ఇప్పుడు... ఇదే బెటర్‌ | Sakshi
Sakshi News home page

ఇప్పుడు... ఇదే బెటర్‌

Published Mon, Jan 22 2018 12:10 AM

Tata Equity Pe - Sakshi

మార్కెట్లలో ఏడాదికి పైగా బలమైన ర్యాలీ తర్వాత ఇప్పుడు పెట్టుబడుల విషయంలో కాస్త జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. కాకపోతే ఈ సమయంలోనూ పెట్టుబడులకు అనువైన మ్యూచువల్‌ ఫండ్‌ పథకాలున్నాయి. అందులో టాటా ఈక్విటీ పీఈ ఫండ్‌ ఒకటని చెప్పొచ్చు.

ఎందుకంటే ఇది డైవర్సిఫైడ్‌ ఈక్విటీ ఫండ్‌. స్టాక్స్‌ను ఎంచుకునే విషయంలో జాగ్రత్తగా, ఆచితూచి వ్యవహరిస్తుంది. సెన్సెక్స్‌తో పోలిస్తే తక్కువ విలువల వద్దే లభిస్తున్న షేర్లలో 70 శాతం నిధుల్ని ఈ పథకం ఇన్వెస్ట్‌ చేస్తుంది. దీంతో మార్కెట్లు అధిక విలువలకు చేరి కరెక్షన్‌ రిస్క్‌ ఉన్న తరుణంలో ఈ ఫండ్‌ పెట్టుబడుల తీరు ఒకింత రిస్క్‌ తగ్గించేదే అని చెప్పుకోవచ్చు.

ఇది మల్టీ క్యాప్‌ ఫండ్‌...
టాటా ఈక్విటీ పీఈ ఫండ్‌ అన్నది మల్టీక్యాప్‌ కిందకు వస్తుంది. మిడ్, స్మాల్‌ క్యాప్‌ స్టాక్స్‌ ఎక్కువ లాభాలను ఇచ్చేందుకు అనువుగా ఉన్నాయనుకుంటే ఆ సమయంలో వాటికి 40–50 శాతం నిధులను కేటాయిస్తుంది. 2014 సమయంలో ఇదే చేసింది. 2015, 2016లో మార్కెట్లు అస్థిరతలకు గురైన సమయంలో మిడ్, స్మాల్‌ క్యాప్‌ స్టాక్స్‌లో పెట్టుబడులను తగ్గించుకుంది. దీంతో ఈ పథకం ఫ్లెక్సీ క్యాప్‌ విధానంలో పనిచేస్తుందని చెప్పుకోవాల్సి ఉంటుంది.

గడిచిన ఏడాదిగా మార్కెట్లు అంతకంతకూ పెరుగుతూ వెళుతుండడం, మిడ్, స్లామ్స్‌ క్యాప్‌ స్టాక్స్‌ ధరలు అనూహ్యంగా పెరిగిపోతున్న దృష్ట్యా ఈ పథకం లార్జ్‌ క్యాప్‌ స్టాక్స్‌కు ప్రాధాన్యం పెంచింది. 2017 ప్రారంభంలో మిడ్, స్మాల్‌ క్యాప్‌ స్టాక్స్‌ కోసం 31 శాతం కేటాయించగా... ఇపుడు ఆ కేటాయింపును 13 శాతానికి పరిమితం చేసింది. అలాగే, మార్కెట్లలో అనిశ్చితి పెరిగిందని సంకేతాలు కనిపిస్తే ముందు చూపుతో నగదు నిల్వలు పెంచుకోవడంతోపాటు, డెట్‌ విభాగానికి కూడా తగినంత కేటాయింపులు చేస్తుంది.

ఏడాది, మూడేళ్లు, ఐదేళ్ల కాలంలో ఈ పథకం పనితీరును పరిశీలిస్తే బెంచ్‌ మార్క్‌ పనితీరు కంటే 10 శాతం ఎక్కువే రాబడులను ఇచ్చింది. ఇతర మల్టీక్యాప్‌ ఫండ్స్‌ అయిన ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ వేల్యూ డిస్కవరీ, ఎస్‌బీఐ మ్యాగ్నమ్‌ మల్టీ క్యాప్, ఫ్రాంక్లిన్‌ ఫ్లెక్సీ క్యాప్‌ పథకాలకు మించి మెరుగైన పనితీరును టాటా ఈక్విటీ పీఈ ఫండ్‌ చూపించింది.

పోర్ట్‌ఫోలియోలో ఆటోకే ప్రాధాన్యం...
సాఫ్ట్‌వేర్‌ రంగం ఎదుర్కొంటున్న ప్రతికూలతలు, బలమైన రూపాయి నేపథ్యంలో ఈ రంగానికి కేటాయింపులను తగ్గించేసింది. డిసెంబర్‌ నాటి పోర్ట్‌ఫోలియోను గమనిస్తే ప్రధానంగా ఆటో, ఆటో యాన్సిలరీ విభాగానికి 18.4 శాతం నిధుల్ని కేటాయించింది.

మారుతి సుజుకి, సియట్‌ విలువలు ఇటీవలి కాలంలో గణనీయంగా పెరగడంతో పెట్టుబడులను తగ్గించుకుంది. తక్కువ విలువల వద్ద లభిస్తున్న ఎంఅండ్‌ఎం, ఎక్సైడ్‌ ఇండస్ట్రీస్‌ షేర్లను పోర్ట్‌ఫోలియోలోకి చేర్చుకుంది. బ్యాంకింగ్, ఫైనాన్షియల్‌ రంగానికి చెందిన స్టాక్స్‌కు పెట్టుబడుల్లో అగ్ర ప్రాధాన్యం ఇచ్చింది. యెస్‌ బ్యాంకు, సిటీ యూనియన్‌ బ్యాంకు దీని పోర్ట్‌ఫోలియోలో ఉన్నాయి.

Advertisement
Advertisement