బంగారంలో ఇన్వెస్ట్ చేద్దామా? | Sakshi
Sakshi News home page

బంగారంలో ఇన్వెస్ట్ చేద్దామా?

Published Sun, Sep 28 2014 2:12 AM

బంగారంలో ఇన్వెస్ట్ చేద్దామా?

బంగారం ధరలు దిగొస్తున్నాయి. దేశీయంగా బంగారం ధరలు ఏడాదిన్నర కనిష్టానికి చేరాయి. అదే గరిష్ట స్థాయి నుంచి చూస్తే పది గ్రాముల బంగారం ధర సుమారు రూ. 8,000 తగ్గింది. ఇటువంటి తరుణంలో బంగారంలో ఇన్వెస్ట్ చేయొచ్చా లేక మరికొంత కాలం వేచి చూడొచ్చా అన్న దానిపై ఐడీబీఐ మ్యూచువల్ ఫండ్ వైస్ ప్రెసిడెంట్, గోల్డ్ ఫండ్ మేనేజర్ వి.బాల సుబ్రమణ్యన్

అభిప్రాయాలు మీ కోసం...
దీర్ఘకాలంలో లాభాలు అందించిన బంగారం గత మూడేళ్ల నుంచి దిద్దుబాటు ధోరణిలో ఉంది. ప్రస్తుతం దేశీయ మార్కెట్లో పది గ్రాముల బంగారం ధర రూ. 26,000 పైన కదులుతోంది. ఏదైనా షేరు కానీ, కమోడిటీ కానీ ఇలా సుదీర్ఘకాలం లాభాలు అందించిన తర్వాత కొంత తగ్గి, పరిమిత శ్రేణిలో కదలాడటం అత్యంత సహజం. బంగారంలో ఇప్పుడదే జరుగుతోంది. బంగారం ధరలపై అంతర్జాతీయంగా అనేక అంశాలు ప్రభావం చూపుతాయి కాబట్టి వీటి కదలికలను అంచనా వేయడం అత్యంత కష్టం. డాలరు ఇండెక్స్ 85కి చేరడం, అంతర్జాతీయంగా లిక్విడిటీ తగ్గడం, ఇతర కరెన్సీలు బలపడటం తదితర అంశాలన్నీ కమోడిటీ ధరలను తగ్గించేవే. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటే ఇప్పటికిప్పుడే బంగారం ధరలు పైకి పెరిగే అవకాశాలు కనిపించడం లేదు. మరి కొంత కాలం ఇదే శ్రేణిలో కదులుతుందని అంచనా వేస్తున్నాం. అంతర్జాతీయంగా బంగారం ధరలు 50-100 డాలర్ల శ్రేణిలో అటూఇటూ కదులుతుంటాయని అంచనా వేస్తున్నాం.
 
ఇన్వెస్ట్‌మెంట్‌కి బీమా
బంగారాన్ని ఒక పెట్టుబడి సాధనంగా చూడకూడదు. ఇది కేవలం మీ పెట్టుబడులకు రక్షణ కల్పించే బీమా పథకంగానే చూడాలి. ప్రపంచంలో అశాంతి నెల కొన్నా, యుద్ధాలు వచ్చినా, మరి ఏదైనా సంక్షోభం వచ్చినా బంగారం ధరలు పరుగులు పెడతాయి. కాబట్టి ప్రతీ ఒక్కరు వారి రిస్క్ సామర్థ్యానికి అనుగుణంగా ఇన్వెస్ట్‌మెంట్ మొత్తం విలువలో గరిష్టంగా 15 శాతం దాటకుండా బంగారంలో ఇన్వెస్ట్ చేయొచ్చు. తక్షణం బంగారం ధరలు పెరిగే అవకాశం లేకపోయినా ఇప్పటి వరకు ఇన్వెస్ట్ చేయని వాళ్లు మూడు నుంచి నాలుగేళ్ల దృష్టితో ప్రస్తుత ధరలో కొద్దికొద్దిగా ఇన్వెస్ట్ చేయొచ్చు.అమెరికా వడ్డీరేట్లు పెంచితే డాలరు విలువ పెరుగుతుంది. డాలరు విలువ పెరిగితే అంతర్జాతీయంగా బంగారం ధరలు మరింత దిగే అవకాశం ఉంటుంది. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుంటే తక్షణం బంగారం ధరలు పెరిగే అవకాశాలు కనిపించడం లేదు.

Advertisement
Advertisement