లాప్స్ అయితే ప్రీమియం పెరగొచ్చు | Sakshi
Sakshi News home page

లాప్స్ అయితే ప్రీమియం పెరగొచ్చు

Published Sun, Aug 17 2014 12:17 AM

లాప్స్ అయితే ప్రీమియం పెరగొచ్చు

ఏదైనా ఆర్థిక ఇబ్బందులు తలెత్తితే ముందుగా చేసే పని అనవసరమైన ఖర్చులను తగ్గించుకోవడం. కాని ఇందులో చాలామంది అనవసర ఖర్చుల్లో బీమా ప్రీమియం చెల్లింపులను కూడా చేరుస్తున్నారు. కాని సకాలంలో ప్రీమియంలు చెల్లించకపోతే పాలసీ ప్రయోజనాలు ఆగిపోయి పాలసీ రద్దు అవుతుందన్న విషయాన్ని పెద్దగా పట్టించుకోవడం లేదు.

ఏ కారణం చేతనైనా పాలసీ లాప్స్ అయితే అత్యవసర పరిస్థితుల్లో సైతం మీ కుటుంబానికి ఎలాంటి బీమా సౌకర్యం, ఆర్థిక రక్షణ లభించదు. ఇది చాలా కుటుంబాలకు పెను విషాదాన్ని మిగులుస్తోంది. ఇలాంటి కేసుల్లో అత్యధికమంది ప్రీమియంలు సకాలంలో చెల్లించకపోవడం వల్ల ఎదురయ్యే సమస్యలపై సరైన అవగాహన లేకపోవడమే కారణం అన్నది తెలుస్తోంది.
 
సాధారణంగా బీమా కంపెనీలు ప్రీమియం చెల్లించాల్సిన సమయం దాటిన తర్వాత కూడా 30 రోజుల గ్రేస్ పిరియడ్‌ను అందిస్తాయి. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ప్రీమియంలు కట్టలేక రద్దు అయిన పాలసీలను పునరుద్ధరించుకోవడానికి కూడా అవకాశాన్ని కల్పిస్తాయి. పాలసీ నియమ నిబంధనలను అనుసరించి నిర్దేశిత కాలంలోగా పాలసీలను పునరుద్ధరించుకోవచ్చు. కొన్ని సందర్భాల్లో మరింత ఆలస్యం అయితే ఇలా పునరుద్ధరించుకునే అవకాశాన్ని కూడా కోల్పోతారు. దీనివల్ల అప్పటి వరకు చెల్లించిన ప్రీమియంలపై భారీగా నష్టపోవాల్సి ఉంటుంది.
 
ముందే చూడాలి
అందుకే పాలసీ తీసుకునే ముందే ప్రీమియం గ్రేస్ పిరియడ్, పాలసీ పునరుద్ధరణకు అవకాశాలు వంటి అంశాలను తప్పకుండా పరిశీలించాల్సి ఉంటుంది. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో పాలసీ పునరుద్ధరణ సమయంలో ప్రీమియంలు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. సాధారణంగా దీర్ఘకాలం చెల్లించకుండా ఆగిపోయిన పాలసీలను పునరుద్ధరించుకునేటప్పుడు ప్రాసెస్ మొదటి నుంచి మొదలవుతుంది. ఆరోగ్య పరీక్షలు, మోర్టాలిటీ చార్జీలు, ఒకవేళ ఆరోగ్య విషయంలో ఏమైనా తేడాలొస్తే ప్రీమియం ధరలు పెరుగుతాయి. అంటే మొదటిసారి పాలసీ తీసుకున్న ప్రీమియం కంటే చాలా ఎక్కువ ప్రీమియం చెల్లిం చాల్సిన పరిస్థితులు కూడా తలెత్తుతాయి.
 
సకాలంలో చెల్లించండి

ఇలాంటి సంక్లిష్ట పరిస్థితులు తలెత్తకుండా ఉండాలంటే ప్రీమియంలు సకాలంలో చెల్లించాల్సి ఉంటుం ది. ఇప్పుడు బీమా కంపెనీలు నేరుగా ఎలక్ట్రానిక్ క్లియరెన్స్ (ఈసీఎస్) ద్వారా ప్రీమియంలు చెల్లించే అవకాశాన్ని కల్పిస్తున్నాయి. ఈ విధానాన్ని ఎంచుకుంటే ప్రీమియం చెల్లించే సమయం గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉండదు. దీనికి తగ్గట్టుగా ముందుగానే ఆర్థిక ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు కాబట్టి, ఆర్థిక ఇబ్బందులు తలెత్తినా ప్రీమియం అనేది భారంగా పరిగణించే పరిస్థితి ఉండదు. పొదుపు తర్వాతనే ఖర్చు అనే సూత్రాన్ని అవలంబిస్తూ ప్రీమియానికి కావల్సిన మొత్తాన్ని ముందుగానే సమకూర్చుకోండి.

Advertisement
Advertisement