టాటా సన్స్‌ నుంచి సైరస్‌ మిస్త్రీ ఔట్‌ | Sakshi
Sakshi News home page

టాటా సన్స్‌ నుంచి సైరస్‌ మిస్త్రీ ఔట్‌

Published Tue, Feb 7 2017 12:55 AM

టాటా సన్స్‌ నుంచి సైరస్‌ మిస్త్రీ ఔట్‌

డైరెక్టర్‌ పదవినుంచి తొలగింపు
ఈజీఎమ్‌లో తీర్మానాన్ని ఆమోదించిన వాటాదారులు
టాటా గ్రూప్‌తో తెగిన చివరి అనుబంధం


ముంబై: టాటా గ్రూప్‌తో సైరస్‌  మిస్త్రీకి మిగిలిన చివరి అనుబంధం(హోదా పరంగా) తెగిపోయింది. టాటా సన్స్‌ డైరెక్టర్‌గా మిస్త్రీని తొలగించాలన్న తీర్మానానికి  కంపెనీ వాటాదారులు ఆమోదం తెలిపారు. సోమవారం జరిగిన అసాధారణ సర్వసభ్య సమావేశం(ఈజీఎమ్‌)లో డైరెక్టర్‌గా సైరస్‌ మిస్త్రీని తొలగించాలన్న తీర్మానానికి వాటాదారులు తగిన మెజారిటీతో ఆమోదం తెలిపారని టాటా సన్స్‌ పేర్కొంది. ఈ పరిణామం కారణంగా టాటా సన్స్‌ కంపెనీలో 18.5 శాతం వాటా ఉన్న షాపూర్జీ పల్లోంజీ కుటుంబానికి పదేళ్ల తర్వాత తొలిసారిగా ఆ కంపెనీ డైరెక్టర్ల బోర్డ్‌లో ప్రాతినిధ్యం లేకుండా పోయింది.

షాపూర్జీ పల్లోంజీ కుటుంబం ఈ కంపెనీలో 1965 నుంచి వాటాదారుగా ఉంది.1980లో మిస్త్రీ తండ్రి పల్లోంజీ షాపూర్జీ మిస్త్రీ డైరెక్టర్‌గా చేరారు. 2004లో వైదొలిగారు. రెండేళ్ల తర్వాత 2006లో సైరస్‌ మిస్త్రీ డైరెక్టర్‌ అయ్యారు.  ఆ తర్వాత ఆయన టాటా సన్స్‌  చైర్మన్‌ అయ్యారు. పనితీరు బాగా లేదంటూ చైర్మన్‌ పదవి నుంచి ఆయనను టాటా సన్స్‌ కంపెనీ గత ఏడాది  అక్టోబర్‌ 24న తొలగించింది. తదనంతరం  టాటా మోటార్స్, టీసీఎస్‌ తదితర ఆరు టాటా గ్రూప్‌ కంపెనీలు ఆయనను డైరెక్టర్‌గా తమ తమ డైరెక్టర్ల బోర్డ్‌ నుంచి తొలగించాయి.

విఫలమైన మిస్త్రీ ప్రయత్నాలు
డైరెక్టర్‌గా మిస్త్రీని తొలగించడానికి అసాధారణ సర్వసభ్య సమావేశం(ఈజీఎమ్‌) నిర్వహించనున్నామని గత నెలలోనే  టాటా సన్స్‌ ప్రకటించింది. దీనిని న్యాయపరంగా అడ్డుకోవడానికి మిస్త్రీ చేసిన పలు ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఈజీఎమ్‌ నిర్వహణను అడ్డుకోవాలంటూ మిస్త్రీ వేసిన పిటీషన్‌ను నేషనల్‌ కంపెనీ లా ట్రిబ్యునల్‌  ముంబై బెంచ్‌ గత నెల 31న కొట్టేసింది. ఈ ఈజీఎమ్‌కు వ్యతిరేకంగా మిస్త్రీకి చెందిన రెండు ఇన్వెస్ట్‌మెంట్‌ కంపెనీలు దాఖలు చేసిన పిటీషన్లను గత వారంలో నేషనల్‌ కంపెనీ లా అప్పిల్లేట్‌ ట్రిబ్యునల్‌ డిస్మిస్‌ చేసింది. దీంతో ఈజీఎమ్‌కు మార్గం సుగమం అయింది. ఈ ఈజీఎమ్‌లో డైరెక్టర్‌గా ఆయనను తొలగించే తీర్మానం ఆమోదం పొందింది. 

Advertisement

తప్పక చదవండి

Advertisement