ఫ్రెషర్ల జీతాలు పెరగకుండా ఐటీ సంస్థల కుమ్మక్కు | Sakshi
Sakshi News home page

ఫ్రెషర్ల జీతాలు పెరగకుండా ఐటీ సంస్థల కుమ్మక్కు

Published Wed, Feb 22 2017 12:47 AM

ఫ్రెషర్ల జీతాలు పెరగకుండా ఐటీ సంస్థల కుమ్మక్కు

ఇన్ఫీ మాజీ సీఎఫ్‌వో మోహన్‌దాస్‌ పాయ్‌
హైదరాబాద్‌: సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్లు కుప్పతెప్పలుగా అందుబాటులో ఉండటాన్ని దేశీయంగా పెద్ద ఐటీ కంపెనీలు అలుసుగా తీసుకుంటున్నాయని ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌ మాజీ సీఎఫ్‌వో మోహన్‌దాస్‌ పాయ్‌ ఆరోపించారు. ఆయా సంస్థలు కుమ్మక్కై గత 7–8 ఏళ్లుగా ఫ్రెషర్స్‌ జీతాలు తక్కువ స్థాయిలోనే ఉంచుతున్నాయని వ్యాఖ్యానించారు.  ‘దేశీ ఐటీ పరిశ్రమలో సమస్య ఇదే. భారతీయ ఐటీ రంగం ఫ్రెషర్స్‌కి సరైన జీతాలు ఇవ్వడం లేదు. వారి జీతాలు పెరగనివ్వకుండా పెద్ద పెద్ద కంపెనీలన్నీ కూడబలుక్కుని వ్యవహరిస్తున్నాయి‘ అని ఆయన వ్యాఖ్యానించారు.

ఇలా సర్వీస్‌ కంపెనీలు కుమ్మక్కు కావడం భారతీయ ఐటీ పరిశ్రమకు మంచిది కాదని పాయ్‌ పేర్కొన్నారు. మెరుగైన జీతభత్యాలు ఇవ్వకపోతే .. ప్రతిభగల ఫ్రెషర్స్‌ చేరేందుకు ముందుకు రారని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ఐటీ సేవల సంస్థల్లో చేరుతున్నవారిలో మెజారిటీ భాగం ద్వితీయ శ్రేణి కాలేజీల నుంచి వస్తున్నప్పటికీ .. నైపుణ్యాలున్న వారేనని పాయ్‌ చెప్పారు. అయితే, ప్రథమ శ్రేణి కాలేజీల నుంచి కూడా ఇంజనీర్లు రావాల్సిన అవసరం ఉందన్నారు. గణాంకాల ప్రకారం ఫ్రెషర్స్‌కి రెండు దశాబ్దాల క్రితం వార్షికంగా రూ.2.25 లక్షల ప్యాకేజీ ఉండగా.. ప్రస్తుతం కేవలం రూ. 3.5 లక్షలకు మాత్రమే పెరిగింది. ఈ నేపథ్యంలో పాయ్‌ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

Advertisement
Advertisement