69 శాతం తగ్గిన టాటా స్టీల్ నికర లాభం | Sakshi
Sakshi News home page

69 శాతం తగ్గిన టాటా స్టీల్ నికర లాభం

Published Sat, Feb 7 2015 1:53 AM

69 శాతం తగ్గిన టాటా స్టీల్ నికర లాభం

క్యూ3లో రూ.157 కోట్లే...
న్యూఢిల్లీ: ఉక్కు దిగ్గజం టాటా స్టీల్ నికర లాభం భారీగా పడిపోయింది. యూరప్‌లో మంచి పనితీరు కనబరిచినప్పటికీ, భారత్‌లో వ్యాపారం మందకొడిగా ఉండటంతో ఈ ఆర్థిక సంవత్సరం అక్టోబర్-డిసెంబర్ క్వార్టర్‌కు నికర లాభం 69 శాతం క్షీణించిందని టాటా స్టీల్ పేర్కొంది. గత ఆర్థిక సంవత్సరం క్యూ3లో రూ.503 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం క్యూ3లో రూ.157 కోట్లకు దిగిపోయిందని టాటా స్టీల్ గ్రూప్ ఈడీ (ఫైనాన్స్ అండ్ కార్పొరేట్) కౌశిక్ చటర్జీ వివరించారు.

ఆర్థిక పరిస్థితులు బాగా లేకపోవడం, ధరలు తగ్గడం, డిమాండ్ కనిష్ట స్థాయిలో ఉండడం, చైనా నుంచి దిగుమతులు పెరగడం, ఉక్కు తయారీకి అవసరమైన ముడి పదార్ధాల సమీకరణకు సంబంధించి భారత ప్రభుత్వ నిబంధనలు... ప్రభావం చూపాయని పేర్కొన్నారు. భారత కార్యకలాపాలకు సంబంధించి నికర లాభం రూ.1,519 కోట్ల నుంచి రూ.881 కోట్లకు తగ్గిందని, అలాగే టర్నోవర్ కూడా రూ.10,143 కోట్ల నుంచి రూ.9,897 కోట్లకు పడిపోయిందని వివరించారు. దేశీయంగా ఉక్కు ధరలు తగ్గడం వల్ల టర్నోవర్ తగ్గిందని పేర్కొన్నారు.

యూరప్ కార్యకలాపాల టర్నోవర్ రూ.20,709 కోట్ల నుంచి రూ.19,399 కోట్లకు తగ్గిందని పేర్కొన్నారు. గత ఏడాది ఉన్నట్లే ఈ ఏడాది కూడా యూరప్‌లో ఉక్కుకు డిమాండ్ ఉండగలదని, అయితే చైనా, రష్యా, తదితర దేశాల నుంచి దిగుమతులు పెరుగుతుండటంతో మార్జిన్లపై ఒత్తిడి ఉంటుందని తెలిపారు.

Advertisement
Advertisement