స్టాక్స్‌ వ్యూ | Sakshi
Sakshi News home page

స్టాక్స్‌ వ్యూ

Published Mon, Aug 21 2017 12:41 AM

స్టాక్స్‌ వ్యూ

డిష్‌ టీవీ
బ్రోకరేజ్‌ సంస్థ: మోతిలాల్‌ ఓస్వాల్‌
ప్రస్తుత ధర: రూ.78         టార్గెట్‌ ధర: రూ.106


ఎందుకంటే: ఎస్సెల్‌ గ్రూప్‌కు చెందిన ఈ కంపెనీ డైరెక్ట్‌ టు హోమ్‌(డీటీహెచ్‌) రంగంలో అగ్రస్థానంలో ఉంది. ఈ కంపెనీ ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక ఆర్థిక ఫలితాలు పుంజుకున్నాయి. నిర్వహణ ఆదాయం 4 శాతం వృద్ధితో రూ.740 కోట్లకు పెరిగింది. ఒక్కో చందాదారుడి నుంచి వచ్చే సగటు రాబడి(ఏఆర్‌పీయూ) 10 శాతం వృద్ధితో రూ.148కు చేరడంతో పాటు   నికర చందాదారుల సంఖ్య పెరుగుతుండటంతో  సబ్‌స్క్రిప్షన్‌ ఆదాయం 11 శాతం వృద్ధితో రూ.692 కోట్లకు పెరిగింది.

 క్వార్టర్‌ ఆన్‌ క్వార్టర్‌ ప్రాతిపదికన ఇబిటా 7 శాతం వృద్ధితో రూ.201 కోట్లకు, ఇబిటా మార్జిన్‌ 35 బేసిస్‌ పాయింట్లు వృద్ధి చెంది  27 శాతానికి పెరిగాయి. కంటెంట్‌ సంబంధిత వ్యయాలు, మార్కెటింగ్‌ ఖర్చులు పెరగడంతో ఇబిటా మార్జిన్‌ అంచనాల కంటే తక్కువగానే వచ్చింది. మొత్తం మీద నికర నష్టాలు ఈ క్యూ1లో రూ.14 కోట్లకు తగ్గాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో పది లక్షల మంది కొత్త చందాదారులు లభిస్తారని కంపెనీ అంచనా వేస్తోంది. దీంతో ఏఆర్‌పీయూ మెరుగపడి ఆదాయం 7–8శాతం రేంజ్‌లో పెరగగలదని కంపెనీ భావిస్తోంది.

అలాగే ఇబిటా మార్జిన్‌ 29–31 శాతం రేంజ్‌లో ఉండొచ్చని కంపెనీ అంచనా. ఈ ఏడాది అక్టోబర్‌ నాటికి వీడియోకాన్‌ డీ2హెచ్‌ విలీనం పూర్తి కానున్నది. ఈ విలీనం వల్ల ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.180 కోట్లు, వచ్చే ఆర్థిక సంవత్సరంలో రూ.510 కోట్ల మేర డిష్‌ టీవీకి ప్రయోజనం కలుగనున్నది. త్వరలో హైబ్రిడ్‌ సెట్‌–టాప్‌ బాక్స్‌(ఈ సెట్‌–టాప్‌ బాక్స్‌ ద్వారా డిజిటల్‌ కేబుల్‌ ప్రోగ్రామ్‌లను, ఇంటర్నెట్, లోకల్‌ ఐపీ నెట్‌వర్క్‌ అందించే వీడియోలను చూడొచ్చు)ను అందించనున్నది. అంతేకాకుండా కొత్త తరహాలో ఓటీటీ(ఓవర్‌ ద టాప్‌) సేవలను కూడా అందించనున్నది.

రిలయన్స్‌ క్యాపిటల్‌
బ్రోకరేజ్‌ సంస్థ: ఐసీఐసీఐ డైరెక్ట్‌
ప్రస్తుత ధర: రూ.783        టార్గెట్‌ ధర: రూ.905


ఎందుకంటే: ఈ కంపెనీ కార్యకలాపాలు నిర్వహిస్తున్న విభిన్న విభాగాలు మంచి పనితీరును సాధిస్తుండటంతో ఆయా విభాగాల ఆర్‌ఓఈ(రిటర్న్‌ ఆన్‌ ఈక్విటీ)లే కాకుండా కంపెనీ లాభం కూడా మెరుగుపడనున్నది. ఐపీఓ ద్వారా వాటా విక్రయం, కీలకం కాని ఆస్తుల అమ్మకం ద్వారా కంపెనీకి ఈ ఆర్థిక సంవత్సరంలో మూల ధన లాభాలు, నెట్‌వర్త్‌  పెరగనున్నాయి. రుణ భారం తగ్గనున్నది. పెద్ద కరెన్సీ నోట్ల రద్దు, స్టాక్‌ మార్కెట్‌ జోరుగా ఉండటంతో పొదుపులు పెరిగి కంపెనీ మ్యూచువల్‌ ఫండ్‌ వ్యాపారం... రిలయన్స్‌  ఏఎంసీ బాగా పుంజుకుంది.

ఈ వ్యాపార విభాగం మొత్తం నిర్వహణ ఆస్తులు 20 శాతం వృద్ధితో రూ.3,62,500 కోట్లకు పెరిగాయి. రెండేళ్లలో ఈ ఆస్తులు 16 శాతం చొప్పున చక్రగతిన వృద్ధి సాధిస్తాయని అంచనా. ఈ విభాగం ఆర్‌ఈఓ 25 శాతంగా ఉంది. ఈ ఆర్థిక సంవత్సరంలోనే రిలయన్స్‌ ఏఎంసీ ఐపీఓ(ఇనీషియల్‌ పబ్లిక్‌ ఆఫర్‌)కు రానున్నది. కమర్షియల్‌ ఫైనాన్స్, హోమ్‌ ఫైనాన్స్‌ విభాగాల వృద్ధి కూడా పుంజుకున్నది. హౌసింగ్‌ ఫైనాన్స్‌ విభాగాన్ని ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికం కల్లా స్టాక్‌ మార్కెట్లో కంపెనీ లిస్ట్‌ చేయనున్నది.


జీవిత బీమా వ్యాపార విభాగం బలహీనంగా ఉన్నప్పటికీ, సాధారణ బీమా వ్యాపార విభాగం మాత్రం మంచి పనితీరు కనబరుస్తోంది. సాధారణ బీమా వ్యాపార విభాగం 41 శాతం వృద్ధి చెందింది.  రెండేళ్లలో కంపెనీ కన్సాలిడేటెడ్‌ నికర లాభం 15% చొప్పున చక్రగతి వృద్ధితో రూ.1,426 కోట్లకు చేరవచ్చని భావిస్తున్నాం. అలాగే ఆదాయం 9% చక్రగతి వృద్ధితో రూ.20,990కోట్లకు, పెరుగుతుందని అంచనా. రెండేళ్లలో కంపెనీ రిటర్న్‌ ఆన్‌ ఈక్విటీ 7–9 శాతం రేంజ్‌లో ఉండొచ్చు. ఈ మూలధన లాభాలను కూడా కలుపుకుంటే ఆర్‌ఓఈ 12 శాతంగా ఉండొచ్చు.

Advertisement
Advertisement