Sakshi News home page

నోట్ల రద్దుతో తెలంగాణ ప్లాంట్‌ వాయిదా

Published Thu, Mar 9 2017 12:56 AM

నోట్ల రద్దుతో తెలంగాణ ప్లాంట్‌ వాయిదా

ఇంటెక్స్‌ డైరెక్టర్‌ అండ్‌ బిజినెస్‌ హెడ్‌ నిధి మార్కండేయ
విపణిలోకి ఏసీలు విడుదల


హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ఎలక్ట్రానిక్‌ ఉపకరణాల తయారీ సంస్థ ఇంటెక్స్‌ తెలంగాణలో ఏర్పాటు చేయనున్న ప్లాంట్‌ను పెద్ద నోట్ల రద్దు వెనక్కిలాగేసింది. గృహ, ఎలక్ట్రానిక్‌ ఉపకరణాల కొనుగోళ్లు ఎక్కువగా నగదు రూపంలోనే జరుగుతాయని.. అయితే నోట్ల రద్దుతో వ్యాపారం క్షీణించిందని దీంతో తెలంగాణ ప్లాంట్‌ ఏర్పాటును వాయిదా వేశామని ఇంటెక్స్‌ టెక్నాలజీస్‌ డైరెక్టర్‌ అండ్‌ బిజినెస్‌ హెడ్‌ నిధి మార్కండేయ తెలిపారు. బుధవారమిక్కడ ఎయిర్‌ కండీషనర్లను విడుదల చేసిన సందర్భంగా విలేకరులతో మాట్లాడారు.

 వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ) అమలు తర్వాత ప్లాంట్‌ ఏర్పాటుపై స్పష్టత ఇస్తామని పేర్కొన్నారు. త్వరలోనే ఉత్తరప్రదేశ్‌లోని కస్నా ప్లాంట్‌ను ప్రారంభించనున్నామని.. తొలి దశలో మొబైల్‌ ఫోన్లు, బ్యాటరీలు, చార్జర్లు, ఎల్‌ఈడీ టీవీలు తయారు చేస్తామని చెప్పారు. 20 ఎకరాల్లోని ఈ ప్లాంట్‌ సామర్థ్యం ఏడాదికి 35 మిలియన్లు. గతేడాది సంస్థ టర్నోవర్‌ రూ.6,400 కోట్లకు చేరుకుందని.. ఇందులో 33 శాతం దక్షిణాది, 8 శాతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల వాటా ఉంటుందని తెలిపారు.

 మొత్తం వ్యాపారంలో మూడేళ్ల నుంచి ఏటా 82 శాతం వృద్ధిని సాధిస్తున్నామని పేర్కొన్నారు. ఏడాదిలో ఏసీల విభాగంలో రూ.800–1,000 కోట్ల ఆదాయాన్ని లక్ష్యంగా పెట్టుకున్నామని పేర్కొన్నారు. ఈ ఏడాది ముగింపు నాటికి రష్యా, పలు సార్క్‌ దేశాల్లో ఉత్పత్తులను ఎగుమతి చేస్తామని చెప్పారు.

ఏసీల విభాగంలోకి...: కన్జ్యూమర్‌ ఎలక్ట్రానిక్స్‌ ఉపకరణాల తయారీ సంస్థ ఇంటెక్స్‌ తాజాగా ఎయిర్‌ కండీషనర్లు (ఏసీ)ల విభాగంలోకి అడుగుపెట్టింది. దక్షిణాది సినీ నటి కేథరిన్‌ ట్రెసా అలెగ్జాండర్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌గా బుధవారమిక్కడ విపణిలోకి ఏసీలను విడుదల చేసింది. సూపర్‌ సేవర్, స్లి్పట్, విండో ఏసీ 3 విభాగాల్లో 18 రకాల మోడల్స్‌ లభిస్తాయి. ధరల శ్రేణి రూ.21,990 నుంచి రూ.42,990 మధ్య ఉన్నాయి. ఇతర ఏసీలతో పోల్చితే 15 శాతం వేగంగా చల్లబడటంతో పాటూ 30 శాతం విద్యుత్‌ను ఆదా చేస్తాయని తెలిపారు.

Advertisement
Advertisement