా 3 శాతం తగ్గి(క్వార్టర్‌ ఆన్‌ క్వార్టర్‌ ప్రాతిపదికన 7 శాతం వృద్ధితో) రూ.290 కోట్లకు చేరింది. దీంతో మార్జిన్‌ 13 శాతంగా నమోదైంది.  నికర లాభం 28 శాతం వృద్ధితో (క్వార్టర్‌ ఆన్‌ క్వార్టర్‌ ప్రాతిపదికన 37 శాతం క్షీణించి) రూ.176 కోట్లకు చేరింది. ఇంధన వ్యయాలు క్వార్టర్‌ ఆన్‌ క్వార్టర్‌ ప్రాతిపదికన 15 శాతం తగ్గాయి. అలాగే రవాణా వ్యయాలు క్వార్టర్‌ ఆన్‌ క్వార్టర్‌ ప్రాతిపదికన 3 శాతం తగ్గాయి. 2015–17 సంవత్సరాల్లో అమ్మకాలు 4 శాతం చొప్పున చక్రగతిన వృద్ధి సాధించాయి. త్వరలో ఉత్తర భారత ప్రాంతంలో ధరలు పెంచనున్నది.
ఉత్తర, తూర్పు ప్రాంతాల్లో మంచి వృద్ధి సాధించే అవకాశాలున్నాయి. నిర్వహణ సమర్థవంతంగా ఉండడం, ఇంధనం, రవాణాకు సంబంధించి వ్యయ నియంత్రణ పద్ధతులు పటిష్టంగా ఉండడం, రూ.2,000 కోట్ల నికర నగదు  నిల్వలు, 45–50 శాతం రేంజ్‌లో డివిడెండ్‌లు చెల్లించడం, మరో దిగ్గజ సిమెంట్‌ కంపెనీ ఏసీసీని విలీనం చేసుకునే అవకాశం ఉండడం.. ఇవన్నీ సానుకూలాంశాలు.

స్పైస్‌జెట్‌
బ్రోకరేజ్‌ సంస్థ: ఎడిల్‌వేజ్‌
ప్రస్తుత ధర: రూ.74    టార్గెట్‌  ధర: రూ.99

ఎందుకంటే: దేశీయ చౌక విమానయాన సంస్థల్లో అగ్రగామి కంపెనీ ఇది. ప్రస్తుతం ఆర్థిక పునర్వ్యస్థీకరణ దశలో ఉంది. తాజాగా పెట్టుబడులు సమీకరిస్తోంది. లీజుకు తీసుకున్న 17 బీ737–800 విమానాలతో సర్వీసులను నిర్వహిస్తోంది. దేశీయ మార్కెట్లో 10 శాతం మార్కెట్‌ వాటా ఈ కంపెనీదే. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో ఆదాయం 12% వృద్ధితో రూ.1,640 కోట్లకు పెరిగింది. నికర లాభం 41% తగ్గి రూ.140 కోట్లకు పడిపోయింది. కెపాసిటీ 27 శాతం పెరిగినప్పటికీ, గత ఆర్థిక సంవత్సరం క్యూ3లో 91.2 శాతంగా ఉన్న సీట్‌ లోడ్‌ ఫ్యాక్టర్‌ ఈ క్యూ3లో 90.7 శాతానికి తగ్గింది. ఇతర వ్యయాలు 4 శాతం తగ్గాయి. అయితే ఇంధన వ్యయాలు మాత్రం 2 శాతం పెరిగాయి. దీంతో ఇబిటాఆర్‌ (ఎర్నింగ్స్‌ బిఫోర్‌ ఇంటరెస్ట్, ట్యాక్సెస్, డిప్రిసియేషన్, అమోర్టైజేషన్‌ అండ్‌ రిస్ట్రక్చరింగ్‌(రెంట్‌)వ్యయాలు) స్వల్పంగా తగ్గి 25.4 శాతానికి చేరాయి. ఈ ఏడాది జనవరిలో 205 విమానాల డెలివరీకి సంబంధించి బోయింగ్‌ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ డీల్‌ విలువ 2,200 కోట్ల డాలర్లు. భారత్‌లో ఇదే అతి పెద్ద వాణిజ్య వైమానిక ఒప్పందం. ఈ 205 విమానాల్లో 155 విమానాలు బోయింగ్‌ 737–8 మ్యాక్స్‌ మోడల్‌వి. ఈ మ్యాక్స్‌ విమానాల వల్ల ఇంధన వ్యయాలు 20 శాతం తగ్గుతాయని కంపెనీ అంచనా వేస్తోంది.  రెండేళ్లలో ఇబిటా 17 శాతం, నికర లాభం 21 శాతం చొప్పున చక్రగతిన వృద్ధి సాధిస్తాయని అంచనా.  విమానయాన ఇంధనం ధరలు పెరిగితే అది ప్రతికూల ప్రభావం చూపుతుంది. మొత్తం నిర్వహణ వ్యయాల్లో 40 శాతం వరకూ ఈ ఇంధన వ్యయాలే ఉంటాయి. ఆర్థిక వృద్ధి మందగిస్తే, కార్పొరేట్, లీజర్‌ ట్రావెల్‌ డిమాండ్‌  తగ్గుతుంది. ఫలితంగా లోడ్‌ ఫ్యాక్టర్‌ తగ్గి లాభదాయకత క్షీణిస్తుంది. ప్రభుత్వ నియమనిబంధనల్లో అనిశ్చితి, డాలర్‌తో రూపాయి మారకంలో ఒడిదుడుకులు.. ఇవన్నీ ప్రతికూలాంశాలు.

Advertisement

తప్పక చదవండి

Advertisement