టెలినార్పై వొడాఫోన్ కన్ను.. | Sakshi
Sakshi News home page

టెలినార్పై వొడాఫోన్ కన్ను..

Published Thu, Jul 7 2016 12:43 AM

టెలినార్పై వొడాఫోన్ కన్ను..

కొనుగోలుకు ఆసక్తికరంగా ఉందంటూ వార్తలు
స్వీడన్ మార్కెట్లో టెలినార్ షేరు జోరు

 స్టాక్‌హోమ్ : దేశీయ టెలికాం పరిశ్రమలో మరోసారి స్థిరీకరణ జరగనుందా...? మరో విలీన ప్రక్రియకు తెరలేవనుందా...? ఇప్పుడు మార్కెట్ వర్గాల్లో ఇవే సందేహాలు. నార్వేకు చెందిన టెలినార్ ఇండియా వ్యాపారాన్ని  హస్తగతం చేసుకునేందుకు వొడాఫోన్ పావులు కదుపుతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. టెలినార్‌ను కొనుగోలు చేసేందుకు వొడాఫోన్ ఆసక్తికరంగా ఉందన్న వార్తల నేపథ్యంలో... స్వీడన్ స్టాక్ మార్కెట్లో టెలినార్ షేర్ ధర బుధవారం 2.3శాతం ఎగసింది. స్పెక్ట్రమ్ ధర భారీగా ఉందని, కొనుగోలు చేయని పరిస్థితులే ఉంటే భారత్ మార్కెట్ నుంచి తప్పుకోవడం తప్ప వేరే మార్గం లేదని  ఇటీవల టెలినార్ అసహనం వ్యక్తం చేయడం కూడా తాజా వార్తలకు బలం చేకూరుతోంది.

భారత్‌లో దీర్ఘకాలం కొనసాగడం అనేది వృద్ధి చెందుతున్న డేటా మార్కెట్‌లో పోటీ పడేందుకు మరింత స్పెక్ట్రమ్‌ను సొంతం చేసుకోవడంపైనే ఆధారపడి ఉందని టెలినార్ సీఈవో సిగ్వే బ్రెక్కే ఏప్రిల్‌లో ప్రకటించారు. ఆచరణాత్మక విధానంలో తగిన అవకాశాలను పరిశీలిస్తామన్నారు. కాగా, రష్యాకు చెందిన సిస్టెమా శ్యామ్‌ను రిలయన్స్ అడాగ్ గ్రూప్ ఇప్పటికే కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ఇంగ్లండ్‌కు చెందిన వొడాఫోన్ సైతం హచిసన్ ఎస్సార్ సంస్థను కొనుగోలు చేయడం ద్వారా భారత టెలికాం మార్కెట్ అవకాశాలను చేజిక్కించుకున్న విషయం కూడా విదితమే.

తాజా పరిణామాలపై టెలినార్ షేరు కొనుగోలుకు సిఫారసు చేసిన డీఎన్‌బీ ఏఎస్‌ఏ అనలిస్ట్ క్రిస్టర్ రోథ్ స్పందిస్తూ... ‘గత కొన్నేళ్లుగా టెలినార్ పనితీరు  అంచనాలకు అనుగుణంగా లేదు. ఎన్నో కారణాల రీత్యా భారత్‌లో మరింత పెట్టుబడి పెట్టడం కంటే వీలైనంత సత్వరమే అక్కడి నుంచి వైదొలగడం తెలివైన పని అనిపించుకుం టుంది’ అని వ్యాఖ్యానించారు.

 టెలినార్‌కు 5 శాతం వాటా
ట్రాయ్ ఏప్రిల్ నెల గణాంకాల ప్రకారం టెలినార్‌కు దేశీయ మార్కెట్‌లో 5.2 కోట్ల మంది (5 శాతం) చందాదారులు ఉన్నారు. వొడాఫోన్ 19.8 కోట్ల మంది (19శాతం) చందాదారులను కలిగి ఉంది. 2008లో భారత మార్కెట్‌లోకి టెలినార్ ప్రవేశించింది. యూనిటెక్ సంస్థతో కలసి యూనినార్‌గా కార్యకలాపాలు మొదలుపెట్టిన ఆ సంస్థ... తర్వాత కాలంలో యూనిటెక్ నుంచి వాటాలను పూర్తిగా కొనుగోలు చేసి టెలినార్‌గా పేరు మార్చుకుంది. అయితే, వాయిస్ ఆదాయం తగ్గడం, డేటా ఆదాయం విభాగంలో పోటీ తీవ్రతరం కావడం, అందుకు తగినంత స్పెక్ట్రమ్ కొనుగోలు చేసేందుకు టెలినార్‌కు భారీగా పెట్టుబడులు అవసరం ఏర్పడింది. ఈ పరిస్థితుల్లో టెలినార్ భారత్ మార్కెట్ నుంచి వైదొలిగే అవకాశాలను పరిశీలిస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

Advertisement
Advertisement