ఆరెంజ్కౌంటీతో టీసీఎస్ రాజీ.. | Sakshi
Sakshi News home page

ఆరెంజ్కౌంటీతో టీసీఎస్ రాజీ..

Published Thu, Aug 25 2016 12:23 AM

ఆరెంజ్కౌంటీతో టీసీఎస్ రాజీ..

2.6కోట్ల డాలర్లు చెల్లించిన టీసీఎస్
న్యూఢిల్లీ: సాఫ్ట్‌వేర్ సేవల సంస్థ టీసీఎస్ అమెరికాలోని క్యాలిఫోర్నియా రాష్ట్రానికి చెందిన ఆరెంజ్ కౌంటీతో న్యాయస్థానంలో కొనసాగుతున్న వివాదానికి ముగింపు పలికింది. 2.6కోట్ల డాలర్లు (దాదాపు రూ. 175 కోట్లు) చెల్లించేందుకు ఆరెంజ్ కౌంటీ(స్థానికంగా ఓ జిల్లా)తో అంగీకారానికి వచ్చింది. ఈ మేరకు టీసీఎస్‌తోపాటు, ఈ సంస్థ అమెరికా విభాగం టీసీఎస్ అమెరికాలు కలిసి ఆరెంజ్ కౌంటీకి 2.6 కోట్ల డాలర్లు చెల్లించాయి. టీసీఎస్, ఆరెంజ్‌కౌంటీ సంయుక్తంగా అభివృద్ధి చేయాల్సిన ఆస్తి పన్ను నిర్వహణ విధానంపై కొనసాగుతున్న వివాదాన్ని పరిష్కరించుకోవాలని నిర్ణయించినట్టు టీసీఎస్ అధికార ప్రతినిధి ఢిల్లీలో మీడియాకు తెలిపారు.  ఆరెంజ్‌కౌంటీతో సుదీర్ఘ న్యాయ ప్రక్రియను దృష్టిలో ఉంచుకుని మేజిస్ట్రేట్ జడ్జి గాంధీ మధ్యవర్తిత్వంతో ఇరు సంస్థలు రాజీ కుదుర్చుకున్నట్టు టీసీఎస్ ప్రతినిధి వెల్లడించారు.

 వ్యాజ్యాలు రద్దవుతాయి: ఆరెంజ్‌కౌంటీ
ఆటోమేటెడ్ ప్రాపర్టీ ట్యాక్స్ సిస్టమ్‌కు ప్రత్యామ్నాయం ఏర్పాటు చేయడంలో విఫలమైనందుకు టీసీఎస్, దాని అమెరికా విభాగం 2.6 కోట్ల డాలర్లు చెల్లించినట్టు ఆరెంజ్ కౌంటీ ప్రకటించింది. ట్యాక్స్ సిస్టమ్ 2010లో పూర్తయినప్పటికీ దాన్ని టీసీఎస్ డెలివరీ చేయలేకపోయినట్టు తెలిపింది. కాంట్రాక్టు విలువ 64 లక్షల డాలర్లు కాగా, పరిహారం మాత్రం ఇంతకు నాలుగురెట్లుగా ఉందని పేర్కొంది. పరి హారం చెల్లించినందున టాటాలకు వ్యతిరేకంగా దాఖలు చేసిన వ్యాజ్యం రద్దు అవుతుందని, అదే విధంగా తమపై దాఖలైన పిటిషన్ కూడా రద్దు అయిపోతుందని వివరించింది.

 ఆరెంజ్‌కౌంటీ ఆరోపణలు
‘ప్రాపర్టీ ట్యాక్స్ సిస్టమ్‌ను అభివృద్ధి చేసే విషయంలో మోసం, ఉద్దేశపూర్వకంగా, నిర్లక్ష్యపూరితంగా తప్పుదోవ పట్టించడం, కాంట్రాక్టును ఉల్లంఘించడం వంటి ఆరోపణలపై 2013లో ఈ సంస్థ టాటాలకు వ్యతిరేకంగా వ్యాజ్యం దాఖలు చేసింది. దానిపై ఈ నెల 2న న్యాయస్థానంలో విచారణ ప్రారంభమైంది.

Advertisement
Advertisement